చేతి రాత...

 

  చేతి రాతతో మనిషి మానసిక మరియు శారీరక స్థితిని అంచనా వెయ్యచ్చట.
చిన్నప్పుడు చేతిరాతను చూసి వారి ముఖాన్ని అంచనా వేసేవాడిని.
గాంధీ తన ఆత్మకధలో సవివరంగా రాసారు, తను ఎప్పటికీ సిగ్గు పడేది తన చేతిరాత గురించి అని.
"ఆ విధ్యార్ధి రాత ముత్యాలు కూర్చినట్టు ఉంటుంది" - చిన్నప్పుడు చాలా సార్లు విన్న మాట. (నా గురించి కాదు)

నా వరకు నేనే నా చేతిరాతలో చాలా వర్షన్లు చూసాను.
తరగతి గదిలో మొదటి బెంచిలో కూర్చుని శ్రద్దగా వినేప్పుడు ఒకలా.
మొదటి బెంచిలోనే కూర్చుని లెక్చరర్ కనుచూపులోచి తప్పించుకుంటూ పదాలతో ఆటలు (వర్డుగేమ్సు) ఆడేప్పుడు ఒకలా..
మొదటిబెంచిలోనేకూర్చుని కునికిపాట్లు పడేప్పుడు ఒకలా...
పరీక్షల్లో ఎవరో తరుముతున్నట్టు మూడుగంటల పరీక్షను రెండు గంటల్లోపే రాసేప్పుడు ఒకలా....
ఇంటరు వరకు స్నేహితులకు బంధువులకు ఉత్తరాలు రాసేప్పుడు ఒకలా.....
అభినందన పూర్వక ఉత్తరాలు రాసేప్పుడు రంగురంగుల స్కెచ్చు పెన్నులతో ఒకలా......
"నాన్నా నా కవిత చదివవా" అంటూ నా రాతలను నాన్నకు చూపించేటప్పుడు ఒకలా.....
ఇక పుస్తకం మొదటి పేజీలో నా పేరు అందంగా రాసుకోవాలని ప్రయత్నించినప్పుడు మరొకలా.......
నా సంతకం చూసి మా కంపనీ హెచ్ ఆర్ "మళ్ళి సంతకం చేస్తావా. కొట్టేసినట్టున్నావు" అన్నప్పుడు మరోలా...
అబ్బో ఇంకా ఎన్ని రకాలుగా రాసేవాడినో నాకే గుర్తులేదు.
ఇలా నా చేతిరాతలోనే ఇన్ని రకాలు ఉన్నాయి అని తలుచుకుంటే, కాదు కాదు అవన్నీనీకు వచ్చిన కలలు అని అనిపిస్తుంటే ఒక్క నిమిషం కాలాన్ని వెనక్కి తిప్పి నా గమ్యాన్ని మార్చుకోవాలని ఉంది.
ఇప్పటి నా (నాలాంటి చాలా మంది సాఫ్టువేరు ఇంజినీరుల) పరిస్థితి నాలుగు ముక్కల్లో చెప్పలంటే కింద రాసినట్టుంటుంది.
" కలం స్థానంలో కీబోర్డు వచ్చింది.
పుస్తకం స్థానంలో కంప్యూటరొచ్చింది.
ప్రతీదీ సాఫ్టుకాపీలో పంపడం అలవాటయ్యింది.
హార్డుకాపీ ఆంటే కేవలం ప్రభుత్వకార్యాలయాల్లో అప్ప్లికేషన్లనే స్థాయి వచ్చింది. "

ఇది రాయటానికి ప్రేరణ, ఒకరి చేతిరాతను నేను గుర్తు పట్టకపోవడమే.. ఇంతా రాసాకా ఇక్కడ ఏదో తగ్గిందనిపిస్తోంది. ఆ నా చేతి రాత. అందుకే కింద స్కాన్ చేసిన కాపీ.
HandWriting

Telugu English Dictionary 0.3Beta

 

Releasing 0.3Beta of telugu english desktop dictionary on behalf of telugu bloggers day.

For screenshots and additional information visit www.miriyala.in

NOTE: Vista Issue, Program must be ran with admin rights

అమావాస్య నాటి వెన్నెల - 2

 

    ఆ అమావాస్య నాటి రాత్రి, నేను ఇక గీతే నా లోకమని నిర్ణయించుకున్నాను.
తరువాతి రోజు, ఉగాది మామూలుగానే తెల్లవారింది.
పొద్దున్నే లేచి ఇంటి ముందు వసారాలో పేపరు చదువుతున్నా నా వార్తాజ్నానం (వార్తాజ్నానం = వార్త + అజ్నానం) పెంచుకుందామని
గీత పూజ కోసమని ఇంటి ముందు పూచిన సన్నజాజి పూలు తెంపుతోంది.
ఇంతలో ఇంటి ముందో కారాగింది. కారులోనించి దిగిన వ్యక్తిని చూసి నా చేతిలో పేపరు, గీత చేతిలో పూలు నేల జారాయి.
వచ్చిన వ్యక్తి ఏమయిపోయిందోననుకున్న స్వప్న. గీత చేతజారిన పూలపై వయ్యరంగా నడచి వచ్చి మా ఇద్దరి వంక చూస్తూ
"ఎలా ఉన్నారు?" అంది. 
"బాగానే ఉన్నాము, నువ్వు ఎలా ఉన్నావు?" అన్నాను.
గీత ఇదంతా కలేమో అనుకుంటోంది ఇంకా, నెమ్మదిగా తేరుకొని "ఎక్కడనుంచి వస్తున్నావు? ఎలా ఉన్నావు? కొంచెం చిక్కినట్టున్నావు"
స్వప్న చిన్నగా నవ్వి "నేను చిక్కలేదు, నువ్వే ఒళ్ళు చేసావు. అప్పుడెంత అందంగా ఉండేదానివి"
నాలో ఆమె ఇన్నాళ్ళు ఎక్కడుందో అన్న ఆతృత పెరగసాగింది. ఇంక ఆపుకోలేక, నిన్నటి రాత్రి నిర్ణయాన్ని కాసేపు పక్క పెట్టి

"అవును ఇన్నాళ్ళు ఏమయిపోయావు, ఎంత ప్రయత్నించినా నీ ఆచూకీ దొరకలేదు"
ఆమెకు నా ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ఇష్టం లేనట్టుంది, సూటిగా ఇప్పుడెందుకొచ్చిందో చెప్పేసింది "నా పెళ్ళికి మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను"
"ఎవరితో నీ పెళ్ళి?"
"మనతోనే చదువుకున్నడు కదా అరవింద్ "
"...! " నాకు నోటమాట రావడం లేదు.
ఇంతలో గీత అందుకుని "అరవింద్ కూడా వచ్చాడా? "
"తను రాలేదు, నేనొక్కదాన్నే వచ్చాను"
"అయ్యో నిన్ను ఇలా వాకిట్లోనే నుంచుని మాట్లాడిస్తున్నా. లోపలికి రా" అంటూ స్వప్నను లోపలికి తీసుకెళ్ళింది గీత.

సన్నజాజి పూలు నన్ను వెక్కిరిస్తున్నట్టనిపించింది కాసేపు అక్కడే నుంచుండిపోయా...
స్వప్నను మర్చిపోదామని గత నాలుగేళ్ళుగా నేను పడ్డ భాధ నన్ను వెక్కిరిస్తున్నట్టనిపించింది.
సంవత్సరం ఎంత గొప్పగా మొదలయ్యిందో !!

ఎక్కడో కోయిల పాడుతోంది తియ్యగా, నాకు మాత్రం అది కాకి అరుపులా అనిపించింది.
అలా ఎంతసేపు అక్కడ నుంచున్నానో నాకే తెలియదు, ఇంతలో లోపలినుంచి గీత పిలిచింది.
భారంగా అడుగు ముందుకు వేసాను..

అమావాస్య నాటి వెన్నెల


    బయట ఎక్కడో మేఘఘర్జనకి నాకు మెలకువ వచ్చింది.
కిటికీలోంచి బయటకు చూస్తే చిమ్మ చీకటి,
అసలే అమావాస్య అందులోనూ ప్రభుత్వంవారి దయతో మా ఊరిలో వెలగని వీధి దీపాలు.
నాకు నిద్ర పట్టేలా లేదు, లేచి బయటకు వచ్చా.
ఏమీ కనిపించటం లేదు. కాసేపు అలా చీకటిలోనే ఉందామనిపించింది.
ఇంతలో లోపలినుంచి "ఏవండీ" అంటూ నా భార్య పిలిచింది. ఆమెకు కూడా నిద్ర పట్టడంలేదేమో!!
తను కూడా వచ్చింది, "లైటు వెయ్యమంటారా?"
"వద్దు, ఇలాగే బావుంది"
సరే, అంటూ నా భుజంపై తల వాల్చి కూర్చుంది.
తను ఏదో చెప్తోంది, నా మనస్సిక్కడ లేదు ఏదో ఆలోచిస్తున్నా, ఎక్కడో స్వప్నలోకంలో విహరిస్తున్నా.
"వింటున్నారా"
చెప్పు , స్వప్నా అందామని నోటివరకు వచ్చిన మాటను లోనికి తోసా. నా భార్య పేరు గీత కదా మరి.
"ఎప్పుడూ ఇంతే నేను చెప్పేది వినరు" అంటూ చిన్నగా కోప్పడింది
"వింటున్నాను లేవే"
"అయితే నేనేమి చెప్పానో చెప్పండి"
అవును, నిజమే. నా మనసంతా ఏదో అలజడి.
మనసులో స్వప్నను ప్రతిష్టించుకుని గీతతో బతుకుతున్నా.
తను చెప్పేది ఇంతవరకూ ఎప్పుడూ సరిగ్గా వినలేదు.
నేనెంత పట్టించుకోకపోయినా తనకు నేనంటే ఎంతో ప్రేమ.
నెమ్మదిగా "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అన్నాను
"మనస్ఫూర్తిగా చెప్పండి, నా కోసం కాదు"
హమ్మయ్య మొత్తానికి అంశాన్ని భలే మార్చా. నాకు నేనే శభాష్ అనుకున్నా..
ఇంతలో తనే అంది మళ్ళీ, "స్వప్న గుర్తుకొచ్చిందా"
నావైపు నుండి మౌనమే సమాధానమయ్యింది.
ఇంతలో దూరంగా ఎక్కడో మళ్ళీ మేఘఘర్జన.
" వర్షమొచ్చేలా ఉంది " పైకే అన్నా...
"మెరుపులు అమావాస్యనాడు కూడా వెన్నెలను సృష్టిస్తున్నాయి, ఎంత బావుందో కదా"
ఒక్కసారిగా నా సమస్యకు సమాధానం లభించినట్లయ్యింది
మబ్బులు పౌర్ణమి నాడు కూడా అమావాస్యను సృష్టిస్తున్నాయనుకుంటూనే గడిపాను, అసలైన మబ్బులు నా కళ్ళకు పట్టాయని అవి ఈనాడు వర్షించబోతున్నాయని అర్ధమయ్యింది.
చీకటిలో నెమ్మదిగా గీతవైపు చూసా, నా స్వప్న ఎక్కడో లేదు ఇక్కడే గీతలోనే ఉంది అనిపించింది. 
నెమ్మదిగా తనతో అన్నా "నిన్ను ప్రేమిస్తున్నా" ఊహూ అన్నాననుకున్నా అంతే!
గొంతునుంచి మాట పెగలడం లేదు. ఒళ్ళంతా చల్లగా అవుతోంది, నా హృదయ స్పందన ఆగినట్టనిపించింది.
ధైర్యంగా గట్టిగా అరిచా "నిన్ను ప్రేమిస్తున్నాను" .
"నేను కూడా" అంది గీత
ఎక్కడో దూరంగా మరోసారి మేఘం ఘర్జించింది.
నెమ్మదిగా వర్షం మొదలయ్యింది.
ఇంటి ముందు సన్నజాజి మొగ్గలు నెమ్మదిగా వికసించసాగాయి. వాన నీటి జల్లుతో అవి పులకించసాగాయి.

ఆ రాత్రి నాకు అమావాస్యనాడు వెన్నెల కనిపించింది. ఇకపై కూడా కనిపిస్తుంది. నా స్వప్న గీతలో కనిపించినట్టు.

కలల రాకుమారి - కాల రక్కసి


కాలాన్ని జయించాలని ఉంది, నిన్ను కలిసే క్షణం కోసం.

కానీ ఈ కాలం ఉందే, ఇదో పెద్ద రక్కసి..
దీనికి ఒళ్ళంతా కళ్ళే, ప్రపంచమంతా సేవకులే.

నిన్ను కలిసే  ఆ క్షణాన్ని త్వరగా చేరడం కోసం
రక్కసితో సమరం చేసా.. సమానం కాలేకపోయా..
మరోసారి దాని చేతిలో ఓడిపోయా..

నా శక్తి చాలదని, దేవుని కోసం తపస్సు చేసా...
కాలాన్ని జయించాలంటే కాలాతీతం కావాలన్నాడు.
కాలాతీతం కావాలంటే, కాలాతీతమైనదాన్ని చేజిక్కించుకోవలన్నాడు.

మన ప్రేమ కన్నా కాలాతీతమేముంది?
మన ప్రేమను గెలవాలంటే,
నా పిచ్చి కానీ ప్రేమకు గెలుపోటములేమిటి!

నా కలలో ఉన్న నిన్ను కలిసిన క్షణమే
మన ప్రేమ గెలుస్తుందన్నాడు దేవుడు.

నిన్ను కలిసే క్షణం కోసం కాలాన్ని జయించాలనుకున్నా
నిన్ను కలిస్తేనే కాలాన్ని జయిస్తానన్నది ఆ దేవుని ఆనతి.

నిన్ను కలిసే ఆ క్షణం వరకూ నువ్వుండే కలలోనే బతకమంటావా.... 

గమనిక: కాల రక్కసి అన్న పదం వ్యాకరణ పరంగా తప్పు అయినప్పటికీ ప్రాస కోసం వాడాను.