నాదో చిన్ని కోరిక,
నేను వెక్కి వెక్కి ఏడవాలి, ఆనందవాహినిలో డోలాలాడుతూ
నాదో చిన్ని కోరిక,
నేను పడి పడి నవ్వాలి, ధు:ఖ హాలాహాలాన్ని ఇట్టే పట్టి
నాదో చిన్ని కోరిక,
నేను విరహ గ్రీష్మాగ్నిలో సాగాలి, ప్రియప్రణయ హేమంతాన్ని చేతపట్టుకుని
నాదో చిన్ని కోరిక,
నేను వైరాగ్యశిఖరంపై నిలవాలి, విజయ శిఖరాలు దాటి
నాదో చిన్ని కోరిక,
నేను ప్రళయఘోషలో ఆలాపన చేయాలి, ఆదిప్రణవరాగంలో
నాదో చిన్ని కోరిక,
నేను భవసాగర లోతులు కొలవాలి, భవబంధాలను బందీ చేసి
నాదో చిన్ని కోరిక,
నిర్గుణమార్గంలో స్థితప్రజ్ఞతతో నడవాలి
నేను కోరికలకు అతీతుడనై నిలిచాక, ఇక కోరికే లేదు !!!
ఇక నేనే లేను, అన్నీ నేనే అయ్యాక !!!
No comments:
Post a Comment