హరివిల్లు

హరివిల్లు – సప్తవర్ణాల మేలు కలయిక
ఇంధ్రధనస్సుగా పేరు గాంచెను
ఆ హరివిల్లుని చూసినంతనే ఎన్నో భావాలు, ఆ భావాల కలయికే ఈ రచన.
ఇది సప్తభావాల కలయిక కాదు
సప్తాశ్వాలపై ఊరేగు సూరీడి రధము కాదు
ప్రకృతిని చూచి పరవశించిన నా ఉప్పొంగుభావాల కలబోత

=============

శ్వేతకిరణం ప్రియుడు
హిమబిందువు ఆ ప్రేయసి
ఇద్దరూ కలిసిన క్షణం ఆవిష్కృతం కాదా అందాల హరివిల్లు
వారి కలయికలో ఆ ఒక్క క్షణంలో ఎన్నో భావాలు పొంగవా
ఆ భావాలే సప్తవర్ణాలై ప్రతిబింబించవా

ఇద్దరూ తమ గుప్పెడంత గుండెలో దాచిన ఆవేశం ఎరుపై పొంగదా
తీపిపులుపుల మేలు కలయికను దాచిన నారింజరంగు కాదా వారి జంట,
          అర్ధనారీశ్వరపు అందమే కాదా ఆ కలయిక
          ఆ రంగుని చూసినంతనే ఆవర్ణం కాదా చూచెడి వారి మది
నీలాకాశమంత విశాలమే వారి ప్రేమ,
          నీలాకశమందున్న శూన్యమే వారి దూరం ,
          ఆ ప్రేమ నీలవర్ణమై నిండదా
ఆమె కనులే నీలికలువలు కావా,
          ఆ నీలికలువులు అతని చూచి ఆనందంతో వికసించలేదా,
          ఆ నీలికలువలతో నింగిని నింపలేదా
అతను శ్యామవర్ణ సుందరాంగుడికి సాటి కాదా
          అతనిలో పొంగిన ఆనందహేల శ్యామవర్ణమై ముంచెత్తలేదా
వారి జీవనానికి పచ్చతోరణాలు కట్టదా ఆకుపచ్చ వర్ణం 
          ఆ వన్నెల వర్ణము కనినంతనే చేరదా ఆహ్లాదం
మంగళకరమౌ వారి జీవనం, పసుపుబట్టలు కట్టలేదా ఆ జంట
          అందమే ఇక వారి జీవనయానం

ఇంతలో ఏమాయె, ఆ హరివిల్లు అదృశ్యమాయె
శ్వేత కిరణపు ప్రియుడే దోబూచులాడెనా ?
హిమబిందువంటి ప్రేయసే అలిగి నేలపొరలలో దాగెనా?
మళ్ళీ ఆ హరివిల్లు కనిపించేదానేడో ?

=================

కన్నెల మానసచోరుడు కన్నయ్య వేణుగానము వినినంత
ప్రేమతెమ్మెరల మోసుకుని వాయువులు వీచగా
విరహమునున్న శ్వేతవర్ణపు నాయిక రుక్మిణియే
సప్తవర్ణాల నాయికల ముందుకు నడిపించెనా
లేక వారితో కలిసి తానే పరుగిడెనా ?

ఆ అష్టనాయికల పయనం ఆ వేణువు చెంతకే
ఆ వేణువు చెంత చేరినంతనే ఆ మురళీధరుని కంఠమాలలాయిరా ?
అందమైన హరివిల్లుగా చూపులు దోచితిరా ?
ఆ వేణుగానమాగినంతనే అష్టనాయికలూ ఒక్కరై
శ్వేతవర్ణపు నాయికై మురళీధరుని చేత వెన్నంటి రుక్మిణిగా మిగిలిరా ?

===============

మీనములే ఆమె కన్నులా?
శ్వేతవర్ణపు సౌందర్యవతా ఆమె ?
ఆమె ద్రుపదరాజపుత్రి ద్రౌపదే కదా
సిగ్గులమొగ్గై స్వయంవర సభను చేరె

పాండవ మధ్యముడు అర్జునుడు చేపట్ట సభను చేరె
నేలపై వంగి, కన్నులు కిందకు దింపి
మేఘనాధుని ప్రార్ధించ, దీవెనలు వర్షపు జల్లులై దీవించ
గోపయ్య చల్లని చూపులు ఆశీస్సుల కిరణాలై అచట ప్రసరించ

ఆ సవ్యసాచి చేత చేరె "ఇంధ్రధనస్సు"
ఆ ధనస్సు గురి మీనముల కన్నులు కాదేమో
అసలు గురి మీనములే కన్నుల నింపి చూచుచున్న ద్రౌపదేమో
ఆతని బాణం గురి తప్పక ఆమె కంఠసీమను అలంకరించె వివాహ హారమై

( ఇక్కడి నుంచి పాంచాలి అయ్యే ఘట్టాన్ని కావాలనే వదిలివేస్తున్నాను. ఔత్సాహికులు కొనసాగించవచ్చు)

8 comments:

మరువం ఉష said...

హరివిల్లులో ఎన్ని వన్నెలున్నాయో అన్ని వైనాల్లో మీరు అల్లుకుపోయాక ఇక మాకేం మిగిలింది, తన్మయంగా పైనుంచి క్రిందకి, క్రిందనుంచి పైకి చదివి పరవశించటం తప్పా. ఎక్కడినుంచి వస్తుంది మీకింత చిక్కని భావాల మేళవింపు? ఆశ్చర్యంగా వుంటుంది తలచుకుంటే.

హరే కృష్ణ said...

ఒకదానికి మించి ఇంకోటి బాగా రాసావ్
మూడవది నాకు చాల నచ్చింది
అభినందనలు అర్జున్

Unknown said...

* ఉషగారు,
మీ అభిమానానికి ధన్యవాదాలు. కొన్నిసార్లు ఏదైనా బాగా నచ్చినప్పుడు మనం ఆ భావావేశంలో పడిపోతాం. ఆ భావావేశం ఎలాంటిదంటే, దానిలో తప్పులున్నా క్షమిస్తాం. ఇప్పుడు మీరు కూడా అదే చేసారు.
(మీకు ఈకలు పీకే అలవాటు లేకపోవడం వల్ల నాకు అడ్వాంటేజి ;) )
ఇక ఈ భావాల చిక్కని మేళవింపు? మీరే అంటున్నారా? దశావతారాల లీలను రాసి, ప్రేమ కావ్యాన్ని రచించి... నేనింకా నా ప్రయాణంలో ప్రారంభంలో ఉన్నాను. ఈ బావావేశం ప్రతీ క్షణం రాదు లెండి.
==
మీరు కూడా ఈ హరివిల్లుని సప్తకవితల సంకలనం చేసే ప్రయత్నానికి చేయూతనీయరాదా ?
* హరేకృష్ణ గారు,
ధన్యవాదాలు, రెండూ రాసాక మూడవది రాసాను కనుక ఆ మూడ్ వేరేగా ఉంది, అది కూడా వేరేగా వచ్చింది.

మరువం ఉష said...

ప్రదీప్, మీరన్న "సప్తకవితల సంకలనం" తప్పక సఫలీకృతమౌతుంది. ఏమి చేయాలో చెప్పండి మాస్టారు? ;) ఇక నా గురించి మీరన్న "మీకు ఈకలు పీకే అలవాటు లేకపోవడం వల్ల నాకు అడ్వాంటేజి ;) " చదువుతుంటే ఎందుకో రెండు విషయాలు గుర్తుకొచ్చాయి. మన్నించండి కవిత నుండి ప్రక్కకి పోతున్నాను.
(1) మా సుబ్బు, చిన్నప్పటినుండి మా ఇంట్లో పనుల్లో సహాయపడుతుంది, నేనంటే ప్రాణంగా వుంటుంది. నేనే పట్టుపట్టి చదివి, సంతకం చేయటం నేర్పాను. ఒకసారి "మీ చేతుల్లాగా మనసూ మెత్తనండి" అంది. తన నేపథ్యానికి "మీరు సీతమ్మోరి వంటి వారు" అనో "మీ మాటలో కరుకులేదు" అంటేనో సహజం. కనుక నాకు నిజంగా మీకు ఈకలు పీకే అలవాటు లేదని సుబ్బు కూడా తీర్మానించేసింది. ;)
(2) కాస్త అభిప్రాయాలు వ్యక్తం చేసే వయసొచ్చిన మా బాబు "అమ్మా, నీ గుణాలే నాకిచ్చావు. ఎప్పుడూ ఈ మాట అంటే అది ఎదుటివారికి ఏ విధంగా అర్థం అవుతుందో అని ముందే ఆలోచించుకుంటాము. మనమే ముందు ప్రతిస్పందనని వూహించేస్తాము. ఇది బలమా? బలహీనతా?" అని అడిగాడు. బహుశా నా తీరే అంతేమో. సహజంగా ఏమీ అనను. ఏదైనా అనాలంటే ముందు ఆలోచన అధికం. Just thought of sharing... అయ్యబాబోయ్ ఒక్కమాటకి ఎంత [సొంత] సుత్తికి దొరికిపోయాను అనుకున్నారా ;) ఈకలు పీకకుండా వినోదించటం లో ఇదొక తీరు. హ హ హ్హా

Unknown said...

ఏముంది, మీరు కూడా ఒకటో రెండో కవితలు రచించండి హరివిల్లుపై... ఈ రాత్రికి మరో కవిత రాస్తున్నాను (ప్రయత్నిస్తున్నాను)
బాగున్నాయి మీ అనుభవాలు.

మరువం ఉష said...

సరే సార్, హోం వర్క్ అడగకండి, ఎపుడో ఒకపుడు చేసేస్తాం. మా వూర్లో ఈ మధ్య ఎన్ని సార్లు హరివిల్లుల నిజ దర్శనమయిందోను కూడా!

Dileep.M said...

eXCELLENT...

శ్వేతకిరణం ప్రియుడు
హిమబిందువు ఆ ప్రేయసి
ఇద్దరూ కలిసిన క్షణం ఆవిష్కృతం కాదా అందాల హరివిల్లు

Unknown said...

:)