హరివిల్లు

హరివిల్లు – సప్తవర్ణాల మేలు కలయిక
ఇంధ్రధనస్సుగా పేరు గాంచెను
ఆ హరివిల్లుని చూసినంతనే ఎన్నో భావాలు, ఆ భావాల కలయికే ఈ రచన.
ఇది సప్తభావాల కలయిక కాదు
సప్తాశ్వాలపై ఊరేగు సూరీడి రధము కాదు
ప్రకృతిని చూచి పరవశించిన నా ఉప్పొంగుభావాల కలబోత

=============

శ్వేతకిరణం ప్రియుడు
హిమబిందువు ఆ ప్రేయసి
ఇద్దరూ కలిసిన క్షణం ఆవిష్కృతం కాదా అందాల హరివిల్లు
వారి కలయికలో ఆ ఒక్క క్షణంలో ఎన్నో భావాలు పొంగవా
ఆ భావాలే సప్తవర్ణాలై ప్రతిబింబించవా

ఇద్దరూ తమ గుప్పెడంత గుండెలో దాచిన ఆవేశం ఎరుపై పొంగదా
తీపిపులుపుల మేలు కలయికను దాచిన నారింజరంగు కాదా వారి జంట,
          అర్ధనారీశ్వరపు అందమే కాదా ఆ కలయిక
          ఆ రంగుని చూసినంతనే ఆవర్ణం కాదా చూచెడి వారి మది
నీలాకాశమంత విశాలమే వారి ప్రేమ,
          నీలాకశమందున్న శూన్యమే వారి దూరం ,
          ఆ ప్రేమ నీలవర్ణమై నిండదా
ఆమె కనులే నీలికలువలు కావా,
          ఆ నీలికలువులు అతని చూచి ఆనందంతో వికసించలేదా,
          ఆ నీలికలువలతో నింగిని నింపలేదా
అతను శ్యామవర్ణ సుందరాంగుడికి సాటి కాదా
          అతనిలో పొంగిన ఆనందహేల శ్యామవర్ణమై ముంచెత్తలేదా
వారి జీవనానికి పచ్చతోరణాలు కట్టదా ఆకుపచ్చ వర్ణం 
          ఆ వన్నెల వర్ణము కనినంతనే చేరదా ఆహ్లాదం
మంగళకరమౌ వారి జీవనం, పసుపుబట్టలు కట్టలేదా ఆ జంట
          అందమే ఇక వారి జీవనయానం

ఇంతలో ఏమాయె, ఆ హరివిల్లు అదృశ్యమాయె
శ్వేత కిరణపు ప్రియుడే దోబూచులాడెనా ?
హిమబిందువంటి ప్రేయసే అలిగి నేలపొరలలో దాగెనా?
మళ్ళీ ఆ హరివిల్లు కనిపించేదానేడో ?

=================

కన్నెల మానసచోరుడు కన్నయ్య వేణుగానము వినినంత
ప్రేమతెమ్మెరల మోసుకుని వాయువులు వీచగా
విరహమునున్న శ్వేతవర్ణపు నాయిక రుక్మిణియే
సప్తవర్ణాల నాయికల ముందుకు నడిపించెనా
లేక వారితో కలిసి తానే పరుగిడెనా ?

ఆ అష్టనాయికల పయనం ఆ వేణువు చెంతకే
ఆ వేణువు చెంత చేరినంతనే ఆ మురళీధరుని కంఠమాలలాయిరా ?
అందమైన హరివిల్లుగా చూపులు దోచితిరా ?
ఆ వేణుగానమాగినంతనే అష్టనాయికలూ ఒక్కరై
శ్వేతవర్ణపు నాయికై మురళీధరుని చేత వెన్నంటి రుక్మిణిగా మిగిలిరా ?

===============

మీనములే ఆమె కన్నులా?
శ్వేతవర్ణపు సౌందర్యవతా ఆమె ?
ఆమె ద్రుపదరాజపుత్రి ద్రౌపదే కదా
సిగ్గులమొగ్గై స్వయంవర సభను చేరె

పాండవ మధ్యముడు అర్జునుడు చేపట్ట సభను చేరె
నేలపై వంగి, కన్నులు కిందకు దింపి
మేఘనాధుని ప్రార్ధించ, దీవెనలు వర్షపు జల్లులై దీవించ
గోపయ్య చల్లని చూపులు ఆశీస్సుల కిరణాలై అచట ప్రసరించ

ఆ సవ్యసాచి చేత చేరె "ఇంధ్రధనస్సు"
ఆ ధనస్సు గురి మీనముల కన్నులు కాదేమో
అసలు గురి మీనములే కన్నుల నింపి చూచుచున్న ద్రౌపదేమో
ఆతని బాణం గురి తప్పక ఆమె కంఠసీమను అలంకరించె వివాహ హారమై

( ఇక్కడి నుంచి పాంచాలి అయ్యే ఘట్టాన్ని కావాలనే వదిలివేస్తున్నాను. ఔత్సాహికులు కొనసాగించవచ్చు)

గంగమ్మ పరవళ్ళు

ఎక్కడ బయలుదేరిందో ఆ గంగమ్మ
ఎక్కడైనా ఒకటే గమ్యమట,
సంద్రపు ప్రియుడిని చేరడమేనట
కొండలలో మొదలై
ప్రియుని వెతుకుతూ పరవళ్ళు తొక్కుతూ
జలపాతమై దూకి
సర్వశక్తులతో రాళ్ళను పక్కకు తోసి
లోయలలోతులు నింపి
సుడిగుండమై మధనపడి
ఇసుకఎడారిని దాటి
రాత్రైనా పగలైనా
విరహపు వేసళ్ళు ఎండగట్టినా
ప్రియుని మేఘ సందేశాలు హృదయాన్ని నింపినా
శీతలపవనాలు ఆమె పయనాన్ని ఆపే ప్రయత్నం చేసినా
ప్రియుని చేరిందట
ఆ పరవళ్ళతో ప్రియుని ముంచాలని ఆమె ఆరాటం

చేరవచ్చిన ప్రియురాలిని కౌగలించుకోను అలల చేతులు జాపాడు ఆ సముద్రుడు
తనలో దాగిన శంఖంతో ఆమెకు స్వాగతగీతం పాడాడు
ఆ ప్రియుల కలయికతో పరవశించిన నదీసంగమం కొత్త పరవళ్ళు తిరిగంది
ఎన్ని సుడుల నాట్యాలు చేసారో ఆ ప్రియులు
(నయాగారా జలపాతం చూసాక మనసులో పొంగిన ఒక భావం)

గడ్డి పూలు నవ్వాయి

బజార్లోకి మల్లెపూల బండి వచ్చి ఆగింది,
తరుణులు ఒక్క మల్లె దొరికినా చాలంటూ మూరలే ఎత్తుకెళ్ళారు
భార్యాప్రసన్నం చేసుకోను పతులు గంపలెత్తుకెళ్ళారు
తరుణీమణుల జడను చేరి తరుణులకన్నా వారి జడలే అందమని మెప్పించాయి
తెల్లవారేసరికి మల్లెలు గడ్డిపై పడ్డాయి
అది చూసి హేమంతపు హిమబిందువులు ఏడుస్తూ ఊరిని కప్పేసాయి
ఊరడిస్తూ సూరీడు వచ్చాడు,
హిమబిందువులను తుడిచాడు.. రోజుకు స్వాగతం చెప్పాడు

మరో రోజు చామంతుల బుట్ట ఆగింది,
మళ్ళీ అదే తంతు
చామంతులు కూడా వాడిపోయాయి
బంతులు బంతాట ఆడినంతనే కమలిపోయాయి

ముళ్ళబందీ రోజాలు రోజుకొక జంటను కలుపుతున్నా
మొగ్గ విడవకుండానే వాడిపోతున్నాయి
మొగ్గ విడిచిన రోజాలు ఆహారప్రియులకు ఆహరమయ్యాయి
ఆకర్షణగా మిగిలాయి
మల్లెల ఊరడించిన సూరీడి ఎండ తగిలితేనే కమిలిపోయాయి
ముళ్ల మధ్య బందీ అయితేనే వాటికి అందమేమో

ఎర్రని మందారాలు రేకురేకుగా గుడిలో పూజకు వెళ్ళాయి
ఒళ్ళంతా చిధ్రమై భక్తుల చెవిలో చేరాయి

ఆకులమే అయినా పువ్వులకు పోటీ అంటూ
మొగలిరేకులు, మరువపు ఆకులు దూసుకొచ్చాయి
వాడినా గుబాళిస్తూ పాత బట్టలలోనో పుస్తకం మధ్యలోనో బందీ అయ్యాయి
అదృష్టం తెస్తాయని ఎవరు చెప్పారో ఇంటింటా కొలువుతీరాయి మనీప్లాంట్ లు

చెరువులో బురదనుంచి పుట్టుకొచ్చింది ఒక తామర, మరో కలువ
ఆ అందానికి మైమరచి బురదను దిగి సొంతం చేసుకున్న వాళ్ళెంతమందో

కాలం మారింది .... ప్రకృతిపై కన్నెర్ర చేసింది ...

నారీమణుల జడలు ఉలిక్కిపడ్డాయి
కొందరి జుట్టు రాలిపడింది
"వేణీ" అన్న పదం నిఘంటువుకే పరిమితమయ్యింది

మల్లెలు తెచ్చే ఖర్చు మగడకి తగ్గింది,
హేమంతం హిమబిందువులు రాల్చ రాలిన మల్లెలు లేవు
ఎవరిని ఊరడించాలి సూరీడు
ఆగక చెలరేగిపోతున్నాడు

చామంతులు, బంతులు అర్ధాలే తెలియని పిల్లలు వచ్చారు
బంతాట అంటే వీడియోగేమనే తెలుసు కదా మరి
జాతీయజండాతో కలిసి ఎగిరే చామంతులు, బంతులు
జాతీయజండా విలువ తెలియని వారి మధ్య నలిగిపోయాయి

ముళ్ళబందీని విడిపించే కష్టం తనకేల అనుకున్నాడేమో నేటి ప్రియుడు
గ్రీటింగ్ కార్డ్ పై గులాబీ బొమ్మతో సందేశమంపాడు
చాచా నెహ్రూ గులాబీ అలంకరణ పిల్లల దినోత్సవానికే పరిమతమయ్యింది

ముద్ద మందారాలే కావాలా అనుకున్నారేమో
లేక దేవునికి పూజలెందుకనుకున్నారో
ముద్ద మందారాలు ఉనికిని కోల్పోయాయి
చెవిలో పువ్వు పెట్టే వారు తయారయ్యారు

మొగలిరేకుల జాడే తెలియలేదు
చిన్నబుచ్చుకున్న మరువం ఏడ దాగుందో
అదృష్టం అంటే నమ్మకమే లేదో మనీప్లాంట్ స్థానంలో బోన్సాయ్ మొక్కలొచ్చాయి

చెరువులే లేక కలువలు తామరలు బొమ్మలకే పరిమతమయ్యాయి
వాటి కోసం బురదలో దిగాల్సిన అవసరమే లేకుండా పోయింది.
"పంకజముఖి" అన్న వర్ణన అర్ధమేమిటో తెలియక బుర్రలు పీక్కునే కవులు తయారయ్యారు

ఇంత చూసినా తన చిన్న గుండె పగలనందుకు గడ్డి ఏడిచింది
హేమంతపు హిమబిందువులు లేని లోటు తెలిసేలా
కనీసం తన పూలైనా చూడకపోతారా తరుణీమణులు అని రోజూ పూలను పూస్తూనే ఉంది
ఎక్కడైనా పెరుగుతాను కదా అందం వైపు చూపు మళ్ళించలేనా అనుకుంది పిచ్చిది
కాంక్రీట్ అరణ్యంలో తనకోసం అడుగు నేల కూడా మట్టితో లేక ఏడ్వలేక నవ్వింది
కోపమొచ్చిన సూరీడు వేడిని పెంచాడు కాంక్రీట్ ముక్కలు బద్దలయ్యేలా
వేడికి విలవిలలాడింది భూమి, నిలువెల్లా కంపించింది
కాంక్రీట్ అరణ్యం శిధిలమయ్యింది
అక్కడ మొలచిన గడ్డిపూలు మళ్ళీ ఏడ్వలేక నవ్వాయి
అందాన్ని చూపించ మనుషులేరీ అని

ఆ గడ్డిపూలు నవ్వుతున్నాయి... ఇప్పటికైనా కళ్ళు తెరవరా అని

(అక్కడక్కడ కొంచెం శృతి మించి ఉండవచ్చు. ముఖ్యంగా జడల విషయంలో. కానీ రాబోయే పరిస్థితి అంతకన్నా దయనీయంగా ఉండే అవకాశాలున్నాయి. ఈ విషయం గ్రహిస్తే చాలు. ఇది నేను మహిళలను కించపరచడం అనుకోవడం లేదు. ఎవరికైనా అలా అనిపిస్తే క్షంతవ్యుడినే కానీ ఆ వ్యాక్యాలు మాత్రం తొలగించబడవు ) 

దూది పింజను నేను

చల్లగా గాలి వీస్తోంది ,
ఒక దూదిపింజ గాలికి నాట్యమాడుతూ నా చేతిని తడిమి ముందుకు దూసుకుపోయింది
నా మనసు కూడా ఆ దూదిపింజలానే ఎగురుతోంది
నీ ముంగురులతో పాటే అది కూడా నాట్యమాడుతోంది

ఆ సాయంత్రం ఆ దూదిపింజ గాలిలో ఎగిరే గరుడ పక్షిని చూసి సైతం నవ్వింది
ఒక మహరాజులా గాలి పల్లకీలో ఊరేగింది
ప్రపంచాన్ని చుట్టేసి వచ్చింది

నీ ముంగురుల మబ్బులలో నా మనసు తేలియాడుతోంది
విధి అనే నేలవైపే చూడలేదు
హద్దులే లేక పైపైకి ఎగసింది నా మనసు

ఇంతలో ఆ గాలితో పాటు నల్లని మబ్బులు కూడా వచ్చాయి
మన ప్రణయంతో పాటు మన మధ్య స్పర్ధలు కూడా వచ్చాయి

కురిసే ప్రతీ చినుకునీ తనలో దాచుకోలేక ఆ దూదిపింజ బరువెక్కింది
సరాసరి నేలపై కూలబడింది, మళ్ళీ ఏనాటికి ఎగిరేనో ఆ దూదిపింజ

మన మధ్య మొదలైన స్పర్ధలు చినికి చినికి గాలివాన అవుతాయా ???
గాలిలో స్వేచ్చగా తేలిన దూదిపింజను చూసి ముచ్చటపడిన నేను
ఆ దూది పింజలా నేలపై కూలబడలేను
నీ అశ్రువుల వానను కురవనీయకు

నా మనసు ఆ దూదిపింజ లాంటిదే,
నీ ముంగురుల నాట్యంలో ఆకసమే హద్దుగా పరవశించిన నేనే
నీ అశ్రువుల వాన కురిస్తే బరువెక్కి కూలబడతాను

ప్రియా, ఆ స్పర్ధల తెల్ల మబ్బులా తేలిపోనీ
నీ నవ్వులలో ఆ గగనమే హద్దుగా నన్ను సాగిపోనీ
దూదిపింజను నేను...

విరహంతో విహారం

విరహపు ఎడారిలో నిలుచున్నా
ఆ విరహపు సెగలలో కాలి బూడిదవుతానేమో
నీవిచ్చిన ప్రణయపు విత్తుల రక్షించలేనేమో
ఈ ఎడారిలో ఒయాసిస్సులు లేవని ఏనాడో తెలిసింది
చివరిసారి నిను వీడినప్పుడు
నీ చూపుల జారిపడిన అశ్రువులే నా దప్పిక తీర్చాయి ఇన్నాళ్ళు
ఇప్పుడు అవి కూడా అడుగంటాయి

ఈ విరహపు ఎడారిని ఎలా దాటాలి,
దాటి ఆవల మన ప్రణయపు కోటలో ప్రేమ సింహాసనాన్ని ఎలా అధిరోహించాలి
స్పృహ తప్పి విరహసైకతపాన్పుపై పవళించా
కలలో నీ ప్రేమ వెంటాడింది, కానీ నాలోఓపికేదీ ?

పైన విధి రాబందు రూపంలో ఎగురుతోంది,
విరహపు ఎడారిలో నా ఓటమికోసమెదురు చూస్తోందేమో!

ఇంతలో వచ్చింది ఒక బంగారు గ్రద్ద
వస్తూ తనతో ఒక లేఖను జారవిడిచింది,
చిత్రం అది నీవు పంపిన లేఖే
సత్తువనంతా కూడదీసుకుని చూసా,
నీ చూపులలోని ప్రేమ మరోమారు వెంటాడింది
కనుచూపుమేరలో ఒయాసిస్సును చూపింది

నా ప్రయాణం మళ్ళీ మొదలుపెట్టా
ఆ బంగరు గ్రద్ద తోడుగా,
నెమ్మదిగా ఎడారిని దాటా,
చిత్రం నా ప్రణయపు కోట కనిపించలేదు

కానీ సంకల్పపు నది కనిపించింది
ఆ నదీతీరాన నాతో తెచ్చిన ప్రణయపు విత్తులు నాటా
అక్కడ పెరిగిన తోటలో విరహంతో విహారం చెయ్యసాగా
ఈ విరహపు తోటలో పూచిన మల్లెలు నీ జడను చేరాలని ఎదురు చూస్తున్నాయి

విరహం మన తనువులకే, మనసులకు కాదని తెలుసు
అందుకే నీ విరహం కూడా నాకు ప్రణయమే

ఒక సీతాకోక చిలుక తన గూడు నుంచి బయటకు రాబోతోంది
సంకల్పపు నదిలో అల్లంత దూరాన నీ చాయలు కనిపించాయి
విరహంతో విహారం నేటితో పూర్తి

(చిన్నప్పుడు కలలో వచ్చిన బంగారు గ్రద్ద స్ఫూర్తిగా, బంగారు గ్రద్దను వార్తాహారిగా వాడటం జరిగింది)

శూన్యం నుంచి శూన్యంలోకి

మన మధ్య బంధం శూన్యం, మన మధ్య పరిచయం లేని రోజులలో
మన మధ్య దూరం శూన్యం, మనం కలిసి జీవించిన రోజులలో
మన మధ్య మాటలు శూన్యం, అలిగిన వేళలలో
మన మధ్య రహస్యాలు శూన్యం, ఈ జీవనప్రయాణంలో

మన పరిచయం శూన్యాన్ని చేధిస్తే
అది మరొక శూన్యాన్ని సృష్టించింది

మన కలయిక శూన్యాన్ని బద్దలుకొడితే
అలక రూపంలో మరో శూన్యం దూరింది

మన ఊసులు శూన్యపు చీకటిలో వెలుగులు నింపితే
మరో శూన్యమేదో శోకదేవతలా పరుగున వస్తూ కనిపించింది
ఆ శూన్యం నుంచి దూరమవ్వాలని మొదలయ్యింది మన పరుగు
శూన్యం నుంచి శూన్యంలోకి
ఏ దరిన చేరుస్తుందో ఈ శూన్యం

శూన్యపు బిగ్ బాంగో లేక శూన్యపు బ్లాక్ హోలో
బిగ్ బాంగ్ అయితే మన కోసం పాలపుంత ఇల్లు కడతా
బ్లాక్ హోల్ అయితే.......మరో శూన్యంలోకి తీసుకువెళ్తా...
అక్కడి నుంచి మన ప్రయాణం మళ్ళీ మొదలుపెడదాం...
నా తోడుంటావా ప్రియతమా.....

(ఆ మరో శూన్యం ఏదైనా కావచ్చు,  
వ్యక్తి తీసుకునే రిస్కీ డెసిషన్ కావచ్చు
లేదా శ్లోకాన్ని సృష్టించిన శోకం కావచ్చు
లేదా..... )

శిలాజం ఆత్మకధ

గెలుపు నాదే... నేనే విజేతను
వెంటనే అద్దంలో నా ముఖం చూసా
నన్ను చూసి నేనే మురిసిపోయా...
గర్వాతిశయంలో మునిగిపోయా

ఒక కొండను ఎక్కిన అనుభూతి,
అది చిన్న గుట్టేనని తెలియడానికి ఎన్నో క్షణాలు పట్టలేదు
నా ముందు మరో పర్వతం కనిపించింది
పర్వతాన్ని అధిరోహిస్తూ అనుకున్నా
ఈ పర్వతానికి సరైన బాట లేదే అని

ఆ పర్వతాన్నెక్కుతూ బాటను పరిచా
అది రాళ్ళ బాటే,
నా వెనుక వచ్చే వాళ్ళు దాన్ని పూల బాట కాకపోయినా
మట్టి బాటైనా చెయ్యరా అని నమ్మకం

ఇంతలో నేనెక్కుతున్న పర్వతం అగ్ని పర్వతమని తెలుసుకున్నా
అది ఏ క్షణాన్నైనా పేలవచ్చు
తనలో దాచిన లావాను నేను పరచిన బాటను కప్పివెయ్యవచ్చు
ఎలాగూ కాలి బూడిదవుతానని నా ఆరోహణను ఆపివేసా

అక్కడే ఒక గుడిసె కట్టుకుని నేను దాటిన గుట్టలు చూస్తూ ఆనందించా
ఒక రోజు ఆ లావా చిమ్మింది
తప్పించుకోలేక శూన్యంగా చూస్తూ శిలాజంలా మిగిలిపోయా

ఇప్పుడు చూసుకుందామంటే ఆనాటి అద్దం లేదు
అద్దంలో చూసి ఆనందించ శిలాజానికి ప్రాణం లేదు

కానీ కొన్నేళ్ళకు, ఎవరో వచ్చారు.. నేను కట్టుకున్న గుడిసెను చూసారు
నేను పరచిన బాటను కనుగొన్నారు
వీరు నాలాగ ఆగిపోలేదు,
చిమ్మే లావాను వెతుకుతూ ముందుకు సాగిపోయారు
ఆ లావా వారి సంకల్పానికి చల్లబడింది
వారి బాటకు ధృడపునాదిగా మారింది

అదేమిటో వాళ్ళు కూడా ఒక రోజు అద్దాన్ని చూసారు,
గర్వపడ్డారు, ఈసారి వారున్నది మంచుకొండ
అది కరగడానికి సిద్దంగా ఉంది...

ఒంటరితనమా.. నీ చిరునామా ఏదమ్మా...

వంద మంది మధ్యలోనున్నా, ఇదిగో నేనిక్కడంటూ పలకరిస్తావు...
ఒక్కడినే ఉన్నప్పుడు రమ్మన్నా రావు, ఊహాలోకంలో తేలిపోతున్నావుగా అని వెక్కిరిస్తావు
బాధలో మునిగి ఉంటే పరిగెట్టుకొస్తావు, నాకు సానుభూతి చెప్పేవాళ్ళను చూసి పారిపోతావు
నా బాధలు తృప్తిగా వినేది నీవేనని తెలిసినా
ఆనందంగా ఉన్నప్పుడు నా మనసుతో ఆటలాడుతుంటావు,
నాతో ఆనందం పంచుకునేవారిని చూసి బహుదూరం నుంచే వీడ్కోలు చెప్పి పోతావు

నేనోడిపోయినప్పుడు నా తప్పులు నాకు గుర్తు చేస్తావు,
కానీ ఆ తప్పులు వింటానా... ఓటమి బాధలో చెవిటివాడినయ్యాను కదా
నే గెలిచినపుడు జాగ్రత్తలు చెప్ప చూస్తావు
కానీ ఆ జాగ్రత్తలు పాటిస్తానా... గెలిచిన మదంలో వింటానా

నాకు బాధ వచ్చినా ఆనందం వచ్చినా
నేను గెలిచినా ఓడినా
నా కళ్ళు నీ కోసం వెతుకుతాయని తెలిసీ
నీతో కలిసి నా అనుభూతులు పంచుకోవాలని ఎదురు చూస్తానని తెలిసీ
నే రమ్మన్నా రావు
తీరా వచ్చాక పొమ్మన్నా పోవు

ఆ పరమేశ్వరుని సృష్టిలో ఏ ప్రాణీ ఒంటరి కాదు, ఒకరికి ఒకరు తోడంటూ
నీవెన్నడూ ఒంటరి కావని వెక్కిరిస్తూ
నాతో దోబూచులాడతావు
ఇదిగో అని పట్టుకుంటే,
అంతలో ఏ గాలినో పంపిస్తాడు ఆ ఈశ్వరుడు నిన్ను తరిమెయ్యమని
ఆ గాలి నా ప్రియురాలి కురులలోని పువ్వుల పరిమళాన్ని మోసుకొచ్చి
నన్నే నీ నుంచి దూరమయ్యేలా చేస్తుంది

ఒంటరితనమా... నీ చిరునామా ఏదమ్మా?

అతడు తూర్పు ఆమె పడమర

వారు కలిసిన రోజు అద్భుతమే,
అవును అసలు వారు విడిపోయిన రోజేది ?
వారు కలసి జీవించని రోజేది?

సాయంత్రపు వేళ
ఆమెపై ఎర్రని రంగుని చల్లాడు
అది ఆమె బుగ్గపై సిగ్గుగా ప్రకాశించింది
చుక్కల పాన్పును పరచి చల్ల గాలితో సందేశమంపింది
అతనిపై మంచుతెరలు కప్పింది

మౌనం వారి మద్య పాటలు పాడింది
వారి హృదయాల ఊసులలో రాత్రి తెల్లవారింది
అతను మౌనంగా ఎర్రబంతిని ఆమె వైపు విసిరాడు
వారి మధ్య మౌనాన్ని చేధిస్తూ అతని సందేశాన్ని మోసుకెళ్ళింది
ఆ ఎర్రబంతి వెలుగులు విరహపు సెగలతో ఆమెను చేరాయి,
ఆమె కనుల మధ్య నుదిటిపై కాంతిగా నిలిచాయి
ఆమెను చేరిన ఆ విరహపు సెగలు చల్లబడ్డాయి
చల్లని వెలుగుగా వెన్నెల కురిపించాయి

అతను తూరుపు ఆమె పడమర
వారి మధ్య మౌనం కూడా పాటలు పాడుతుంది
మౌనం కూడా రాగమే కదా
అనంత జీవన సంగీతానికి నిశ్శబ్దం కూడా అందమే
రణగొణ ధ్వనులు కూడా వారి యాత్రలో ఆనందభైరవి రాగాలే
వారి ప్రేమ భాషకు అందనిది, లెక్కలకు లొంగనిది

వారి మనసుల దూరం శూన్యం
తనువుల దూరం అనంతం
ఆ దూరాన్ని తగ్గిస్తానని వారిని కలపడానికి కాలం పరిగెడుతూనే ఉంది
ఆ కాలం పరుగులో నేనొక చిన్ని రధచక్రాన్ని
వారి అనంత ప్రేమకు నేను కూడా సాక్షినే

నిమిత్త మాత్రుడిని నేను (???)

( మరువం ఉషగారు రాసిన కవితకు నా సమాధానం )
ఏమో ఎప్పటికి సమకూరేనో ఆ శాంతియుత సహగమనం
రక్తపుటేరులలో ఈతకొడుతూ అదే విజయమనుకున్న అశోకుని మనసు 
కూడా మారింది, శాంతియుత మార్గాన పయనించింది.
నేడు అలాంటి వాళ్ళు ఎంతో మంది, వారిలో అశోకుడయ్యేవారెంతమంది
అలెక్జాండర్ లా రాలిపోయేవాళ్ళే ఎక్కువ మంది
అలనాడు ఒక్కడిదే విలయతాండవం
నేడు ప్రతి ఒక్కరిదీ విలయతాండవమే,
చేసేది చిన్న తప్పే అనే నిర్లక్ష్యం
నేడు ఇలా టైప్ చేస్తున్న ప్రతీ క్షణమూ నన్ను హెచ్చరిస్తూనే ఉంది,

నేను కూడా ఆ కాలుష్యపు చక్రానికి ఇరుసునేనని
నిమిత్త మాత్రుడిని నేను,
కానీ నేను చేసే ప్రతీ పని నా అనుమతి లేనిదే జరగదనీ తెలుసు
నిమిత్త మాత్రుడిని నేను

గాంధీలా ప్రభావితం చెయ్యలేను
వివేకానందునిలా వివేకాన్ని వెలిగించలేను
భగత్ సింగ్ లా ప్రభుత్వానికి ఎదురు తిరగలేను
చంద్రబోస్ లా సైన్యాన్ని తయారు చెయ్యలేను
నిమిత్త మాత్రుడిని నేను

మదర్ థెరెసా లా ఆడంబరలాను వదలలేను
రామకృష్ణ పరమహంసలా ఆధ్యాత్మిక దీపాలు వెలిగించలేను
బాబా ఆమ్టేలా సేవలు చెయ్యలేను
శ్రీశ్రీలా రక్తాన్ని మరిగించలేను
నిమిత్త మాత్రుడిని నేను

జీవితంలో కష్టాలు ఎదురైతే దారి మార్చుకుంటాను
అన్యాయం ఎదురైతే న్యాయానికి ముసుగేస్తాను
అధర్మపు నీడలో ధర్మాన్ని దాస్తాను
అసత్యపు తోటలో సత్యానికి సమధి కడతాను
నా సుఖం నాకు ముఖ్యం, ప్రకృతి కష్టంతో పని లేదు
నిమిత్త మాత్రుడిని నేను

స్వర్గానికి వెళ్ళాలనుకునే ప్రతీ ఒక్కరిలో నేనూ ఒకడినే
స్వర్గానికి తీసుకెళ్ళే చావు ఎదురైతే తప్పించుకుపోయే పిరికివాడిని
మార్పు కావాలి, ప్రపంచం మారాలని ఉపన్యాసాలిస్తాను
ఆ మార్పు నాతో మాత్రం మొదలుకానివ్వను
నిమిత్త మాత్రుడిని నేను

గనులను తవ్వి భూకంపాలకు కారణమంటూ నిందించే నేను
ఆ గనులనుండి వచ్చిన లోహపు ఆభరణాలు లేనిదే బయటకు రాను
ఆ గనుల ఖనిజాలతో కట్టిన ఆకాశహర్మ్యాలలో నుండి కాలు బయటకు మోపను
నిమిత్త మాత్రుడిని నేను

ఆ మార్పుని నాతో మొదలుపెట్టగలిగే నాడు
నాలో ధైర్యానికి సంకల్పమనే ఖడ్గాన్ని ఇవ్వగలగిన నాడు
సత్యాన్ని వెలికి తీసి సత్యపు మంటలో నన్ను కాల్చుకున్న వేళ
నేను ఆ జగన్నాధ రధ చక్రపు ఇరుసునవుతా
నిమిత్త మాత్రుడిని కాను నేను

సర్వశక్తి సంపన్నుడను,
ఆ సర్వశక్తులనూ దేహసుఖాల బాటనుండి పక్కకు మల్లిస్తా
ఆ పక్కనే దుమ్ము పట్టిన ఆత్మానందపు బాటపై పయనిస్తా
నన్ను నేను ఆవిష్కరించుకుంటూ
నాతో ఒక సైన్యాన్ని తయారుచేస్తా
నిమిత్త మాత్రుడిని కాను నేను