హృదయపు ఆకాశము

ఓటమి అమాసై పిలిచింది నిరాశను తామసై రమ్మని,
నిరాశ వచ్చింది ఆశల నక్షత్రాల తూటాలు చేసిన గాయాలతో ,
నివ్వెరపడి తడబడింది ఓటమి
రాతిరి నిశ్శబ్దంలో ఓటమి పెట్టిన గావు కేక విజయపు గీతమై
ఆశలవెన్నెలను ఆవిష్కరించింది

ఆశల కాంతులు తొలగించాయి గహణాన్ని
దూసుకు వచ్చింది విజయలక్ష్మి పున్నమి చంద్రునిలా
కోటి ఆశలు ఒక్కసారి కలగలసి
ఆకాశమంటి హృదయన్ని నింపివేసాయి
పున్నమి వెలుగు నిండింది ఎదలో

ఆశ తోడున హృదయపు ఆకాశము అనంతము
నిరాశ నీడన హృదయపు ఆకాశము శూన్యము

సృజన

లత కోరింది తరువు తోడును
తరువు నీడన జతకూడి ఆడింది
మాతృమూర్తియై సృజన పుష్పాల పూసింది
పులకించిన ప్రకృతి
హిమబిందువులచే అభిషేకించింది

సిగ్గుల మొగ్గగా మొదలై, బిడియపు పుష్పమై
సృజన వికసించింది
అన్వేషియై విహరించదలచింది
వీడ్కోలు తెలిపింది లత
తరువును స్పృశించి
గమ్యము గగనపు వీధుల విహంగమై
హవనవాహనుడి జతలో సాగింది సృజన

పంకజపాన్పుపై నిదురించి
మల్లెలచెండును అలకరించి
ముళ్ళబాటన గులాబీని ముద్దాడి
హల కల ఆయుధమ్ముల తోడెంచుకొని
అలసటన హరుని శోధించి
వినీలవిశ్వపు జైత్రయాత్ర కొనసాగించింది

కన్ను కుట్టింది సమవర్తికి
బంధించ పాశంబు విసిరె
టక్కరిదీ సృజన, ఆ సమవర్తి శిరసు అధిరోహించింది

అంతు తెలియని దూరాన లత మరో సృజనకు జన్మనిచ్చింది
సమవర్తి త్వరలో సృజనమూర్తి కానున్నాడు

సత్య శోధన

నిజమెల్లప్పుడూ ఇంతే
పట్టుకుంటానంటే కాలుస్తుంది
దాచిపెడితే దాగనంటది
ఆకసాన సూరీడిలా వెలుగుతానంటది

ఎంత లోతున దాచిపెట్టినా,
భూగర్భం చీల్చుకు వస్తుంది
ఎంత దూరమిసిరేసినా అ
నంత దూరం పయనించి తన వాణి విన్పిస్తుంది

అణువంత చిన్నది
విశ్వమంత పెద్దది
ఆచరిస్తే అణువణువులో దాగి తోడుంటుంది
ఎదురు తిరిగితే విశ్వమంతా తానై ప్రళయం చూపుతుంది

అసత్యపు రధమెక్కి అవినీతి గుర్రాల స్వారీ చేసిన
అనంత సత్యం చేతిలో ఓటమి తప్పదుగా

సత్యాన్వేషణతో జీవినయానం చేసిన,
నీతి చంద్రికల తోడున విహరించిన
అనంత సత్యమున అంకితమే కదా

సత్యమా ఏమని అర్ధం చేసుకోను నిన్ను,
సత్యాన్వేషణలో తరించెను ఒక ఋషి,
సత్యము గోచరించిన మాత్రమున
నా నేత్రము కానరాని లోకాలకు వెడలె ఆ ఋషి
ఇంకెవరని అడగను నీవెవరో

(సత్యశోధన రాసిన గాంధీకి అంకితం)