శిలనైనా కరిగించే సామవేద సంగీతం

పాడెడి వాడు భక్తుడైతే,
శిలలో కనిపిస్తున్న ఆ దేవుడు కరిగి
ఆ భక్తుని హృదయాన్ని ముంచెత్తడా
విశ్వరూప దర్శనం చూపడా

హృదయమే పాషాణమైతే
ప్రియసఖి నోటి మాటే సామవేద సంగీతమవ్వదా
ఆ హృదయం కరగదా
ఆనందం అర్ణవమై కన్నుల ఆనకట్టలు దాటదా

( కలవరమాయె మదిలో సినిమాలో పాటలో ఒక వాక్యం పైన టైటిలు. అది నచ్చి, ఇలా సంబంధం లేకుండా రాస్తున్నాను. )

హరివిల్లు – 4

(అడగగానే, ఒక చెయ్యి వేసి ఈ సప్త కవితల సంకలనంలో పాల్గొంటున్న మరువం ఉష గారికి ధన్యవాదములు)

భానుని శ్వేతకిరణాలు తండవమాడుచున్న వేళ, ఒక చినుకు కురిసె
చినుకు తడికి తడిసి, మురిసి శ్వేతకిరణం ఏడు వర్ణములలో వన్నెలు పోసాగింది,
ఆ సప్త వర్ణాలూ తమ వన్నెలతో శ్వేతకిరణ సుందరికి అలంకారములవ్వగా
తన నెచ్చెలి తామసి తోడు లేక చిన్నబోయెనా నలుపు
తన అంశలగు సప్తవర్ణముల వన్నెలు చూస్తూ ఆనందమొందుచున్నదా శ్వేత సుందరి

ఆ వన్నెల నృత్యస్థలి ఆ నల్లనయ్య తలపైన దాగిన పించమే కాదా ?
చిన్నబోలేదులే నలుపు, తామసమునే జయించిన నల్లనయ్య తోడుండగా
ఆ నల్లనయ్యకే అలంకారమై నిలువగా

శ్వేత సుందరి అలగదులే
ఆ నల్లనయ్య చేత వెన్నముద్ద కదా ఆ శ్వేతసుందరి,

ఒక చేత మురళి, మరు చేత వెన్నముద్ద
దేహము నలుపు, శిరముపై హరివిల్లును చూపించు పించము

అన్ని వర్ణములూ కలిసిన ఆ క్షణము నా వర్ణనలకు లొంగునా ?

భానుడే మనమేమో
ఆ చినుకులే సత్యాసత్యాలేమో
శ్వేతకిరణాలు మనలోని భావనలేమో
ఆ రెండూ కలసిన క్షణమున వచ్చెడిది హరివిల్లంటి ఆత్మసాక్షాత్కారమేమో
తామసమును జయంచి తామసి నెచ్చెలిని మన అలంకారముగా చేసుకుంటే
వేడి వేడి భావనలు వెన్నంత చల్లగా అవుతాయేమో
ఆ క్షణమున మనిషే ఆ నల్లనయ్య అవునేమో

హరివిల్లు - 2

శ్వేతశిఖరాలపై ధ్యానముద్రన మునిగి ఉన్నాడు ఆ శంకరుడు
శివుడు బాధలోనున్నాడేమో ప్రకృతి కూడా నిర్వేదంగా ఉంది,
ఆ నిర్వేదపు శిశిర ప్రకృతికి ఏకైక శోభ ఆమె, పార్వతి
ఆ శంకరుడు కొలువున్నది ఆ పార్వతి హృదయశిఖరాలపైనేమో

ఆమె హృదయమున ఏనాడో ఆసీనుడాయెను ఆ శంకరుడు
అది తెలియని బేల కాదే ఆ పార్వతి,
వారి వివాహసమయం కోసమే కాదా ఆ నిర్వేదపు ప్రకృతి ఎదురుచూపులు
అదీ తెలుసు ఆ పార్వతికి...

ఆ ధ్యానముద్రను కదలించ శివుని కంఠమున దాగిన గరళం
మూడోకన్నున వెలువడునని తెలియునే
తెలిసిననూ ముందుకు సాగెను మన్మధుడు వారించు రతీదేవిని తోడ్కొని
మన్మధునికి ఆ ధైర్యమేలనో.... విధి నిర్వహణను నమ్మిన యోగేమో ఆతడు

కోయిలలచే కూయించెను, మల్లెల సువాసనలు వెదజల్లెను 
సుందరీమణులతో నాట్యము చేయించెను
ఎన్ని యత్నములనైనూ చెక్కుచెదరలేదు ఆ శంకరుడు

బ్రహ్మాస్త్రమో మరేమో, ఆ హరిని ప్రార్ధించి "హరివిల్లు" ను ఎక్కుపెట్టె
శ్వేతశిఖరపు మంచుని కరిగించి
శ్వేతశిఖరపు సిగలో అందమైన ఒక చిత్తరువు గీచెను
ఆ చిత్తరవు గీచినంతనే ధ్యానముద్రను వీడెను ఆ శంకరుడు

భస్మీపటలమాయెను మన్మధుడు,
భస్మమాయినది మన్మధుడు కాదేమో?
శ్వేతశిఖరముపై హరివిల్లుని కనిన అనిర్వచనీయ అనుభూతిన
బూడిదయ్యినది కామమేమో ?

రతీదేవి దు:ఖమును తీర్చ ఆమెకు ప్రసాదించే తన ధ్యానసాధన

శ్వేతశిఖరమున హరివిల్లు కనిన క్షణం ఒక జంట కలిసె,
మరొక జంట ధ్యానముద్రన మునిగె
ఆ జంటను కలిపెడివాడు మన్మధుని పంపిన హరే కదా
ఈ జగన్నాటకసూత్రధారే కాదా ఆ నల్లన్నయ్య

(హరివిల్లు అనే టపాలో మూడు కవితలు రాసాను. ఇది సప్తకవితల సంకలమున నాలుగవది)

హరివిల్లు

హరివిల్లు – సప్తవర్ణాల మేలు కలయిక
ఇంధ్రధనస్సుగా పేరు గాంచెను
ఆ హరివిల్లుని చూసినంతనే ఎన్నో భావాలు, ఆ భావాల కలయికే ఈ రచన.
ఇది సప్తభావాల కలయిక కాదు
సప్తాశ్వాలపై ఊరేగు సూరీడి రధము కాదు
ప్రకృతిని చూచి పరవశించిన నా ఉప్పొంగుభావాల కలబోత

=============

శ్వేతకిరణం ప్రియుడు
హిమబిందువు ఆ ప్రేయసి
ఇద్దరూ కలిసిన క్షణం ఆవిష్కృతం కాదా అందాల హరివిల్లు
వారి కలయికలో ఆ ఒక్క క్షణంలో ఎన్నో భావాలు పొంగవా
ఆ భావాలే సప్తవర్ణాలై ప్రతిబింబించవా

ఇద్దరూ తమ గుప్పెడంత గుండెలో దాచిన ఆవేశం ఎరుపై పొంగదా
తీపిపులుపుల మేలు కలయికను దాచిన నారింజరంగు కాదా వారి జంట,
          అర్ధనారీశ్వరపు అందమే కాదా ఆ కలయిక
          ఆ రంగుని చూసినంతనే ఆవర్ణం కాదా చూచెడి వారి మది
నీలాకాశమంత విశాలమే వారి ప్రేమ,
          నీలాకశమందున్న శూన్యమే వారి దూరం ,
          ఆ ప్రేమ నీలవర్ణమై నిండదా
ఆమె కనులే నీలికలువలు కావా,
          ఆ నీలికలువులు అతని చూచి ఆనందంతో వికసించలేదా,
          ఆ నీలికలువలతో నింగిని నింపలేదా
అతను శ్యామవర్ణ సుందరాంగుడికి సాటి కాదా
          అతనిలో పొంగిన ఆనందహేల శ్యామవర్ణమై ముంచెత్తలేదా
వారి జీవనానికి పచ్చతోరణాలు కట్టదా ఆకుపచ్చ వర్ణం 
          ఆ వన్నెల వర్ణము కనినంతనే చేరదా ఆహ్లాదం
మంగళకరమౌ వారి జీవనం, పసుపుబట్టలు కట్టలేదా ఆ జంట
          అందమే ఇక వారి జీవనయానం

ఇంతలో ఏమాయె, ఆ హరివిల్లు అదృశ్యమాయె
శ్వేత కిరణపు ప్రియుడే దోబూచులాడెనా ?
హిమబిందువంటి ప్రేయసే అలిగి నేలపొరలలో దాగెనా?
మళ్ళీ ఆ హరివిల్లు కనిపించేదానేడో ?

=================

కన్నెల మానసచోరుడు కన్నయ్య వేణుగానము వినినంత
ప్రేమతెమ్మెరల మోసుకుని వాయువులు వీచగా
విరహమునున్న శ్వేతవర్ణపు నాయిక రుక్మిణియే
సప్తవర్ణాల నాయికల ముందుకు నడిపించెనా
లేక వారితో కలిసి తానే పరుగిడెనా ?

ఆ అష్టనాయికల పయనం ఆ వేణువు చెంతకే
ఆ వేణువు చెంత చేరినంతనే ఆ మురళీధరుని కంఠమాలలాయిరా ?
అందమైన హరివిల్లుగా చూపులు దోచితిరా ?
ఆ వేణుగానమాగినంతనే అష్టనాయికలూ ఒక్కరై
శ్వేతవర్ణపు నాయికై మురళీధరుని చేత వెన్నంటి రుక్మిణిగా మిగిలిరా ?

===============

మీనములే ఆమె కన్నులా?
శ్వేతవర్ణపు సౌందర్యవతా ఆమె ?
ఆమె ద్రుపదరాజపుత్రి ద్రౌపదే కదా
సిగ్గులమొగ్గై స్వయంవర సభను చేరె

పాండవ మధ్యముడు అర్జునుడు చేపట్ట సభను చేరె
నేలపై వంగి, కన్నులు కిందకు దింపి
మేఘనాధుని ప్రార్ధించ, దీవెనలు వర్షపు జల్లులై దీవించ
గోపయ్య చల్లని చూపులు ఆశీస్సుల కిరణాలై అచట ప్రసరించ

ఆ సవ్యసాచి చేత చేరె "ఇంధ్రధనస్సు"
ఆ ధనస్సు గురి మీనముల కన్నులు కాదేమో
అసలు గురి మీనములే కన్నుల నింపి చూచుచున్న ద్రౌపదేమో
ఆతని బాణం గురి తప్పక ఆమె కంఠసీమను అలంకరించె వివాహ హారమై

( ఇక్కడి నుంచి పాంచాలి అయ్యే ఘట్టాన్ని కావాలనే వదిలివేస్తున్నాను. ఔత్సాహికులు కొనసాగించవచ్చు)

గంగమ్మ పరవళ్ళు

ఎక్కడ బయలుదేరిందో ఆ గంగమ్మ
ఎక్కడైనా ఒకటే గమ్యమట,
సంద్రపు ప్రియుడిని చేరడమేనట
కొండలలో మొదలై
ప్రియుని వెతుకుతూ పరవళ్ళు తొక్కుతూ
జలపాతమై దూకి
సర్వశక్తులతో రాళ్ళను పక్కకు తోసి
లోయలలోతులు నింపి
సుడిగుండమై మధనపడి
ఇసుకఎడారిని దాటి
రాత్రైనా పగలైనా
విరహపు వేసళ్ళు ఎండగట్టినా
ప్రియుని మేఘ సందేశాలు హృదయాన్ని నింపినా
శీతలపవనాలు ఆమె పయనాన్ని ఆపే ప్రయత్నం చేసినా
ప్రియుని చేరిందట
ఆ పరవళ్ళతో ప్రియుని ముంచాలని ఆమె ఆరాటం

చేరవచ్చిన ప్రియురాలిని కౌగలించుకోను అలల చేతులు జాపాడు ఆ సముద్రుడు
తనలో దాగిన శంఖంతో ఆమెకు స్వాగతగీతం పాడాడు
ఆ ప్రియుల కలయికతో పరవశించిన నదీసంగమం కొత్త పరవళ్ళు తిరిగంది
ఎన్ని సుడుల నాట్యాలు చేసారో ఆ ప్రియులు
(నయాగారా జలపాతం చూసాక మనసులో పొంగిన ఒక భావం)

గడ్డి పూలు నవ్వాయి

బజార్లోకి మల్లెపూల బండి వచ్చి ఆగింది,
తరుణులు ఒక్క మల్లె దొరికినా చాలంటూ మూరలే ఎత్తుకెళ్ళారు
భార్యాప్రసన్నం చేసుకోను పతులు గంపలెత్తుకెళ్ళారు
తరుణీమణుల జడను చేరి తరుణులకన్నా వారి జడలే అందమని మెప్పించాయి
తెల్లవారేసరికి మల్లెలు గడ్డిపై పడ్డాయి
అది చూసి హేమంతపు హిమబిందువులు ఏడుస్తూ ఊరిని కప్పేసాయి
ఊరడిస్తూ సూరీడు వచ్చాడు,
హిమబిందువులను తుడిచాడు.. రోజుకు స్వాగతం చెప్పాడు

మరో రోజు చామంతుల బుట్ట ఆగింది,
మళ్ళీ అదే తంతు
చామంతులు కూడా వాడిపోయాయి
బంతులు బంతాట ఆడినంతనే కమలిపోయాయి

ముళ్ళబందీ రోజాలు రోజుకొక జంటను కలుపుతున్నా
మొగ్గ విడవకుండానే వాడిపోతున్నాయి
మొగ్గ విడిచిన రోజాలు ఆహారప్రియులకు ఆహరమయ్యాయి
ఆకర్షణగా మిగిలాయి
మల్లెల ఊరడించిన సూరీడి ఎండ తగిలితేనే కమిలిపోయాయి
ముళ్ల మధ్య బందీ అయితేనే వాటికి అందమేమో

ఎర్రని మందారాలు రేకురేకుగా గుడిలో పూజకు వెళ్ళాయి
ఒళ్ళంతా చిధ్రమై భక్తుల చెవిలో చేరాయి

ఆకులమే అయినా పువ్వులకు పోటీ అంటూ
మొగలిరేకులు, మరువపు ఆకులు దూసుకొచ్చాయి
వాడినా గుబాళిస్తూ పాత బట్టలలోనో పుస్తకం మధ్యలోనో బందీ అయ్యాయి
అదృష్టం తెస్తాయని ఎవరు చెప్పారో ఇంటింటా కొలువుతీరాయి మనీప్లాంట్ లు

చెరువులో బురదనుంచి పుట్టుకొచ్చింది ఒక తామర, మరో కలువ
ఆ అందానికి మైమరచి బురదను దిగి సొంతం చేసుకున్న వాళ్ళెంతమందో

కాలం మారింది .... ప్రకృతిపై కన్నెర్ర చేసింది ...

నారీమణుల జడలు ఉలిక్కిపడ్డాయి
కొందరి జుట్టు రాలిపడింది
"వేణీ" అన్న పదం నిఘంటువుకే పరిమితమయ్యింది

మల్లెలు తెచ్చే ఖర్చు మగడకి తగ్గింది,
హేమంతం హిమబిందువులు రాల్చ రాలిన మల్లెలు లేవు
ఎవరిని ఊరడించాలి సూరీడు
ఆగక చెలరేగిపోతున్నాడు

చామంతులు, బంతులు అర్ధాలే తెలియని పిల్లలు వచ్చారు
బంతాట అంటే వీడియోగేమనే తెలుసు కదా మరి
జాతీయజండాతో కలిసి ఎగిరే చామంతులు, బంతులు
జాతీయజండా విలువ తెలియని వారి మధ్య నలిగిపోయాయి

ముళ్ళబందీని విడిపించే కష్టం తనకేల అనుకున్నాడేమో నేటి ప్రియుడు
గ్రీటింగ్ కార్డ్ పై గులాబీ బొమ్మతో సందేశమంపాడు
చాచా నెహ్రూ గులాబీ అలంకరణ పిల్లల దినోత్సవానికే పరిమతమయ్యింది

ముద్ద మందారాలే కావాలా అనుకున్నారేమో
లేక దేవునికి పూజలెందుకనుకున్నారో
ముద్ద మందారాలు ఉనికిని కోల్పోయాయి
చెవిలో పువ్వు పెట్టే వారు తయారయ్యారు

మొగలిరేకుల జాడే తెలియలేదు
చిన్నబుచ్చుకున్న మరువం ఏడ దాగుందో
అదృష్టం అంటే నమ్మకమే లేదో మనీప్లాంట్ స్థానంలో బోన్సాయ్ మొక్కలొచ్చాయి

చెరువులే లేక కలువలు తామరలు బొమ్మలకే పరిమతమయ్యాయి
వాటి కోసం బురదలో దిగాల్సిన అవసరమే లేకుండా పోయింది.
"పంకజముఖి" అన్న వర్ణన అర్ధమేమిటో తెలియక బుర్రలు పీక్కునే కవులు తయారయ్యారు

ఇంత చూసినా తన చిన్న గుండె పగలనందుకు గడ్డి ఏడిచింది
హేమంతపు హిమబిందువులు లేని లోటు తెలిసేలా
కనీసం తన పూలైనా చూడకపోతారా తరుణీమణులు అని రోజూ పూలను పూస్తూనే ఉంది
ఎక్కడైనా పెరుగుతాను కదా అందం వైపు చూపు మళ్ళించలేనా అనుకుంది పిచ్చిది
కాంక్రీట్ అరణ్యంలో తనకోసం అడుగు నేల కూడా మట్టితో లేక ఏడ్వలేక నవ్వింది
కోపమొచ్చిన సూరీడు వేడిని పెంచాడు కాంక్రీట్ ముక్కలు బద్దలయ్యేలా
వేడికి విలవిలలాడింది భూమి, నిలువెల్లా కంపించింది
కాంక్రీట్ అరణ్యం శిధిలమయ్యింది
అక్కడ మొలచిన గడ్డిపూలు మళ్ళీ ఏడ్వలేక నవ్వాయి
అందాన్ని చూపించ మనుషులేరీ అని

ఆ గడ్డిపూలు నవ్వుతున్నాయి... ఇప్పటికైనా కళ్ళు తెరవరా అని

(అక్కడక్కడ కొంచెం శృతి మించి ఉండవచ్చు. ముఖ్యంగా జడల విషయంలో. కానీ రాబోయే పరిస్థితి అంతకన్నా దయనీయంగా ఉండే అవకాశాలున్నాయి. ఈ విషయం గ్రహిస్తే చాలు. ఇది నేను మహిళలను కించపరచడం అనుకోవడం లేదు. ఎవరికైనా అలా అనిపిస్తే క్షంతవ్యుడినే కానీ ఆ వ్యాక్యాలు మాత్రం తొలగించబడవు ) 

దూది పింజను నేను

చల్లగా గాలి వీస్తోంది ,
ఒక దూదిపింజ గాలికి నాట్యమాడుతూ నా చేతిని తడిమి ముందుకు దూసుకుపోయింది
నా మనసు కూడా ఆ దూదిపింజలానే ఎగురుతోంది
నీ ముంగురులతో పాటే అది కూడా నాట్యమాడుతోంది

ఆ సాయంత్రం ఆ దూదిపింజ గాలిలో ఎగిరే గరుడ పక్షిని చూసి సైతం నవ్వింది
ఒక మహరాజులా గాలి పల్లకీలో ఊరేగింది
ప్రపంచాన్ని చుట్టేసి వచ్చింది

నీ ముంగురుల మబ్బులలో నా మనసు తేలియాడుతోంది
విధి అనే నేలవైపే చూడలేదు
హద్దులే లేక పైపైకి ఎగసింది నా మనసు

ఇంతలో ఆ గాలితో పాటు నల్లని మబ్బులు కూడా వచ్చాయి
మన ప్రణయంతో పాటు మన మధ్య స్పర్ధలు కూడా వచ్చాయి

కురిసే ప్రతీ చినుకునీ తనలో దాచుకోలేక ఆ దూదిపింజ బరువెక్కింది
సరాసరి నేలపై కూలబడింది, మళ్ళీ ఏనాటికి ఎగిరేనో ఆ దూదిపింజ

మన మధ్య మొదలైన స్పర్ధలు చినికి చినికి గాలివాన అవుతాయా ???
గాలిలో స్వేచ్చగా తేలిన దూదిపింజను చూసి ముచ్చటపడిన నేను
ఆ దూది పింజలా నేలపై కూలబడలేను
నీ అశ్రువుల వానను కురవనీయకు

నా మనసు ఆ దూదిపింజ లాంటిదే,
నీ ముంగురుల నాట్యంలో ఆకసమే హద్దుగా పరవశించిన నేనే
నీ అశ్రువుల వాన కురిస్తే బరువెక్కి కూలబడతాను

ప్రియా, ఆ స్పర్ధల తెల్ల మబ్బులా తేలిపోనీ
నీ నవ్వులలో ఆ గగనమే హద్దుగా నన్ను సాగిపోనీ
దూదిపింజను నేను...

విరహంతో విహారం

విరహపు ఎడారిలో నిలుచున్నా
ఆ విరహపు సెగలలో కాలి బూడిదవుతానేమో
నీవిచ్చిన ప్రణయపు విత్తుల రక్షించలేనేమో
ఈ ఎడారిలో ఒయాసిస్సులు లేవని ఏనాడో తెలిసింది
చివరిసారి నిను వీడినప్పుడు
నీ చూపుల జారిపడిన అశ్రువులే నా దప్పిక తీర్చాయి ఇన్నాళ్ళు
ఇప్పుడు అవి కూడా అడుగంటాయి

ఈ విరహపు ఎడారిని ఎలా దాటాలి,
దాటి ఆవల మన ప్రణయపు కోటలో ప్రేమ సింహాసనాన్ని ఎలా అధిరోహించాలి
స్పృహ తప్పి విరహసైకతపాన్పుపై పవళించా
కలలో నీ ప్రేమ వెంటాడింది, కానీ నాలోఓపికేదీ ?

పైన విధి రాబందు రూపంలో ఎగురుతోంది,
విరహపు ఎడారిలో నా ఓటమికోసమెదురు చూస్తోందేమో!

ఇంతలో వచ్చింది ఒక బంగారు గ్రద్ద
వస్తూ తనతో ఒక లేఖను జారవిడిచింది,
చిత్రం అది నీవు పంపిన లేఖే
సత్తువనంతా కూడదీసుకుని చూసా,
నీ చూపులలోని ప్రేమ మరోమారు వెంటాడింది
కనుచూపుమేరలో ఒయాసిస్సును చూపింది

నా ప్రయాణం మళ్ళీ మొదలుపెట్టా
ఆ బంగరు గ్రద్ద తోడుగా,
నెమ్మదిగా ఎడారిని దాటా,
చిత్రం నా ప్రణయపు కోట కనిపించలేదు

కానీ సంకల్పపు నది కనిపించింది
ఆ నదీతీరాన నాతో తెచ్చిన ప్రణయపు విత్తులు నాటా
అక్కడ పెరిగిన తోటలో విరహంతో విహారం చెయ్యసాగా
ఈ విరహపు తోటలో పూచిన మల్లెలు నీ జడను చేరాలని ఎదురు చూస్తున్నాయి

విరహం మన తనువులకే, మనసులకు కాదని తెలుసు
అందుకే నీ విరహం కూడా నాకు ప్రణయమే

ఒక సీతాకోక చిలుక తన గూడు నుంచి బయటకు రాబోతోంది
సంకల్పపు నదిలో అల్లంత దూరాన నీ చాయలు కనిపించాయి
విరహంతో విహారం నేటితో పూర్తి

(చిన్నప్పుడు కలలో వచ్చిన బంగారు గ్రద్ద స్ఫూర్తిగా, బంగారు గ్రద్దను వార్తాహారిగా వాడటం జరిగింది)