క్షణం కొలత


క్షణాన్ని కొలిసే సాహసం చేసాను
కొలతబద్ద కోసం నాకు తెలిసిన ప్రపంచమంతా తిరిగాను
ఒక్కోచోటా ఒక్కో కొలత వచ్చింది
నాకు కొత్త పరీక్ష తెచ్చింది

అసలు కొలత చెప్పమని ఎవరిని అడగాలి?
ఒక్కొక్కరిదీ ఒక్కో భాష్యం, వారి కొలత వారి లోకానికే పరిమితం

క్షణాన్ని ఎలా కొలవను?
కాలంతో మారే సాధనాలు పనికిరావు
కాలంతో మారే భాష్యాలు పనికిరావు

క్షణంతో సంబంధం లేని సాధనం కావాలి
ఎక్కడ నుంచుని కొలవాలి క్షణాన్ని?
కాలాతీతమైన వేదిక అధిరోహించాలి

ఎలా ఎక్కాలి ఆ వేదికను?
కాలంతో మారే “నేను” ఎలా కాలాతీతపు వేదికను అధిరోహించాలి?
నన్ను వదిలి మనగలిగిన “నేను” ఎవరు?
క్షణాన్ని కొలవబోయిన నా మెదడు
అల్పమై వెర్రిచూపులు చూస్తోంది

క్షణం కొలత చెప్పగలిగేది ఎవరు?
నాలోపలి నుంచి ఒక గొంతుక పలకరించింది
“నేను” లేని నా గొంతుక వినడానికి కొత్తగా అనిపించింది
అరుణ కిరణాలు నిశీధిని చీల్చినట్టు “నేను” అదృశ్యమయ్యాను


నాలోని జీవాత్మకు నా మెదడు సాగిలపడి మొక్కింది
క్షణం కొలత చెప్పే క్షణం వచ్చింది
మరుక్షణం “నేను” లేను, నా ప్రశ్న లేదు, ఈ రచన లేదు

గుర్తుందా నేస్తమాగుర్తుందా నేస్తమా
చివరిసారి ఎప్పుడు ప్రపంచాన్ని జయించావో?
చివరిసారి ఎప్పుడు నీవే ఒక శిఖరమై నిలిచావో?
మనోఫలకంపై స్తంభించిన ఆ క్షణం గుర్తుందా?

గుర్తుందా నేస్తమా
చివరిసారి ఎప్పుడు పరిగెత్తావో?
చివరిసారి ఎప్పుడు నీ జీవకణాలు జీవించాయో?
మనోఫలకంపై స్తంభించిన ఆ క్షణం గుర్తుందా?

గుర్తుందా నేస్తమా
చివరిసారి ఎప్పుడు కాలాన్ని ఎదిరించావో?
చివరిసారి ఎప్పుడు నవ్వుతూ రోదించావో?
మనోఫలకంపై స్తంభించిన ఆ క్షణం గుర్తుందా?

నీ విజయాలు గుర్తున్నాయా?
అమ్మ కళ్ళలో కాంతి వెలిగించిన నీ విజయం
నాన్న మీసంపై మెరిసిన నీ విజయం
ప్రేయసి పెదవిపై విప్పారిన నీ విజయం
ఆత్మీయుల విజయాలు నీవని నమ్మిన విజయం
నీ విజయాల శిఖరాగ్రంపై పతాకమై రెపరెపలాడే నీ జీవనజ్యోతి గుర్తుందా?

చివరిసారి విశ్వమంతా నీవారని ఎప్పుడు నమ్మావో?
చివరిసారి ఎప్పుడు కోరికని జయించావో?
నిర్మలంగా మెరిసిన మనోవజ్రపు వెలుగులు గుర్తున్నాయా?