తెల్ల కాగితంపై నల్ల చుక్కలా లేక నల్ల కాగితంపై తెల్ల రంగు జాడలా ?

ఓంకారం‌ దిద్దే వేసాను తొలి అడుగు
తెలియలేదు క్షరక్షణ భుంగుర జీవితం‌ గమనమని
తెలియనేలేదు చిత్రంగా తెల్లకాగితంపై గుప్తంగా "ఓనమ:" అంటూ లెక్కలు మొదలయ్యాయని
వచ్చి పడ్డాను నాకు తెలియకుండానే జీవితబడిలోకి, బెత్తంతో‌ నుంచుని చూస్తున్నాడా సమవర్తి

రోజుకో కధ చెప్పి , క్షణానికో‌ లెక్క ఇచ్చి
తప్పు చెయ్యనిచ్చి, వెంటనే‌ గిల్లి తొడపాశం పెట్టి లాక్కుపోతున్నాడు

ఆ బడిలో నా గాధలో‌ రాసే ప్రతీ అక్షరమూ ,
క్షరమని శాసించే విధిని వెక్కిరిస్తూ ముందుకు శరమై ముందుకు సాగింది
ఆ గాధలో, అగాధాల లోతులు చూపి, అనంతపు ఎత్తులు చూపి
కొన్ని క్షణాలు అనంతానుభూతులు నవరసాలలోనూ చూపుతూ
కదలనంటూ మొరాయించాయి
బెత్తం‌ విదిలించాడు, క్షణాలలో‌ కదలిక వచ్చింది వరదకు తెరిపిచ్చినట్టు
కానీ జ్ఞాపకాలు అనంతంలా వెంటాడతామంటూ బెత్తంపై కూర్చుని వచ్చాయి

అసలీ బడిలోకి ఎలా వచ్చానో, గంటే లేని బడి ఇది
ఉన్నా తెలిసేనా ఈ దేహాత్మకు

రోజూ ఉదయాన్నే‌గతం నీడలు నిండిన ఆ బెత్తం‌నిద్రలేపితే
భయంగోడల మాటున దాగిన భవిత కవ్విస్తుంది
ఆ గోడలవైపు అడుగేస్తే కూలిపోతాయి, ఆగితే‌ మాత్రం‌ పాషాణాలై గోచరిస్తాయి

ఆ నీడలూ, కవ్వింపులూ, ఈ రాతలూ, కూసే‌ కూతలూ అన్నీ
ఏనాడో‌‌ తీసిన ఆ తెల్లకాగితంపై నాతో‌ రాయిస్తూనే ఉంటాడు

ఒకనాడు బడి ముగిసినట్టుంది, సమవర్తి చేతిలోని బెత్తం‌‌ మెత్తబడింది
పాశమై ముందుకు వచ్చింది
ఇక కవ్వించే‌ భవితా లేదు, వెంటాడే‌ గతమూ లేదు

తెల్లకాగితం‌‌ నల్లగా మారిపోయింది, దానిపై నా ప్రతిబింబం‌‌ అగుపిస్తోంది
తెల్ల గోడపై నల్ల చుక్కలా‌? లేక నల్లగోడపై తెల్లని సున్నమో?

ఇంతలో‌ ఆ పాశం మళ్ళీ గట్టిబడింది, బడి మళ్ళీ పిలుస్తోందేమో?
నా ప్రతిబింబపు కాగితాన్ని చెరిపి తెల్లకాగితాన్ని ఇచ్చాడు
ఈ తెల్లకాగితంపై ఏమి రాస్తానో,
ఓంకారం‌ దిద్దుతున్నదెక్కడో‌?

హృదయగాధలు

నదికెన్ని పాయలో‌
హృదయానికెన్ని గాధలో‌
ప్రతి వేణి గమ్యమూ ఒకటే‌, ప్రతి గాధకూ ముగింపొకటేనా?

నది చేరని తీరం
మదిలో‌ తీరని కాంక్ష
ఆ తీరానికి నదిని తరిమేది ప్రళయం, మరి ఈ కాంక్షను తీర్చేదేది ?

ప్రతీ మలుపులో‌ దాగిందో‌ సుడి
ప్రతీ అడుగులో‌ దాగిందో‌ మలుపు
తీరానికి కానరాని అంత్:మధనాలు, హృదయాంతరమున దాగినదేమిటో‌

ఏనాటి ఆనందభాష్పాలు,
ఎచ్చటి వేదనరోదనభాష్పాలు
నది నిండా నీరే‌, ఆనందం దాగిందో వేదన నిండిందో‌ హృదయములో‌, ఎవ్వరు చెప్పగలరు

ఉప్పెనలెన్నైనా మారని సంద్రం‌
కాలగమనమేదైనా చలించని విధి
నది గమ్యం‌ దొరికింది, మరి హృదయ గాధల ముగింపు?

ఏమి భావమో ఇది

ఆనందభాష్పాలు కావు
వేదనరోదనలా !కాదు
ఆనందానికి వేదనకూ నడుమ ఏమిటిది? శూన్యమా??‌

ఎగిసే అల కాదు
కరిగే కల కాదు
అలా ఎగిసి అంతలోనే కరిగి , తెలియని భావమిది!

ప్రపంచపు ఉనికి తెలియలేదు
వేసే అడుగు తడబడలేదు
ఆకసంలో‌ తేలుతూ నేలపై నడుస్తూ , ఏమి స్థితి ఇది?

విజయము కాదు
అపజయమూ కాదు
గెలుపుకూ ఓటమికీ నడుమ, కోరికలేని క్షణమా ఇది

అనిర్వచనీయమీ అనుభూతి
క్షణకాలమైనా అనంతంలా నిలిచే ఆకృతి ఇది
శూన్యంలా గోచరిస్తూ అనంతంలా హృదయంలో నిలిచిన భావమిది

వీరుడెవ్వడు మరుభూమిలో‌. ధీరుడెవ్వడు అమ్మఒడిలో‌

వీరుడెవ్వడు మరుభూమిలో‌. ధీరుడెవ్వడు అమ్మఒడిలో‌
రక్తాక్షర కవితలా వీరత్వ గాధలు
మృత్యు గాన హేలా ధీరత్వ విజయగీతికలు
రక్తం చిందని వీరత్వం , ప్రశ్నార్ధకమన్నది నేనెరిగిన చరిత్ర
మృత్యువుతో‌ ముద్దులాడని ధీరత్వపు ధ్యేయమేమని ప్రశ్నించింది చరిత

గర్వము కానరాని ఆత్మదర్శనము, అహం‌ ఎరుగని కుతూహలపు చూపు
తామస బంధనమే గదా దాగిన గర్వం‌
అహం బ్రహ్మస్మి , అన్యం‌ శూన్యోస్మి!
గర్వమెరుగని మనసు, కధాబంధనమన్నది నేటి చరిత
అహం‌ బ్రహ్మస్మి , " అన్యం‌ పరబ్రహ్మోస్మి ", మరో‌ కధలో‌ పాత్రేనా ఇది

చిత్తమునెరుగునా చివరి కౌగిలింత, చిత్తము తెలుయునా తొలి కేరింత
చిత్తబంధన జీవితం‌ ,
చిత్తశోధనం‌ ఈ పయనం‌
చిత్తమే‌ బందీయా, ఎవరా కావ్యపురుషుడు
చిత్తము శూన్యమా, ఎచట ఆ యోగీశ్వరుడు

తొలి అడుగు వేసిన క్షణమే మొదలు ఆ చివరి మజిలీకి పయనం‌
నడుమ చేసే మజిలీల లెక్కలెన్నైనా లెక్క లేదు ఆ చివరి స్నేహానికి
ఆత్మ మజిలీలెన్నైతేనేమి,ఈ తొలి అడుగులో‌ పసితనపు ఛాయలే కదా

తారాజువ్వ - తోకచుక్క

కోటి ఆశలు నిప్పురవ్వలై,
ఆశయసాధన ఇంధనమై పైకెగిరింది తారాజువ్వ
ఒక్కో‌ఆశను తీరుస్తూ,
ఒక్కో‌అడ్దంకిని అధిగమిస్తూ పైపైకి ఎగిసింది
కనుచూపుకు అందని ఎత్తులకు ఎగురుతూ,
కనిపించని లోకానికి పయనమయ్యింది

ఎక్కడెక్కడా అని వెతికిన కళ్ళు అలసిపోయాయి

ఆశలు కోర్కెలయ్యాయి,
ఆ కోర్కెలు రెక్కలు తెచ్చుకుని
తారను వెతకగాఎగిరాయి నలుదిక్కులా
ఆకసంలో‌ ఉల్కలుగా మిగిలాయి

లక్ష్యసాధన తారను చేరిందేమో‌,
చిన్ని జువ్వ, ఆ చుక్కకు తోకయ్యింది నేడు
తీరని కోర్కెలు తీర్చగ పయనం‌ సాగించింది
ఒక్కో‌ఉల్కను ముద్ద్దాడుతూ, దాగిన కోర్కెను తీరుస్తూ
దూసుకువచ్చింది ఆ తోకచుక్క
===
ఎన్ని తారాజువ్వలు ఎగిసాయో‌ ఈ రాత్రి
ఎన్ని తోకచుక్కలు కోర్కెలు తీరుస్తూ వస్తాయో‌ రేపటి రాత్రిన

విహంగం నేనైతే

విహంగమై దూసుకుపోవాలి,
మబ్బుల మాటున దాగిన ఆకసంపై కాలు మోపాలి
ఆచార్యదేవోభవ
! సూరీడికి నమస్సులు
సూరీడు తెలిపే
అంతరిక్ష గమనపు వింతలు
పాలపుంతల దారులు, తోకచుక్కల దోవలు
చుక్కలలో‌దాగిన చిక్కుముడులు
, చిత్రాలు తెలుసుకొని ముందుకు సాగాలి

పాలపుంతల లెక్కలు , తోకచుక్కల గాలిపటాలు
లెక్కల లోతెందుకులే
, పాలపుంతలో‌విహరించి
తోకచుక్కల గాలిపటాలపై సందేశమంపాలి

ఎంతమంది చక్కని చుక్కలు విహరించారో ఈ ఆకసాన,
చుక్కలలో‌దాగిన చిత్రాలు బోలెడు
ఆ చిత్రాలలో నా చెలి గీసిన చిత్రం వెతకాలి
ఆ చిత్రం‌అందుకుని తోకచుక్కపై పయనించి
మబ్బులపై వాలి
,
తడి చినుకుల ముద్దులు పంపాలి

ఆ చినుకులలో‌తడిసిన నా చెలి ముందు నిలవాలి
విహంగాలై ఇద్దరమూ జీవన అంతరిక్షయానత్ర సాగించాలి

స్వప్న విహారం

కళ్ళ ముందు నీవున్నావన్న ఊహలో కళ్ళు మూసి నిదురోయిన వేళలో కళ్ళ వెనుక స్వప్నమై..
to be continued !!!

ఈ క్షణం అనంతం

మరణపు కౌగిలి నుంచి వెలికి వచ్చినట్టు
మండే గుండెల మంట ఆరినట్టు
అలసిన మేనికి నీరందినట్టు
ఏమని చెప్పను ఈ క్షణాన్ని

నడి సంద్రంలో తీరం కనిపించినట్టు
రాలిపోతున్న మేనికి రెక్కలొచ్చినట్టు
చీకటికోటలో వెలుగు దివ్వె దొరికినట్టు
ఎలా చూపను ఈ ఆనందాన్ని

విజయతీరాన్ని చేర్చే చివరిఅడుగులో దాగిన ఉత్సాహం
విజయపు శిఖరంపై నిలిచిన క్షణమాత్రపు గర్వం

ఆ క్షణం అంతమెరుగని అనంతం
ఆ ఆనందం ఎంత చూచినా తరగని సాగరం
ఆ ఉత్సాహం మరో మజిలీకి శ్రీకారం




నాతో పోరాటం

పోరాటం నాతోనే
విజయం నాకే, అపజయమూ నాదే
నాతో నాకే శతృత్వం
నాపై నాకే లాలిత్యం

ప్రణయపు అరణ్యంలో
వేచి చూస్తున్న కన్యను చేపట్టమని పరుగులు తీసే మనసు

అది ప్రణయపు అరణ్యము కాదు,
ప్రళయాలను దాచిన ఎడారి అని అడుగాపే తెలివి

ఎడారి కాదది ఇరు ఎదలకు పరచిన దారని
పరుగిడమని ముందుకు పోయే మనసు

ఈ రెంటి పోరాటంలో గెలిచిన వారికి తోడుగా విధి
విధిని గెలిచే ప్రయత్నం కాదిది, వలచే ప్రయత్నమిది

విజయతిలకమైనా, వీరస్వర్గమైనా చేపట్టేది నేనే

మనసూ, తెలివి కలిసిన చోట పోరాటం జరగదు, జరిగేది పయనం
మనసూ, తెలివి పోరాడిన నాడు వచ్చేది ప్రళయం,
ప్రళయం నుంచి దూరంగా పయనం జరపాలి,
పయనిస్తూ విధిని తోడుగా తీసుకుపోవాలి

కలలు – నీటి మీది రాతలు

కలలా వస్తావు, కలలా పోతావు
కలంరాతలా కలకాలముండరాదా
నీ ఊహలో వెచ్చబడి నిదురపోదు మేని
నిదురరానిదే కలలో కానరాదు నీ రూపు

కలలన్నీ కల్లలని కలలు కనని వారే అంటారట
కలలు వచ్చేది నిదురలోనా ?
కలలను స్వాగతించ వచ్చేది నిదురా ?

కలలన్నీ నీటి మీద రాతలట నిజమేనా ?
అవి మనసున్నవారే చదవగలరని చెబితే ఏమంటారో
రాతలు రాసిన చేతులేవని అడుగుతారా
నీటిలో వచ్చే తరంగాలను తోడు చూపనూ
మనస్సనే నీటిలో ఊహలనే చేతులు రాసే గీతలే కదా కలలు
ఆ మనో కడలి లోతు చూసినదెవరులే
ప్రతి ఉషస్సున తోడున్న నీతోడి కలలేగా

కలలన్నీ నీటి మీది రాతలే
కొన్ని రాతలు రాస్తూనే చెరుగుతాయి, ఎవరో చేయాడించినట్టు
కొన్ని రాతలు సుడిగుండాలను సృష్టిస్తాయి, ఎవరో చెయ్యిపెట్టి తిప్పినట్టు
కొన్ని రాతలు నీటిలోతును చేరి కలకాలముంటాయి, నదీ గమనాన్ని నిర్ధేశించే మలపులులా