కడలి ఎడారి శిఖరం

కష్టాల కడలిలో సుడిగుండాల మధ్యలో తెరచాప తెగిన నావలో పయనం చేస్తూ
కష్టాలను దూరం చేయమని దేవుణ్ణి ప్రార్ధిస్తే
కష్టాలను తాను తాగేసి, సుడిగుండాలను పాతి పెట్టి నావను మాయం చేసి
నిర్జీవపు ఎడారిలో నిలబెట్టాడు

ఉప్పరుచి కన్నీళ్లు కడలిలో తోడిచ్చి, కష్టాలను హృదయభావనగా చేసి
హృదయాన్ని బండబార్చి, ఆ బండల ఎడారిలో ఎండమావి కోసం వెతకమని శాసించిన
ఆ బండరాతికేం తెలుసు కడలికి ఎడారికీ పెద్ద తేడా లేదని

విజయశిఖరం చేర్చమని ప్రార్దిస్థే ఆరోహణలో సర్వం త్యజించమని చెప్పి
అవరోహణా మార్గంలో ఘనీభవించిన అనుభవాల రాళ్ళను పేర్చి
ఒంటరిగా పైనే ఉండమని శాసించాడు
శాసన ధిక్కారం చేయబోతే వాహినిగా లోకసంచారం చేయమన్నాడు

కష్టాలు ఆవిరైతే జీవం నిర్జీవం
ఎడారినైనా సస్యశ్యామలం చేయమని శాసనం
విజయ పయనంలో అనుభవ శిఖరం చేరమని ఆన
ఎన్నటికీ అర్ధం కాని దైవలీల