ఒంటరితనమా.. నీ చిరునామా ఏదమ్మా...

వంద మంది మధ్యలోనున్నా, ఇదిగో నేనిక్కడంటూ పలకరిస్తావు...
ఒక్కడినే ఉన్నప్పుడు రమ్మన్నా రావు, ఊహాలోకంలో తేలిపోతున్నావుగా అని వెక్కిరిస్తావు
బాధలో మునిగి ఉంటే పరిగెట్టుకొస్తావు, నాకు సానుభూతి చెప్పేవాళ్ళను చూసి పారిపోతావు
నా బాధలు తృప్తిగా వినేది నీవేనని తెలిసినా
ఆనందంగా ఉన్నప్పుడు నా మనసుతో ఆటలాడుతుంటావు,
నాతో ఆనందం పంచుకునేవారిని చూసి బహుదూరం నుంచే వీడ్కోలు చెప్పి పోతావు

నేనోడిపోయినప్పుడు నా తప్పులు నాకు గుర్తు చేస్తావు,
కానీ ఆ తప్పులు వింటానా... ఓటమి బాధలో చెవిటివాడినయ్యాను కదా
నే గెలిచినపుడు జాగ్రత్తలు చెప్ప చూస్తావు
కానీ ఆ జాగ్రత్తలు పాటిస్తానా... గెలిచిన మదంలో వింటానా

నాకు బాధ వచ్చినా ఆనందం వచ్చినా
నేను గెలిచినా ఓడినా
నా కళ్ళు నీ కోసం వెతుకుతాయని తెలిసీ
నీతో కలిసి నా అనుభూతులు పంచుకోవాలని ఎదురు చూస్తానని తెలిసీ
నే రమ్మన్నా రావు
తీరా వచ్చాక పొమ్మన్నా పోవు

ఆ పరమేశ్వరుని సృష్టిలో ఏ ప్రాణీ ఒంటరి కాదు, ఒకరికి ఒకరు తోడంటూ
నీవెన్నడూ ఒంటరి కావని వెక్కిరిస్తూ
నాతో దోబూచులాడతావు
ఇదిగో అని పట్టుకుంటే,
అంతలో ఏ గాలినో పంపిస్తాడు ఆ ఈశ్వరుడు నిన్ను తరిమెయ్యమని
ఆ గాలి నా ప్రియురాలి కురులలోని పువ్వుల పరిమళాన్ని మోసుకొచ్చి
నన్నే నీ నుంచి దూరమయ్యేలా చేస్తుంది

ఒంటరితనమా... నీ చిరునామా ఏదమ్మా?

6 comments:

హరే కృష్ణ said...

bavundi..good one

మరువం ఉష said...

అవును మననీ మన ప్రియ నేస్తం ఆ ఒంటరితనాన్ని దోచే దొంగలే అన్నీను. కనీసం మనం బికారిగా మిగిలినపుడు ఈ దొంగలకి జడిసి మనసు మూల నక్కిన తాను మెల్లగా బయటకివస్తుందేమో. నలుగురిలో ఒంటరులం, ఒంటరితనంలో అనాధలం, అవునో కాదో?

Unknown said...

@హరేకృష్ణ గారు,
ధన్యవాదాలు
@ఉషగారు,
మీరు చెప్పిన చివరి వాక్యంలో మొదటి సగాన్ని అనుభవించాను చాలా సార్లు. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు

పరిమళం said...

ఆమె చిరునామా ...ప్చ్ ...నాకూ దొరకలేదండీ .. :)
మంచి ఊహ కవితగా మలిచారు బావుందండీ ..

విశ్వక్శేనుడు said...

ఇంతకీ మీరు వెతుకుతుంది ఒంటరితనాన్ని భౌతికంగా నా లేకపొతే మానసికంగా నా. భౌతికంగా ఐతే పర్లేదు గానీ మానసికంగా ఐతే జాగ్రత బాసూ

Unknown said...

@పరిమళం గారు,
ఆమె చిరునామా ఆ సులువుగా దొరకదులెండి. అది దొరికినప్పుడు దాన్నుంచి పారిపోవడానికే ప్రయత్నిస్తాము.
@విజయ మాధవ గారు,
నేను ఒంటరితనాన్ని వెతకడం లేదు లెండి. ఏదో ఒక యాధృచ్చిక ఆలోచన అంతే. అయినా కవి రాసిన ప్రతీ ఒక్కటీ అతని జీవితంలో ఉండాలని లేదు. ఏదో ఒక ఊహను పట్టుకుని, అది అనుభవిస్తే ఎలా ఉంటుందో ఊహల్లో ఆస్వాదించి రాసెయ్యడమే. మీ స్నేహపూర్వక సలహాకు ధన్యవాదాలు.