క్షణానికో రాత, ప్రతీ రాతకు ఓ గీత, ఆ గీతకు చాటున ఓ రేఖ

నుదుటి మీది రాతలు
అరచేతిలో దాగిన రేఖలు
అరికాలి కింద గీతలు

రాతల బందిఖానాలో దాగిన మస్తిష్కపు శక్తి
రేఖల సంకెళ్ళకు బందీయై బిగియని పిడికిలి
గీతల వలలో చిక్కుకుని పరుగిడని అరికాలు

క్షణంలో మారిపోయే గీతల రాతల రేఖలతో
చిక్కుముడులు వేసి పొడుపు కధ విసిరావు
నీ పొడుపుకధను ఒడుపుగా విప్పలేనా
ఒక ముడి విప్పితే మరో ముడి బిగిసే పొడుపు కధ నీది
భలే కధకుడివి నీవు

అనంతమైన ముడులు వేసి బంధించేసావు
అనంతసాగర సమాన ఆలోచనలు మెదడున పెట్టి
నుదిటిరాతల ఆనకట్ట మాటున బందీ చేసావు
ఆ సాగర సమాన ఆలోచనలు ఎగసిపడి
నీ పొడుపును విప్పుతాయనా
నుదిటిరాతల బందీఖానాలో మెదడును ఖైదు చేసి
క్రోధావేశాలను కాపు పెట్టావు

పిడికిలి బిగించి ముడులు తెంపుకుపోతాననా
హస్తరేఖల సంకెళ్లను వేసి
పిడికిలి బిగియనీయని మోహానికి తాళమిచ్చావు

అరికాలిలో శక్తిని నింపి పరుగెత్తి ముడులను చీల్చుకు పోతూ
నీ పొడుపు అంతు చూస్తాననా
గీతలతో వలను వేసి
ఆ వలపై కోర్కెలు చల్లి బందీను చేసావు

ఒకనాడు క్రోధావేశాలను అదుపున పెట్టి
మెదడును బందిఖానా నుండి విడిపించి
అడుగేసానో లేదో మోహవీచికలో జారిపడి
మరలా బందీనైతిని

మరోనాడు మోహాన్ని వశం చేసుకుని
సంకెళ్ళ తాళాన్ని తెంపుకుని పిడికిలి బిగించేంతలో
క్రోధావేశాల ధాటికి మళ్ళీ సంకెళ్ళలో బందీనైతిని

ఇక కోర్కెల బారిన పడక ముందుకు పోతుంటే
ఎటు నుంచో మోహినినంపి మరోమారు వలలో
బందీని చేసితివి

ఏమిటయ్యా ఆ పొడుపుకధ వెనుక దాగిన కధ,
నువ్వైనా గుట్టు విప్పి చెప్పవయ్యా

***************
రాతలు బందిఖానా కాదేమో ?
అవి మెదడున దాగిన ఆలోచనలకు ద్వారాలేమో
ద్వారాలు దాటుకు ముందుకు పోతే ఆలోచనల సాగరము
రేఖలు సంకెళ్ళు కావేమో,
అవి పిడికిలిమాటున దాగిన ఆయుధాలేమో
గీతలు వల కాదేమో,
కోర్కెలను బంధించి పరుగులో తోడుండే సైన్యమేమో

8 comments:

చిలమకూరు విజయమోహన్ said...

చాలా బాగుంది.

amma odi said...

చక్కగా చెప్పావు! నెనర్లు!

Unknown said...

విజయమోహన్ గారు,
ధన్యవాదాలండి

Unknown said...

ఆదిలక్ష్మిగారు,
ఎన్నాళ్ళకో మరలా మీ వ్యాఖ్య, నెనర్లు

మరువం ఉష said...

రాతల, గీతల, రేఖల నడుమ అనుసంధానం - ఎందరు యోగులు, ఎందరు జ్ఞానులు, ఎందరు అన్వేషకులు చేసిన యజ్ఞమో? వారివలె మీరూను. మీవలె నా వంటివారూను. చిత్రం నేను లెక్కల్లో వెదికాను, మీరు భావనలుగా విడదీసారు. మన టపాలు ఒకే రోజు వెలివడటం చిత్రమైన గారడీ. ఎవరు చేసారిది?

Unknown said...

ఉష గారు,
ఆలస్యానికి క్షమించాలి. ఎవరు చేసారో తెలియనిదా మీకు. అంతా దైవలీల. లెక్కలైతేనేమి, భావనలైతేనేమి గమ్యమొకటే

గీతాచార్య said...

Very nice

Unknown said...

thank you geethaachaarya