సమాధానము తెలియని ప్రశ్నలు

నిశీధి నిశ్శబ్దంలో నే పెట్టిన పెనుకేక నిను చేరే ఉంటుంది
వినబడినా బధిరునిగా ఏల నటించితివి
తామసి నలుపును కడుగుతూ పెల్లుబికింది నా రుధిరం
కళ్ళుండి కనబడని అంధునివైనావేల
సాయం కోసం నే పాడిన ఆక్రోశగీతం నీ చెవుల తాకే ఉంటుంది
మాటరాని మూగవాడివైనావా నా పాటకు బదులీయవేమి

సూరీడు వెలికి వచ్చాడు కదా, ఈ పాటికి నా సందేశం నిను చేరే ఉంటుంది
నా సందేశం నిను చేరలేదా ? పావురాన్నైనా పంపవేమి
మిట్టమధ్యాహ్నపు సూరీడు ధాటికి దాహార్తుడనై కదలలేని రాయిలా
నా తనువు చేసిన మూగరోదనైనా కానరాలేదా
సూరీడి అస్తమయం చూస్తూ నిస్సహాయుడనైతిని,
నీ సహాయమెపుడు చేరునో
వెలికి వచ్చిన చంద్రుని చూసి, పక్కనున్న చుక్కలు చూసి
ఆ చుక్కలలో నీ చూపు పంపావని ఎదురు చూసా,
ఎచట నిలిచాయి నీ చూపులు
మస్తిష్కపు ఆలోచనలు ఆగిపోతున్నాయి,
మనసు ఆత్మను వెతుకుతూ పోయింది
చుక్కల పందిరి కింద శరీరం ఒంటరయ్యింది
బహుశా ఇది మరణమేమో,
నా తనువైనా తడిమి వీడ్కోలు ఇస్తావా???

ఎచట దాగితివి?
ఆత్మాకారుడనై నిను అడిగెదననుకొన్న ప్రశ్నలు గురుతు రావేమి?
ఏ మాయ చేసితివి?
నిరాకారుడనైతినేమి?

(ఈ ప్రశ్నలలో అనేక కధలున్నాయు, అనేక కన్నీటి వ్యధలున్నాయి,
ఉప్పెన ముంచెత్తి, భూమి ప్రకోపించి, అగ్ని జ్వలించి, పిడుగులు పడి, సుడిగుండమంటి వాయువులు వీచి
పోరాడి ఓడిన బతుకులున్నాయి. మీ హృదయము రాల్చే కన్నీటిబొట్టును పెద్దరికపు హోదాలోనో, కన్నుల పరదాలోనో దాచెయ్యద్దు)

4 comments:

Hima bindu said...

మనస్సును తాకింది .

Padmarpita said...

Heart Touching...

మరువం ఉష said...

"యతో వాచో నివర్తంతి అప్రాప్య మనసా సహ" వాక్కుకు మనసుకు అందని త్రికాలబాధితుడు దైవం. భగవంతుడు కంటికి కనపడడు, చెవికి విన్పడడు, మనసుకి అందనే అందడు. అందుకే ఆయన్ని హృదయంలో కొలువుంచుకోవాలి. నివేదనలు, సమర్పణలు ఆత్మ తోనే గరపాలి.

*****
సౌధమొకటి కట్టి స్వామినకడ వుంచానన్నారెవరో
వీలుచూసుకొనొకసారి రమ్మని కబురంపారు
వైనమేమిటని ఆత్మతో జాబువ్రాసాను
నీలోవున్నానని మరిచావా అని మొట్టికాయ వెయ్యనేవేసారు
జగమంతా నిండిన స్వామి ఒక చోట ఒక రూపున వుండటమేమిటి?
యుగమంతా ముగిసినా వుండడా తానక్కడే నిరాకార నిర్మలుడు?

'A feeling occur everytime I try to visualize god ...'

Unknown said...

చిన్ని గారు, పద్మార్పిత గారు,
ధన్యవాదాలు
ఉష గారు,
బాగా చెప్పారు. కొసమెరుపులా రాసిన కవిత కూడా మెరిసి మనసును తాకింది.