శృంగార దేవత

చుట్టూ చీకటి ముసుగు కప్పుకుని రాత్రి వచ్చింది
నాపై మోజు పడ్డ ఆకాశంలో తారలన్నీ కలిసి నా వైపే కైపుగా చూస్తున్నాయి ప్రపంచం మొత్తం అసూయ పడేలా
చుక్కలను కలిపే ముగ్గులా తారల మధ్యన తెల్ల మబ్బులు
ఆ తారలన్నీ మబ్బులతో కలిపి బాణంగా చేసి నావైపు వదిలాడు మన్మధుడు
గాలిలో తేలుతున్న దూదిపింజలా మబ్బుల బాణం నావైపు దూసుకు వచ్చింది
మబ్బుల్లో దాగిన మత్తుమందు నా మీద జల్లి,
తారలన్నీ ఒంటినిండా పరుచుకుని నన్ను కౌగలించింది చల్ల గాలి
సుకుమారమైన ఆమె స్పర్శకు ఒళ్ళంతా ఒక్కసారిగా వెచ్చబడింది
చలిలో దాగిన వేడి నా ఒంటరితనాన్ని బూడిద చేసింది
ఆ గాలిలో దాగిన శృంగార దేవత, నా శరీరాన్ని నిలువెల్లా ఆక్రమించింది
కాలితో పెనవేసుకుని, ఛాతిపై పరుండి, భుజంపై తలవాల్చి
తనతో తెచ్చిన హిమాన్ని పన్నీరులా నాపై చిలకరించింది
ఏమీ మధ్యన రాలేనంతగా నేనూ గాలి పెనవేసుకున్నాం
ఉత్తరం నుంచి దక్షిణం వరకు తానే నాతో
తూర్పూ పడమరల మధ్యలో మేము
(బాల్కనీలో ఒక రాత్రి ఒంటరిగా నుంచున్నప్పుడు వచ్చిన తుంటరి ఆలోచన)