హృదయగాధలు

నదికెన్ని పాయలో‌
హృదయానికెన్ని గాధలో‌
ప్రతి వేణి గమ్యమూ ఒకటే‌, ప్రతి గాధకూ ముగింపొకటేనా?

నది చేరని తీరం
మదిలో‌ తీరని కాంక్ష
ఆ తీరానికి నదిని తరిమేది ప్రళయం, మరి ఈ కాంక్షను తీర్చేదేది ?

ప్రతీ మలుపులో‌ దాగిందో‌ సుడి
ప్రతీ అడుగులో‌ దాగిందో‌ మలుపు
తీరానికి కానరాని అంత్:మధనాలు, హృదయాంతరమున దాగినదేమిటో‌

ఏనాటి ఆనందభాష్పాలు,
ఎచ్చటి వేదనరోదనభాష్పాలు
నది నిండా నీరే‌, ఆనందం దాగిందో వేదన నిండిందో‌ హృదయములో‌, ఎవ్వరు చెప్పగలరు

ఉప్పెనలెన్నైనా మారని సంద్రం‌
కాలగమనమేదైనా చలించని విధి
నది గమ్యం‌ దొరికింది, మరి హృదయ గాధల ముగింపు?

ఏమి భావమో ఇది

ఆనందభాష్పాలు కావు
వేదనరోదనలా !కాదు
ఆనందానికి వేదనకూ నడుమ ఏమిటిది? శూన్యమా??‌

ఎగిసే అల కాదు
కరిగే కల కాదు
అలా ఎగిసి అంతలోనే కరిగి , తెలియని భావమిది!

ప్రపంచపు ఉనికి తెలియలేదు
వేసే అడుగు తడబడలేదు
ఆకసంలో‌ తేలుతూ నేలపై నడుస్తూ , ఏమి స్థితి ఇది?

విజయము కాదు
అపజయమూ కాదు
గెలుపుకూ ఓటమికీ నడుమ, కోరికలేని క్షణమా ఇది

అనిర్వచనీయమీ అనుభూతి
క్షణకాలమైనా అనంతంలా నిలిచే ఆకృతి ఇది
శూన్యంలా గోచరిస్తూ అనంతంలా హృదయంలో నిలిచిన భావమిది

అమావాస్య నాటి వెన్నెల - 3

ముందుకు అడుగు వేసానే గాని భారమైన ప్రయాణము అనే మాటకు అర్ధం ఇదేనేమో అనిపించింది ..
నడిచా ! చూసే సరికి నా గీత, నాలోని స్వప్నకు.. మా ప్రయాణానికి గుర్తులైన ఆల్బం చూపిస్తోంది ..
నా లోకం మాత్రం వేరే ,
స్వప్నను గీతను మార్చి మార్చి చూసా..
స్వప్న నను స్వప్నం లో కవ్వించినది ఐతే, గీత నా ప్రతి నిజ కదలికలో భాగస్వామి ..
గీతతో పంచుకున్న భావాలు ఎన్నో స్వప్నతో పంచుకోలేక నా ఎదలోనే ఇమిడ్చిన భావాలూ అన్నే !!!
ఒక్క క్షణం గతం గోడలు తడుతూ నను నేనే మరిచీ,
నా ఏ కదలికా వదలని నా చెలి (గీత) నను గమనిస్తుంది అన్న విషయమూ మరచి ..
తేలుతున్నా నా ఊహల్లో ..
కోరుకున్న ప్రతీది దక్కించుకునే పట్టుదల ఉన్న నేను నా ప్రేమలో ఎలా ఓటమిని అంగీకరించానా అని ప్రశ్నించుకుంటూ విహరిస్తున్నా నా స్వప్న లేని స్వప్నాలలో ..
ఇంతలో "నా పెళ్ళికి మాత్రం మీ జంట తప్పక ఉండాలి" అంటున్న స్వప్న ..
ఉలిక్కిపడి చూసా చెమ్మగిల్లిన గీత కళ్ళని..
కలా నిజమా అనేంత క్షణం లేవు ఎన్నో మాటలలానే తనలో అణచేసుకుంది ..
స్వప్నకు వీడ్కోలిచ్చి ఇద్దరమూ కదిలాం మా కుటీరంలోకి ..
గీత మాత్రం జార్చిన పూలను ఏరుతూ ముంగిటే ఆగింది .. తనను ఒంటరిగా వదలలేకపోయా .. ఒక్క క్షణం నేను చేసినది తప్పా అనే ఆలోచనలో పడ్డాను !
సహాయం చేస్తున్నట్టుగా చేయందించాను..
"అయ్యో భలేవారే నేను ఏరుతానుగా !! పూలు తోక్కకూడదు అందుకనే .. వచేస్తున్నా! మీరు పదండి ఒక్క నిముషం.." అంటూ సులభంగా నను కదల్చింది క్షమాపణా సహిత ఆలోచనల్లోంచి !!!
నా అడుగులు మరలా కదిలాయి .. కాని భారంగా కాదు