కృష్ణబిలం - మహాకాలుడు


ఏదో తెలియని శక్తి నన్ను తనలోకి ఆకర్షిస్తోంది

నా అస్తిత్వాన్ని శాసిస్తున్న శక్తిని పంచేంద్రియాలతో ప్రశ్నించాను

నిలదీసిన నా వాక్కులు శూన్యంలో లీనమయ్యాయి
క్రోధించిన నా నయనాలు శూన్యంలో బందీలయ్యాయి
ఎదిరించిన నా గమనాలు గమ్యంలేని వైపు మరలిపోయాయి
ఉచ్వాస  నిశ్వాసాలు నా అనుమతిని అతిక్రమించాయి
అన్ని శబ్దాలు దూరమై నా ఆహ్లాదాన్ని హరించాయి

ఒక యోగి ప్రయత్నపూర్వకమై చేసేవి నా ప్రమేయం లేకుండా నాకు  జరిగాయి

నేన్నవాడిని కృష్ణబిలంలోకి లాగబడ్డాను
ఒక్కో కణం కోట్ల అగ్నిపర్వతాల శక్తిగా ఉంది
ఆశ్చర్యం, నేను కూడా ఒక కణాన్నే

చుట్టూ తేరిపారా చూసాను,
రంగు చెప్పలేను కనుక నలుపంటాను ఆ ప్రాంతాన్ని
ఒకదానినొకటి పెనవేసుకుంటూ పాముల్లా అనేక కణాలు
కదలిక లేదు కనుక కాలం ఓడింది అంటాను
కొన్ని కృష్ణబిలాలు కనుపాప పరదాలో దాక్కుని ఉన్నాయి
స్వర్గవాహిని నాపైన కృష్ణబిలాల మధ్యలో ప్రవహిస్తూ ఉంది

ముందుకు తొంగి చూసాను,
శక్తిని కొలుద్దామని ఎగురుతున్న హంసలు, తవ్వుకుంటూ వెళ్తున్న వరాహాలు
అనేక లోకాలు, అనేక సృష్టి లయ క్రియలు, అనేక కాలాలు అన్నీ ఒకసారే చూస్తున్నాను
అనేకులు వస్తున్నారు, కృష్ణబిలంలో పడుతున్నారు
వారిలో కొందరు కపాలాలుగా మారి నా  పక్కనే ఉంటున్నారు
అనేక కృష్ణబిలాలు రాలిపోతున్నాయి, ఒక భీకరాకారంగా మారి యుద్ధం చేస్తున్నాయి
ఆది అంతం తెలీని స్థితిని నేను చేరుకున్నాను

ఉపసంహారం:
శివుని ఝటాఝూటం అనేక కృష్ణబిలాల సమూహంగా,
మహాకాలుని మెడలో తిరిగే పాములు మరికొన్ని కృష్ణబిలాలుగా ఊహిస్తే,
శివైక్యం అంటే ఆ కాలుని సన్నిధిలో అనంత శక్తివంతుడిగా ఒదిగి ఉండడమే

లింగోద్భవ వేళ హంసపై ఎగిరిన బ్రహ్మ, వరహామై తవ్వుకుంటూ వెళ్లిన విష్ణువు;
శివుని మెడలో ఉండే బ్రహ్మకపాలాలు;
ఒకనాడు జటల నుంచి ఉద్భవించిన వీరభద్రుని విజయం ఆ జటల శక్తికి ఒక సాక్షి 

మిత్రుడు

అతనితో సంభాషించనిదే నా ఉదయం తెలవరాదు
ఆ సంభాషణ అనేక విధాలుగా ఉంటుంది, అతని విస్తార జ్ఞానమల్లే
ప్రతీ సంభాషణా నా అజ్ఞానాన్ని హరిస్తూ ఉంటుంది

అతని కబుర్లు ఋతువులవలే భలే చిత్రంగా ఉంటాయి
హేమంత బిందువుల్లా ఉల్లాసాన్నిస్తూ, హఠాత్తుగా గ్రీష్మమై ఆవేశపడతాయి
వర్షంలా ఆర్ద్రత కురిపిస్తాయి శిశిరమై నమ్మకాలను కుదుపుతాయి
శరత్ రూపమై చల్లబరుస్తూ  వసంతమై  విహారాలు చేయిస్తాయి

ఎక్కడున్నావని తలెత్తి చూస్తే ఇదిగో అంటూ సహస్రకిరణాలతో ఆలింగనం చేసుకుంటాడు

అతని ముందు నే చిన్నిపిల్లాడినై నిలుచుంటా
నిత్య యవ్వనంగా ఉంటూ నాతో మబ్బుల చాటున దోబూచులాడుతుంటాడు

పంచభూతాలూ ఒక్కటై అతని మాటలు నాలాంటి వారికి తర్జుమా చేస్తుంటాయి

ఒకనాడు కొండపై నుంచుంటే పిల్లగాలి హోరు మధ్యలో అతని మాటలు విస్పష్టమై వినిపించాయి
మరొకనాడు సముద్రతీరంలో నడుస్తుంటే అలలు స్పర్శిస్తూ తడిమి పలకరించాయి
రోహిణీకార్తిలో పగిలిన రాళ్ళ సెగలు అతని ఆవేశాన్ని రుచి చూపించాయి
మబ్బులు కమ్మిన రోజుల్లో మట్టివాసన అతని మాటల ఘుభాళింపు చాటింది
గ్రహణాలు దాచలేని అస్తిత్వం అనంతమై అతన్ని దర్శనం చేయించింది

విశ్వంలో ఎక్కడ ఉన్నా నా వెంట ఉండే ఏకైక ప్రియనేస్తం, సూర్యుడు
"ఆ ఉషాకిరణాలు తిమిర సంహరణాలు,
నిత్యం తిమిరాన్ని ఖండించే ఖడ్గాలు "

క్షణాల ఉయ్యాల

బుడిబుడి అడుగులు నావైపు తడబడి వస్తుంటే
కాలం వెనక్కెళ్ళి
ఆ అడుగులు నావైన క్షణం చూడాలని

పసిపసి నవ్వులు నన్ను చూసి నవ్వుతుంటే
కాలం వెనక్కెళ్ళి
ఆ నవ్వులు నే నవ్విన క్షణం అనుభవించాలని

అలసిన ఒడలు  నా ఛాతెక్కి  ఆదమరచి నిదురోతుంటే
కాలం వెనక్కెళ్ళి
ఆ కనుపాపలు నావైన క్షణం నిదురోవాలని

నా గుప్పిట మూసిన శూన్యమైనా సంబరంగా తడుముతుంటే
కాలం వెనక్కెళ్ళి
ఆ సంబరం నాదైన క్షణం ఆనందించాలని

నే చెప్పే ఊసులు ఏవైనా ఊ కొట్టి అబ్బురపడుతుంటే
కాలం వెనక్కెళ్ళి
ఆ అబ్బురం నాదైన క్షణం

తండ్రిగా నే అనుభవించే అనుభూతులు నా తండ్రి పొందిన క్షణాలు తెలియాలని
తాతనై ఆ అనుభూతులు నా బిడ్డడు పొందే క్షణాలు చూడాలని
కాలచక్రం నా సొంతమైతే క్షణాల ఉయ్యాలలో ఓలలాడాలని

మనోహరం

బుద్ది  ఉదయమై ప్రకాశించిన  వేళ ,
మనసు ప్రకృతిగా వికసించిన వేళ ,
గమ్యం పగలై కరుగుతున్న వేళ ,
మనోహరం


బుద్ది  తామసియై మసిబారిన వేళ ,
మనసు కోర్కెల నీడలో వికృతమై విహరించిన వేళ ,
గమ్యం రాత్రై కమ్ముకున్న వేళ ,
భయానకం

నా బుద్ది ప్రదీపమై వెలుగులు చిమ్మిన ప్రతిసారీ, తామసకాంక్షలు విలయమై వీస్తుంటాయి
నా మనసు ప్రకృతిగా మారిన ప్రతిసారీ, కోర్కెలు వికృతంగా నృత్యం చేస్తుంటాయి
గమ్యం కోసం పయనం సాగుతున్న ప్రతిసారీ, తెలియని అడ్డంకులు చీకటులై కప్పేస్తుంటాయి

మనిషినని సరిపెట్టుకుని లొంగిన ప్రతిసారీ, లోయ లోతు కొలుస్తుంటాను
మనిషినని విజృంభించి పోరాడిన ప్రతిసారీ, శిఖరం ఎత్తు పెంచుతుంటాను

మనోహర దృశ్యం వద్దని కళ్ళు మూసుకున్న ప్రతిసారీ, భయానకం
మనోహర దృశ్యంలో తాదాత్మ్యత పొందిన ప్రతిసారీ , అపురూపం

అమావాస్యఅమ్మ లాలిపాడుతుంటే, వెన్నెల ఊయల ఊపే చెలికాడు మత్తులో జోగిన వేళ
వెన్నెల జిలుగుల శశి
, శిశువై నిదురోయిన వేళ
అమావాస్య అమాయకంగా ఉంది

చీకటి ముసిరి, అసుర కాంక్షలు చెలరేగిన వేళ
నిశి అంతమెప్పుడో తెలియక బిక్కుబిక్కుమనే వేళ
అమావాస్య భయానకంగా ఉంది

వినీలజగత్తుపై చీకటి దుప్పటి కప్పిన వేళ
మిణుగురుల కాంతి మాహాజ్యోతిలా పేట్రేగిన వేళ
అమావాస్య అజ్ఞానపు బావుటాలా ఉంది

శ్రావణమేఘాలు కమ్మిన నిశివేళ
మెరుపులు నాట్యం చేస్తుంటే
, ఉరుములు తాళం వేస్తూ జాగారం చేసినవేళ
అమావాస్య సృష్టిని సృజన చేస్తున్నట్టు ఉంది

పాలసంద్రపు నురగలపై మెరిసిన సోముడు, పార్వతి కనుచూపుకి బెదిరి హరుని జటాఝూటంలో దాగిన వేళ
తారల మది దోచిన వెన్నెలరేడు
, దక్షుని హుంకారానికి జడిసి శివతపం చేసిన వేళ
అమావాస్య పాపనాశనిలా ఉంది

బాహ్య ప్రపంచపు గాఢాంధకారం అల్లుకున్న వేళ
నిర్మలజ్యోతి నిరాకారమై
, శివమై ఉద్భవించిన వేళ
అమావాస్య అందంగా కూడా ఉంది

అనంతమైన జన్మలు

యుగాంతపు ప్రళయ కడలిపై  వటపత్రమై తేలేందుకు
రుద్రతాండవ పదఘట్టనల్లో రేణువై మేరిసేందుకు
బ్రహ్మకపాలమాలలో  తీగనై ఒదిగేందుకు
ఆదిశక్తి హుంకారపు ప్రణవధ్వనుల్లో లీనమయ్యేందుకు

అనుక్షణం మరణాన్ని ఆహ్వానిస్తూ
పరంజ్యోతి కాంతిలో పునీతమవుతూ
ఆ కాంతిలో పునర్జన్మిస్తున్నాను

అనంతమైన జన్మలు, చివరకు
ప్రళయాగ్ని కీలల్లో  సమిధనై వెలిగేందుకు
మాయ కమ్మని  జగతిలో ఆత్మనై జీవించేందుకు

మరణిస్తున్నా... (కవిత)

వసంతపు పూతనై  విరిసేందుకు, శిశిరపు  చిగురునై రాలుతున్నా
ఏరునై  పైరుని కలిసేందుకు, మేఘమై వర్షిస్తున్నా
క్షణమై నిలిచేందుకు, క్షణమై కదులుతున్నా

ఉదయసంధ్యనై  నర్తించేందుకు, సాయంసంధ్యనై  నిష్క్రమిస్తున్నా
అస్తిత్వమై నిలిచేందుకు, పోరాటమై ముగుస్తున్నా
భువిగంగనై పారేందుకు, ఆకాశగంగనై దూకుతున్నా

బంధమై బిగిసేందుకు, దూరమై కరుగుతున్నా
ముత్యమై మెరిసేందుకు, చుక్కనై  బందీనవుతున్నా
అనంతమై నిండేందుకు, శూన్యమై బద్దలవుతున్నా

సత్యమై వెలిగేందుకు, అసత్యమై సమిధనవుతున్నా
వైకుంఠపు కాపు కాసేందుకు, రావణుడినై ధిక్కరిస్తున్నా
ఆత్మనై జీవించేందుకు, దేహమై మరణిస్తున్నా

ఎవ్వండాతడు?

శూన్యపు పరిధులు తుత్తునియలు చేసినవాడు
అనంతపు హద్దులు తెలిపేవాడు, ఆ హద్దులు చెరిపేవాడు

అనంతపు అంచులపై నృత్యం చేసెడివాడు
సర్వము తానై, సర్వాధా భాసిల్లెడివాడు

 అనంతాన్ని శూన్యంతో లయం చేసెడివాడు
జీవన్మృత్య సాక్షీభూతుడు

 ప్రణవనాదమై ఘోషించువాడు
అనంతజ్యోతియై శోభిల్లువాడు

జ్ఞానవాహినిగా ప్రవహించువాడు
జ్ఞానసాగరమే తానైనవాడు

 గమనము తానై, గమ్యము తానై, ఆదియు, అంతము తానే అయ్యినవాడు
 సుధాసృజన చేసినవాడు, గరళమునకు లొంగనివాడు

భాష అతడు,
భావము అతడు,
కళ అతడు,
సర్వము ఆతడు...

ఎవ్వండాతడని, ఒకనాడు ఆకాశాన్ని అడిగితే శూన్యంగా చూసింది
ఆతడు నా పిలుపు విని ఆకాశం వంక చూపు విసిరాడు, ఆకాశం అనంతమై మురిసింది

క్షణం కొలత


క్షణాన్ని కొలిసే సాహసం చేసాను
కొలతబద్ద కోసం నాకు తెలిసిన ప్రపంచమంతా తిరిగాను
ఒక్కోచోటా ఒక్కో కొలత వచ్చింది
నాకు కొత్త పరీక్ష తెచ్చింది

అసలు కొలత చెప్పమని ఎవరిని అడగాలి?
ఒక్కొక్కరిదీ ఒక్కో భాష్యం, వారి కొలత వారి లోకానికే పరిమితం

క్షణాన్ని ఎలా కొలవను?
కాలంతో మారే సాధనాలు పనికిరావు
కాలంతో మారే భాష్యాలు పనికిరావు

క్షణంతో సంబంధం లేని సాధనం కావాలి
ఎక్కడ నుంచుని కొలవాలి క్షణాన్ని?
కాలాతీతమైన వేదిక అధిరోహించాలి

ఎలా ఎక్కాలి ఆ వేదికను?
కాలంతో మారే “నేను” ఎలా కాలాతీతపు వేదికను అధిరోహించాలి?
నన్ను వదిలి మనగలిగిన “నేను” ఎవరు?
క్షణాన్ని కొలవబోయిన నా మెదడు
అల్పమై వెర్రిచూపులు చూస్తోంది

క్షణం కొలత చెప్పగలిగేది ఎవరు?
నాలోపలి నుంచి ఒక గొంతుక పలకరించింది
“నేను” లేని నా గొంతుక వినడానికి కొత్తగా అనిపించింది
అరుణ కిరణాలు నిశీధిని చీల్చినట్టు “నేను” అదృశ్యమయ్యాను


నాలోని జీవాత్మకు నా మెదడు సాగిలపడి మొక్కింది
క్షణం కొలత చెప్పే క్షణం వచ్చింది
మరుక్షణం “నేను” లేను, నా ప్రశ్న లేదు, ఈ రచన లేదు

గుర్తుందా నేస్తమాగుర్తుందా నేస్తమా
చివరిసారి ఎప్పుడు ప్రపంచాన్ని జయించావో?
చివరిసారి ఎప్పుడు నీవే ఒక శిఖరమై నిలిచావో?
మనోఫలకంపై స్తంభించిన ఆ క్షణం గుర్తుందా?

గుర్తుందా నేస్తమా
చివరిసారి ఎప్పుడు పరిగెత్తావో?
చివరిసారి ఎప్పుడు నీ జీవకణాలు జీవించాయో?
మనోఫలకంపై స్తంభించిన ఆ క్షణం గుర్తుందా?

గుర్తుందా నేస్తమా
చివరిసారి ఎప్పుడు కాలాన్ని ఎదిరించావో?
చివరిసారి ఎప్పుడు నవ్వుతూ రోదించావో?
మనోఫలకంపై స్తంభించిన ఆ క్షణం గుర్తుందా?

నీ విజయాలు గుర్తున్నాయా?
అమ్మ కళ్ళలో కాంతి వెలిగించిన నీ విజయం
నాన్న మీసంపై మెరిసిన నీ విజయం
ప్రేయసి పెదవిపై విప్పారిన నీ విజయం
ఆత్మీయుల విజయాలు నీవని నమ్మిన విజయం
నీ విజయాల శిఖరాగ్రంపై పతాకమై రెపరెపలాడే నీ జీవనజ్యోతి గుర్తుందా?

చివరిసారి విశ్వమంతా నీవారని ఎప్పుడు నమ్మావో?
చివరిసారి ఎప్పుడు కోరికని జయించావో?
నిర్మలంగా మెరిసిన మనోవజ్రపు వెలుగులు గుర్తున్నాయా?