స్వప్న విహారం
ఈ క్షణం అనంతం
మరణపు కౌగిలి నుంచి వెలికి వచ్చినట్టు
మండే గుండెల మంట ఆరినట్టు
అలసిన మేనికి నీరందినట్టు
ఏమని చెప్పను ఈ క్షణాన్ని
నడి సంద్రంలో తీరం కనిపించినట్టు
రాలిపోతున్న మేనికి రెక్కలొచ్చినట్టు
చీకటికోటలో వెలుగు దివ్వె దొరికినట్టు
ఎలా చూపను ఈ ఆనందాన్ని
విజయతీరాన్ని చేర్చే చివరిఅడుగులో దాగిన ఉత్సాహం
విజయపు శిఖరంపై నిలిచిన క్షణమాత్రపు గర్వం
ఆ క్షణం అంతమెరుగని అనంతం
ఆ ఆనందం ఎంత చూచినా తరగని సాగరం
ఆ ఉత్సాహం మరో మజిలీకి శ్రీకారం
నాతో పోరాటం
పోరాటం నాతోనే
విజయం నాకే, అపజయమూ నాదే
నాతో నాకే శతృత్వం
నాపై నాకే లాలిత్యం
ప్రణయపు అరణ్యంలో
వేచి చూస్తున్న కన్యను చేపట్టమని పరుగులు తీసే మనసు
అది ప్రణయపు అరణ్యము కాదు,
ప్రళయాలను దాచిన ఎడారి అని అడుగాపే తెలివి
ఎడారి కాదది ఇరు ఎదలకు పరచిన దారని
పరుగిడమని ముందుకు పోయే మనసు
ఈ రెంటి పోరాటంలో గెలిచిన వారికి తోడుగా విధి
విధిని గెలిచే ప్రయత్నం కాదిది, వలచే ప్రయత్నమిది
విజయతిలకమైనా, వీరస్వర్గమైనా చేపట్టేది నేనే
మనసూ, తెలివి కలిసిన చోట పోరాటం జరగదు, జరిగేది పయనం
మనసూ, తెలివి పోరాడిన నాడు వచ్చేది ప్రళయం,
ప్రళయం నుంచి దూరంగా పయనం జరపాలి,
పయనిస్తూ విధిని తోడుగా తీసుకుపోవాలి
కలలు – నీటి మీది రాతలు
కలలా వస్తావు, కలలా పోతావు
కలంరాతలా కలకాలముండరాదా
నీ ఊహలో వెచ్చబడి నిదురపోదు మేని
నిదురరానిదే కలలో కానరాదు నీ రూపు
కలలన్నీ కల్లలని కలలు కనని వారే అంటారట
కలలు వచ్చేది నిదురలోనా ?
కలలను స్వాగతించ వచ్చేది నిదురా ?
కలలన్నీ నీటి మీద రాతలట నిజమేనా ?
అవి మనసున్నవారే చదవగలరని చెబితే ఏమంటారో
రాతలు రాసిన చేతులేవని అడుగుతారా
నీటిలో వచ్చే తరంగాలను తోడు చూపనూ
మనస్సనే నీటిలో ఊహలనే చేతులు రాసే గీతలే కదా కలలు
ఆ మనో కడలి లోతు చూసినదెవరులే
ప్రతి ఉషస్సున తోడున్న నీతోడి కలలేగా
కలలన్నీ నీటి మీది రాతలే
కొన్ని రాతలు రాస్తూనే చెరుగుతాయి, ఎవరో చేయాడించినట్టు
కొన్ని రాతలు సుడిగుండాలను సృష్టిస్తాయి, ఎవరో చెయ్యిపెట్టి తిప్పినట్టు
కొన్ని రాతలు నీటిలోతును చేరి కలకాలముంటాయి, నదీ గమనాన్ని నిర్ధేశించే మలపులులా
శూన్యం-నిశ్శబ్దం-నడుమ నేను
ఏ శబ్దాన్ని హరించి వచ్చిందో ఈ నిశ్శబ్దం
ఏ అనంతాన్ని తనలో దాచుకుందో ఈ శూన్యం
పలుకరాని భాష అది, పలికితే వినబడదు మరి
ఆ భాష తెలియని మనిషి లేడు.
కొందరి హృదయఘోష ఆ భాషలో రోదన గీతాలు పాడుతుంది
కొందరి ఏకాంతవేళ ఆ భాష గంధర్వగీతాలు పాడుతుంది
కొండంత భాధకు ఉప్పెనంటి సాంత్వన కలిగిస్తూ
ఉప్పెనంటి ఆనందంలో లోయంటి లోతులు చూపుతూ
ప్రశ్నకు సమాధానాన్ని చేరువ చేస్తూ, ఆ రెంటి మధ్యా తానే నిలుస్తూ
హృదయంతో పలికే భాష అది, కన్నులతో పాడే గానమది
చూడలేని చిత్రమది, చూస్తే నిలువదు మరి
ఆ చిత్తరవు చూడని ప్రాణి లేదు
కొందరి ఎదురుచూపులు ఆ చిత్తరవుపై పైశాచిక నృత్యం చేస్తాయి
కొందరి విజయహాసాలు ఆ చిత్తరువుపై ఆనందతాండవమాడతాయి
అంతు వెతికే చూపులకు అంతం చూపుతూ
అనంతమని ఎగసిపడే చూపుల అలుపు తీర్చుతూ
అనంతాన్ని తనలో బంధించి, అంతలోనే అంతాన్ని చేరువ చేస్తూ
కన్నులు చూడలేని చిత్రమది, మది గదిలో బందీ అయిన అపురూప చిత్రమది
మది పలికించే నవరసాలూ ఆ భాషకు అచ్చులు
హృది ఆలాపించే సప్తస్వరాలూ ఆ చిత్తరువపై నడకలద్దిన హరివిల్లు
ఆ భాషకు లొంగని భావమూ, ఈ చిత్తరువులో కనపడని మదిచిత్రమూ ఎచ్చోటనూ లేవు
ఆ భాషలో ఆలాపన చేసే గానగంధర్వుడు ఎవడు?
ఈ అపురూప చిత్తరువు గీసిన చిత్రకారుడెవడు?
ఆ రెంటి నడుమా నను పడదోసి ఆ చిత్రాన్ని గీసి సుస్వర గానాలాపన చేస్తున్న అనంతుడెవడు
ఆ భాషరాని మూగవాడిని, ఆ చిత్రం చూడలేని అంధుడిని
క్షణానికో రాత, ప్రతీ రాతకు ఓ గీత, ఆ గీతకు చాటున ఓ రేఖ
నుదుటి మీది రాతలు
అరచేతిలో దాగిన రేఖలు
అరికాలి కింద గీతలు
రాతల బందిఖానాలో దాగిన మస్తిష్కపు శక్తి
రేఖల సంకెళ్ళకు బందీయై బిగియని పిడికిలి
గీతల వలలో చిక్కుకుని పరుగిడని అరికాలు
క్షణంలో మారిపోయే గీతల రాతల రేఖలతో
చిక్కుముడులు వేసి పొడుపు కధ విసిరావు
నీ పొడుపుకధను ఒడుపుగా విప్పలేనా
ఒక ముడి విప్పితే మరో ముడి బిగిసే పొడుపు కధ నీది
భలే కధకుడివి నీవు
అనంతమైన ముడులు వేసి బంధించేసావు
అనంతసాగర సమాన ఆలోచనలు మెదడున పెట్టి
నుదిటిరాతల ఆనకట్ట మాటున బందీ చేసావు
ఆ సాగర సమాన ఆలోచనలు ఎగసిపడి
నీ పొడుపును విప్పుతాయనా
నుదిటిరాతల బందీఖానాలో మెదడును ఖైదు చేసి
క్రోధావేశాలను కాపు పెట్టావు
పిడికిలి బిగించి ముడులు తెంపుకుపోతాననా
హస్తరేఖల సంకెళ్లను వేసి
పిడికిలి బిగియనీయని మోహానికి తాళమిచ్చావు
అరికాలిలో శక్తిని నింపి పరుగెత్తి ముడులను చీల్చుకు పోతూ
నీ పొడుపు అంతు చూస్తాననా
గీతలతో వలను వేసి
ఆ వలపై కోర్కెలు చల్లి బందీను చేసావు
ఒకనాడు క్రోధావేశాలను అదుపున పెట్టి
మెదడును బందిఖానా నుండి విడిపించి
అడుగేసానో లేదో మోహవీచికలో జారిపడి
మరలా బందీనైతిని
మరోనాడు మోహాన్ని వశం చేసుకుని
సంకెళ్ళ తాళాన్ని తెంపుకుని పిడికిలి బిగించేంతలో
క్రోధావేశాల ధాటికి మళ్ళీ సంకెళ్ళలో బందీనైతిని
ఇక కోర్కెల బారిన పడక ముందుకు పోతుంటే
ఎటు నుంచో మోహినినంపి మరోమారు వలలో
బందీని చేసితివి
ఏమిటయ్యా ఆ పొడుపుకధ వెనుక దాగిన కధ,
నువ్వైనా గుట్టు విప్పి చెప్పవయ్యా
***************
రాతలు బందిఖానా కాదేమో ?
అవి మెదడున దాగిన ఆలోచనలకు ద్వారాలేమో
ద్వారాలు దాటుకు ముందుకు పోతే ఆలోచనల సాగరము
రేఖలు సంకెళ్ళు కావేమో,
అవి పిడికిలిమాటున దాగిన ఆయుధాలేమో
గీతలు వల కాదేమో,
కోర్కెలను బంధించి పరుగులో తోడుండే సైన్యమేమో
నీటి మీది రాతలు... నిన్న రాతిరి శపథాలు
దూరాన మబ్బుల చాటున దాగిన చంద్రుడు నెమ్మదిగా వెలికి వస్తున్నాడు
******
మొన్న రేయి స్వప్నంలో మన కలయిక,
నిన్నరాతిరి ఊసులలో జీవితాంతం నీ తోడు వీడనన్న నీ శపధం
రేపటి రోజుకు ఎదురుచూస్తూ ఎదపాడిన జోలపాటలో
అటుపిమ్మటి రోజున రాబోయే బంగరురోజుల కలలో
తనువు అలిసినా నా మది నాట్యమాడుతూనే ఉంది
******
ఇంతలో ఆకసాన్ని చీలుస్తూ రాలిపడింది తోకచుక్క
******
మొన్న రేయి స్వప్నాలు, నిన్న రాతిరి శపధాలు
నీటి మీద రాతలా? క్షణ మాత్రపు ఆనందాలా?
రేపటి గమ్యాలు, అటు పిమ్మటి బంగరుకలలు
నిప్పులోన పుల్లలా? బూడిదయ్యే కలలా?
నేటి నా హృదయఘోషను పలుకు భాషేది?
ఉప్పొంగి పొంగే కన్నీటిఅలలలో దిక్కు తెలియని పత్రమైనది నా మనసు
******
కొన్నాళ్ళకు తోకచుక్క రాలిన చోటున గుర్తు తెలియని రాళ్ళు కానవచ్చాయి, అవి వజ్రాలు
******
ఆనాటి నీటి మీది రాతలు,
నేడు శిలాశాసనాలై నా మది శిలపై నిలిచాయి
ఆనాటి నిప్పులోని పుల్లలు,
నేడు కొత్త చిగురుతో చిరునవ్వు నవ్వాయి
******
వజ్రాల గనే కావచ్చు,
కానీ అది భూమి గుండెపై చేసిన గాయం ఇంకా కనిపిస్తూనే ఉంది
నీవు లేని లోటు కనిపిస్తూనే ఉంది
(ఇది ఒక ఊహాయత్నం, "నీటి మీది రాతలు... నిన్న రాతిరి శపథాలు" అన్న వాక్యం చుట్టూ నేను అల్లుకున్న పదబంధమిది.
కొన్ని కవితలు భావోద్వేగంతో కాదు, భావాన్ని వెలికితీసే యత్నంలో వస్తాయి. ఇది కూడా అలాంటిదే.
ఇది ఏ విభాగమో నేను చెప్పలేను, ఇది సానుభూతితోనో, బాధతోనే రాసిందైతే కాదు.
ఒకవేళ అలాంటి భావన మీ మనసులో కలిగితే అది మీ సున్నిత హృదయమే, దానికి నా జోహార్లు)
సమాధానము తెలియని ప్రశ్నలు
నిశీధి నిశ్శబ్దంలో నే పెట్టిన పెనుకేక నిను చేరే ఉంటుంది
వినబడినా బధిరునిగా ఏల నటించితివి
తామసి నలుపును కడుగుతూ పెల్లుబికింది నా రుధిరం
కళ్ళుండి కనబడని అంధునివైనావేల
సాయం కోసం నే పాడిన ఆక్రోశగీతం నీ చెవుల తాకే ఉంటుంది
మాటరాని మూగవాడివైనావా నా పాటకు బదులీయవేమి
సూరీడు వెలికి వచ్చాడు కదా, ఈ పాటికి నా సందేశం నిను చేరే ఉంటుంది
నా సందేశం నిను చేరలేదా ? పావురాన్నైనా పంపవేమి
మిట్టమధ్యాహ్నపు సూరీడు ధాటికి దాహార్తుడనై కదలలేని రాయిలా
నా తనువు చేసిన మూగరోదనైనా కానరాలేదా
సూరీడి అస్తమయం చూస్తూ నిస్సహాయుడనైతిని,
నీ సహాయమెపుడు చేరునో
వెలికి వచ్చిన చంద్రుని చూసి, పక్కనున్న చుక్కలు చూసి
ఆ చుక్కలలో నీ చూపు పంపావని ఎదురు చూసా,
ఎచట నిలిచాయి నీ చూపులు
మస్తిష్కపు ఆలోచనలు ఆగిపోతున్నాయి,
మనసు ఆత్మను వెతుకుతూ పోయింది
చుక్కల పందిరి కింద శరీరం ఒంటరయ్యింది
బహుశా ఇది మరణమేమో,
నా తనువైనా తడిమి వీడ్కోలు ఇస్తావా???
ఎచట దాగితివి?
ఆత్మాకారుడనై నిను అడిగెదననుకొన్న ప్రశ్నలు గురుతు రావేమి?
ఏ మాయ చేసితివి?
నిరాకారుడనైతినేమి?
(ఈ ప్రశ్నలలో అనేక కధలున్నాయు, అనేక కన్నీటి వ్యధలున్నాయి,
ఉప్పెన ముంచెత్తి, భూమి ప్రకోపించి, అగ్ని జ్వలించి, పిడుగులు పడి, సుడిగుండమంటి వాయువులు వీచి
పోరాడి ఓడిన బతుకులున్నాయి. మీ హృదయము రాల్చే కన్నీటిబొట్టును పెద్దరికపు హోదాలోనో, కన్నుల పరదాలోనో దాచెయ్యద్దు)
చేప చంద్రుడు
మా ఊరి చేపల హృదయమూ, ఆ చంద్రుడు ఒకటేనట
మేఘాల కోసం పిచ్చిచూపులు చూస్తూ ఎదురు చూస్తుంటాయి
హృదయంలో మౌనంగా ప్రార్ధిస్తుంటాయి మేఘాలను రమ్మని
ఆ తపోశక్తికి వచ్చిందో తేజస్సు
చంద్రుని చుట్టూ దూరంగా ఏర్పడిందొక రంగుల వలయం
తపము తీవ్రత పెరుగుకొద్దీ తేజస్సు యా హృదయములోనే కలిసింది
చంద్రునిలో లీనమయ్యింది ఆ రంగుల వలయము
మేఘ దర్శనముతో పులకించింది మత్స్యము
చేపలకు వల వేసి పట్టారు జాలరులు
తపోశక్తి తగ్గసాగింది
హృదయతేజము మసకబారసాగింది
అమాస వచ్చి అదృశ్యమై మరల వచ్చాడు చంద్రుడు పున్నమితో
ఈ సారి చంద్రుని చుట్టూ కానరాలేదు ఆ వలయము
బహుశా చంద్రుడు తపము చేయబూనినాడేమో
మరో వరుణకాలము కొరకు, ఏనాటికి ఫలించేనో ఆ తపము,
(మరువం ఉష గారు చేయుచున్న జలపుష్పాభిషేకానికి నేను సమర్పిస్తున్న మూడవ జలపుష్పమిది)
చేప చెప్పిన ఊసులు
అంత:పుర భవనమ్మున అలక పూనెను ఓ రాణి
అలకపాన్పును వదిలి సైకతపానుపుపై పవళించెను ఆ సొగసరి
చిలక తెచ్చిన కబురందుకొని సైకతవేదికనలంకరించెను రాతిగుండె రారాజు
పలుకరింప మొగము తిప్పుకొనె ఆ వయ్యారి
భామతో వైరిమార్గమేలనని ఒరలోన దాచె కరవాలము, చేత ధరించె జాలము
ఎటుల అలక తీర్చునోయని ముచ్చట చూచుచుండె పున్నమిరేడు
ఈ జంట చింత తెలియని ఒక కుర్రచేప పక్కనున్న కొలనున నింగిని ముద్దాడ ఎగిరి దూకె
ఆ చేపను చూడగనె చిరునవ్వు వెలికివచ్చె భామ మోమున
ఒక వింత ఆలోచన వచ్చె ఆ మగని మనసున
"కనులు మూయక నా కొరకు ఎదురు చూచుచూ
నన్ను ముద్దాడ ముందుకు దూకి అంత మరల వెనుకకు మరలి
ఏలనో నీకీ పంతము. ఎదుట నే నిలిచినా అంతలో వెనుకకు మరులటేల "
అని చేపతో పలుక, గడసరి మగువ
"కనులు మూసిన ఎచటకు పోవుదువోనని నిదురునైనా కనులు మూయకుంటుని
కనులముందున్నా చెంతకు చేరకుంటివి
చెంతకు చేర నే దుమికినా దరికి చేరనంటివి"
అని తానే మత్స్యసుందరియై సమాధానమిచ్చె
ఇది విన్న యా చేప
"అది అలక కాదు,కులుకేనని తెలియని రాజువైతివి
మంచిదైనది కోపాన్ని మనసు పొరన దాచి,
నవయువకుడవై సమ్మోహనుడవై చేప కన్నుల సుందరి కొరకు వచ్చితివి
మనసున దాగిన ప్రణయమును మాటన చెప్పకుంటివి
నటనమున చూపకుంటివి
నా విహారము చెప్పించినదిలే నీ మనసున దాగిన ప్రణయపు మాట"
అని తర్కించి ఆ రాజు జాలమున ప్రవేశించె,
యా చేపను చేతిన తీసుకుని ముద్దాడబోవ,
మీనాక్షియగు యామె కించిత్ అసూయన జలపుష్పమును జన్మస్థలమునకు చేర్చె
అలకయేల వచ్చెనో మరిచెను యామె
జాలమేల తెచ్చెనో మరిచెను ఈతడు
సైకతపానుపుపై విరహమును మరచి విహారము సాగించుచుండిరి
ఈ విహారము చూచిన యా పున్నమిరేడు మబ్బుల కిటికీ మాటుకు చేరి మరో జంట ఎచటా యని శోధించసాగె
(మరువం ఉష గారు చేయుచున్న జలపుష్పాభిషేకానికి నేను సమర్పిస్తున్న జలపుష్పమిది)