విరహంతో విహారం

విరహపు ఎడారిలో నిలుచున్నా
ఆ విరహపు సెగలలో కాలి బూడిదవుతానేమో
నీవిచ్చిన ప్రణయపు విత్తుల రక్షించలేనేమో
ఈ ఎడారిలో ఒయాసిస్సులు లేవని ఏనాడో తెలిసింది
చివరిసారి నిను వీడినప్పుడు
నీ చూపుల జారిపడిన అశ్రువులే నా దప్పిక తీర్చాయి ఇన్నాళ్ళు
ఇప్పుడు అవి కూడా అడుగంటాయి

ఈ విరహపు ఎడారిని ఎలా దాటాలి,
దాటి ఆవల మన ప్రణయపు కోటలో ప్రేమ సింహాసనాన్ని ఎలా అధిరోహించాలి
స్పృహ తప్పి విరహసైకతపాన్పుపై పవళించా
కలలో నీ ప్రేమ వెంటాడింది, కానీ నాలోఓపికేదీ ?

పైన విధి రాబందు రూపంలో ఎగురుతోంది,
విరహపు ఎడారిలో నా ఓటమికోసమెదురు చూస్తోందేమో!

ఇంతలో వచ్చింది ఒక బంగారు గ్రద్ద
వస్తూ తనతో ఒక లేఖను జారవిడిచింది,
చిత్రం అది నీవు పంపిన లేఖే
సత్తువనంతా కూడదీసుకుని చూసా,
నీ చూపులలోని ప్రేమ మరోమారు వెంటాడింది
కనుచూపుమేరలో ఒయాసిస్సును చూపింది

నా ప్రయాణం మళ్ళీ మొదలుపెట్టా
ఆ బంగరు గ్రద్ద తోడుగా,
నెమ్మదిగా ఎడారిని దాటా,
చిత్రం నా ప్రణయపు కోట కనిపించలేదు

కానీ సంకల్పపు నది కనిపించింది
ఆ నదీతీరాన నాతో తెచ్చిన ప్రణయపు విత్తులు నాటా
అక్కడ పెరిగిన తోటలో విరహంతో విహారం చెయ్యసాగా
ఈ విరహపు తోటలో పూచిన మల్లెలు నీ జడను చేరాలని ఎదురు చూస్తున్నాయి

విరహం మన తనువులకే, మనసులకు కాదని తెలుసు
అందుకే నీ విరహం కూడా నాకు ప్రణయమే

ఒక సీతాకోక చిలుక తన గూడు నుంచి బయటకు రాబోతోంది
సంకల్పపు నదిలో అల్లంత దూరాన నీ చాయలు కనిపించాయి
విరహంతో విహారం నేటితో పూర్తి

(చిన్నప్పుడు కలలో వచ్చిన బంగారు గ్రద్ద స్ఫూర్తిగా, బంగారు గ్రద్దను వార్తాహారిగా వాడటం జరిగింది)

4 comments:

Dileep.M said...

Excellent again -1+1=0

పరిమళం said...

"కానీ సంకల్పపు నది కనిపించింది
ఆ నదీతీరాన నాతో తెచ్చిన ప్రణయపు విత్తులు నాటా
అక్కడ పెరిగిన తోటలో విరహంతో విహారం చెయ్యసాగా
ఈ విరహపు తోటలో పూచిన మల్లెలు నీ జడను చేరాలని ఎదురు చూస్తున్నాయి "
విరహంతో విహారం ....వినటానికి ఎంతో బావుంది
మీ ఊహ మరీ బావుంది !

మరువం ఉష said...

"విరహము కూడా సుఖమే కాదా, విరహపు వేదన మధురము కాదా" .. ఇంతకీ సంకల్పం తనని రప్పించాలనా? తనువున ఉప్పెనైన విరహాన్ని తప్పించాలనా? విరహం నిజానికి ఎడారి కాదు సుమండి, వానమబ్బు, కాసేపు వూరించి, వుడికించి జడిలా జాలువారినట్లే ప్రణయపు నీటి మూటలు మోసుకువస్తుంది. కిళ్ళీలో కాసు వంటిదనుకోండి, సామాన్య జనభాషలో, కాసేపు నోరు మండించినా, మత్తు కప్పుతుంది, నోరు పండిస్తుంది. ఇక ఆ బంగారు గ్రద్దని నాకు సాయపడుతుందేమో అడగండి. నాకు ఇనపరెక్కల కోడి వచ్చింది కొన్నిసార్లు కలలో. ;)

Unknown said...

@Dileep,
Yes -1+1=0. (ఇలా ప్రతీసారీ లీక్ చేసేస్తే ఎలా అబ్బా)
@పరిమళం గారు,
ధన్యవాదాలు
@ఉషగారు,

గమనించారో లేదో విరహం ఎడారి అని మొదలుపెట్టి దానిని తోటలా చేసాను. ( పైన మా అన్నయ్య చూడండి నా ఫార్ములా ఎలా రాసేసాడో.)
ఇక సంకల్పం తనని రప్పించాలనే సుమా, ఎందుకంటే తను వస్తే తనువున ఉప్పెనైన విరహం తప్పుకుపోతుంది కదా.
ఇనపరెక్కల కోడైతే పర్లేదు, ఇనపగజ్జెల తల్లైతేనే బాధ. నా బంగరు గ్రద్ద నాకు దొరికాక పంపుతాలెండి.