తెల్ల కాగితంపై నల్ల చుక్కలా లేక నల్ల కాగితంపై తెల్ల రంగు జాడలా ?

ఓంకారం‌ దిద్దే వేసాను తొలి అడుగు
తెలియలేదు క్షరక్షణ భుంగుర జీవితం‌ గమనమని
తెలియనేలేదు చిత్రంగా తెల్లకాగితంపై గుప్తంగా "ఓనమ:" అంటూ లెక్కలు మొదలయ్యాయని
వచ్చి పడ్డాను నాకు తెలియకుండానే జీవితబడిలోకి, బెత్తంతో‌ నుంచుని చూస్తున్నాడా సమవర్తి

రోజుకో కధ చెప్పి , క్షణానికో‌ లెక్క ఇచ్చి
తప్పు చెయ్యనిచ్చి, వెంటనే‌ గిల్లి తొడపాశం పెట్టి లాక్కుపోతున్నాడు

ఆ బడిలో నా గాధలో‌ రాసే ప్రతీ అక్షరమూ ,
క్షరమని శాసించే విధిని వెక్కిరిస్తూ ముందుకు శరమై ముందుకు సాగింది
ఆ గాధలో, అగాధాల లోతులు చూపి, అనంతపు ఎత్తులు చూపి
కొన్ని క్షణాలు అనంతానుభూతులు నవరసాలలోనూ చూపుతూ
కదలనంటూ మొరాయించాయి
బెత్తం‌ విదిలించాడు, క్షణాలలో‌ కదలిక వచ్చింది వరదకు తెరిపిచ్చినట్టు
కానీ జ్ఞాపకాలు అనంతంలా వెంటాడతామంటూ బెత్తంపై కూర్చుని వచ్చాయి

అసలీ బడిలోకి ఎలా వచ్చానో, గంటే లేని బడి ఇది
ఉన్నా తెలిసేనా ఈ దేహాత్మకు

రోజూ ఉదయాన్నే‌గతం నీడలు నిండిన ఆ బెత్తం‌నిద్రలేపితే
భయంగోడల మాటున దాగిన భవిత కవ్విస్తుంది
ఆ గోడలవైపు అడుగేస్తే కూలిపోతాయి, ఆగితే‌ మాత్రం‌ పాషాణాలై గోచరిస్తాయి

ఆ నీడలూ, కవ్వింపులూ, ఈ రాతలూ, కూసే‌ కూతలూ అన్నీ
ఏనాడో‌‌ తీసిన ఆ తెల్లకాగితంపై నాతో‌ రాయిస్తూనే ఉంటాడు

ఒకనాడు బడి ముగిసినట్టుంది, సమవర్తి చేతిలోని బెత్తం‌‌ మెత్తబడింది
పాశమై ముందుకు వచ్చింది
ఇక కవ్వించే‌ భవితా లేదు, వెంటాడే‌ గతమూ లేదు

తెల్లకాగితం‌‌ నల్లగా మారిపోయింది, దానిపై నా ప్రతిబింబం‌‌ అగుపిస్తోంది
తెల్ల గోడపై నల్ల చుక్కలా‌? లేక నల్లగోడపై తెల్లని సున్నమో?

ఇంతలో‌ ఆ పాశం మళ్ళీ గట్టిబడింది, బడి మళ్ళీ పిలుస్తోందేమో?
నా ప్రతిబింబపు కాగితాన్ని చెరిపి తెల్లకాగితాన్ని ఇచ్చాడు
ఈ తెల్లకాగితంపై ఏమి రాస్తానో,
ఓంకారం‌ దిద్దుతున్నదెక్కడో‌?