నీటి మీది రాతలు... నిన్న రాతిరి శపథాలు

దూరాన మబ్బుల చాటున దాగిన చంద్రుడు నెమ్మదిగా వెలికి వస్తున్నాడు
******

మొన్న రేయి స్వప్నంలో మన కలయిక,
నిన్నరాతిరి ఊసులలో జీవితాంతం నీ తోడు వీడనన్న నీ శపధం

రేపటి రోజుకు ఎదురుచూస్తూ ఎదపాడిన జోలపాటలో
అటుపిమ్మటి రోజున రాబోయే బంగరురోజుల కలలో
తనువు అలిసినా నా మది నాట్యమాడుతూనే ఉంది

******
ఇంతలో ఆకసాన్ని చీలుస్తూ రాలిపడింది తోకచుక్క
******

మొన్న రేయి స్వప్నాలు, నిన్న రాతిరి శపధాలు
నీటి మీద రాతలా? క్షణ మాత్రపు ఆనందాలా?

రేపటి గమ్యాలు, అటు పిమ్మటి బంగరుకలలు
నిప్పులోన పుల్లలా? బూడిదయ్యే కలలా?

నేటి నా హృదయఘోషను పలుకు భాషేది?
ఉప్పొంగి పొంగే కన్నీటిఅలలలో దిక్కు తెలియని పత్రమైనది నా మనసు

******
కొన్నాళ్ళకు తోకచుక్క రాలిన చోటున గుర్తు తెలియని రాళ్ళు కానవచ్చాయి, అవి వజ్రాలు
******

ఆనాటి నీటి మీది రాతలు,
నేడు శిలాశాసనాలై నా మది శిలపై నిలిచాయి
ఆనాటి నిప్పులోని పుల్లలు,
నేడు కొత్త చిగురుతో చిరునవ్వు నవ్వాయి

******
వజ్రాల గనే కావచ్చు,
కానీ అది భూమి గుండెపై చేసిన గాయం ఇంకా కనిపిస్తూనే ఉంది
నీవు లేని లోటు కనిపిస్తూనే ఉంది

(ఇది ఒక ఊహాయత్నం, "నీటి మీది రాతలు... నిన్న రాతిరి శపథాలు" అన్న వాక్యం చుట్టూ నేను అల్లుకున్న పదబంధమిది.
కొన్ని కవితలు భావోద్వేగంతో కాదు, భావాన్ని వెలికితీసే యత్నంలో వస్తాయి. ఇది కూడా అలాంటిదే.
ఇది ఏ విభాగమో నేను చెప్పలేను, ఇది సానుభూతితోనో, బాధతోనే రాసిందైతే కాదు.
ఒకవేళ అలాంటి భావన మీ మనసులో కలిగితే అది మీ సున్నిత హృదయమే, దానికి నా జోహార్లు)

4 comments:

Padmarpita said...

చాలా బాగుందండి...

కెక్యూబ్ వర్మ said...

ముగింపు పాదాలు నన్ను మరింతగా ఆకట్టుకున్నాయి. మీ వివరణలో వున్న సున్నితత్వం మరీనూ..

మరువం ఉష said...

"గుండె గనుల్లో బొగ్గంటి బాధల్ని
ముగ్గు రాళ్ళుచేసి దంచుదామంటే
రవ్వ పొడుల్లా కవిత వెలుగులు రువ్వుతున్నాయి!"

నావే ఆ మాటలు..
అంతే కదా అంతా ఒక భావనని మనసు రకరకాల కోణాల్నుంచి, లేదా పలు దర్పణాల్లో కాంచినపుడు అవే తిరిగి మరో రూపుగా గోచరిస్తాయి. ఫలించని స్వప్నాలూ వుంటాయి, వమ్ము కానీ శపథాలూ వుంటాయి. నీటి మీద రాతలకి తోడు నూనె మరకలు, నిన్న రాతిరి శపథాలకి జతగా నిత్య జీవన గమనాలు.

నాది సున్నిత హృదయమనే మీ నిర్వచన్నాన్ని బట్టి మళ్ళీ రూఢీ చేసుకున్నాను.

Unknown said...

పైన ముగింపులో చెప్పినట్టు ఇది బాగుంది అంటే ఏకైక కారణం, అది మీ సున్నిత మనస్తత్వం మాత్రమే. ఇది నేను ఊహించి రాసినదే కనుక దీనిలో భావతీవ్రత గురించి నేను ఏమీ మాట్లాడలేను.
పద్మార్పితగారు, ఉష గారు, కుమార్ గారు,
ధన్యవాదాలు