నిశీధిలో నువ్వే, ఉషస్సులో నువ్వే

 

తామసి నీడన నేను తామసుడనవ్వగా
తామసమునున్న నాలోని కామకుడు నిదుర లేవగా
ఆ నిశీధిలో ఆ కామకునినెదిరింప నీవే
ఆ కామకునితో రసక్రీడలో నిస్త్రాణవైనావా

తామసి నీడను పారద్రోల దినకరుడు ఉదయించ
నాలోని కామకుడు అలసి సొలసి నిదురపోవ
ఈ ఉషస్సున నాలోని సాత్వికుని నిదురలేప నీవే
ఆ సాత్వికుని సత్యయాత్రలో తోడైనావా

సత్యయాత్రలో నీ తోడు నాకుండ నాకెదురేదని భావింప
నాలోని రాజసము నిదురలేవ కించిత్ గర్వమున
నిన్నే మరచిన రజోయోగమున  నీవే
నా రజోగుణంబు హరింప నియంతవైనావా

సర్వకాలమ్ముల సర్వయోగమ్ముల
నన్ను విడువక నా నీడవలె ఉంటూ నా
హృదయాంతరంగమున ప్రతిధ్వనించు
అనంత జీవన రాగము నీవేనైనావా

(ప్రేరణ: నా స్నేహితుడు మనోహర్ తన గూగులు టాక్ లో పెట్టిన స్టేటస్
"నిశీధిలో నువ్వే, ఉషస్సులో నువ్వే! నియంతవై నువ్వే, నా హృదయాంతరంగవై నువ్వే!!")

ఎందుకు నాకీ పరుగు


ఎప్పుడు మొదలయ్యిందో తెలియదు నా ఈ పరుగు
చిన్నప్పటి బుడి బుడి నడకలలోనా
పలక మీద ఓనమాలు దిద్దినప్పుడా
ఆత్మీయులపై అలకతో ఆకలితో పడుకున్నప్పుడా
అల్లరి చేసినందుకు బళ్ళో బెత్తం దెబ్బలు,
   మోకాలి శిక్షలు అనుభవించినప్పుడా
ఎదురింటి అమ్మాయి నన్ను చూసి కొంటెగా నవ్వినప్పుడా
బంగరు గాజులు చూసి ముచ్చటపడిన అర్ధాంగి
   కళ్ళలో కాంతి చూడాలనుకున్నపుడా
ఐస్ క్రీము కొనివ్వమని నా ముద్దుల పాప అడిగినప్పుడా
క్రికెట్ బాట్ కొనివ్వమని నా చిన్నారి బాబు కోరినపుడా

.

.

.

.

.

.


ఎందుకు నాకీ పరుగు ....
ఎవరికివ్వను నా గెలుపు ?