చల్లగా గాలి వీస్తోంది , 
ఒక దూదిపింజ గాలికి నాట్యమాడుతూ నా చేతిని తడిమి ముందుకు దూసుకుపోయింది 
నా మనసు కూడా ఆ దూదిపింజలానే ఎగురుతోంది 
నీ ముంగురులతో పాటే అది కూడా నాట్యమాడుతోంది 
ఆ సాయంత్రం ఆ దూదిపింజ గాలిలో ఎగిరే గరుడ పక్షిని చూసి సైతం నవ్వింది 
ఒక మహరాజులా గాలి పల్లకీలో ఊరేగింది 
ప్రపంచాన్ని చుట్టేసి వచ్చింది 
నీ ముంగురుల మబ్బులలో నా మనసు తేలియాడుతోంది 
విధి అనే నేలవైపే చూడలేదు 
హద్దులే లేక పైపైకి ఎగసింది నా మనసు 
ఇంతలో ఆ గాలితో పాటు నల్లని మబ్బులు కూడా వచ్చాయి 
మన ప్రణయంతో పాటు మన మధ్య స్పర్ధలు కూడా వచ్చాయి 
కురిసే ప్రతీ చినుకునీ తనలో దాచుకోలేక ఆ దూదిపింజ బరువెక్కింది 
సరాసరి నేలపై కూలబడింది, మళ్ళీ ఏనాటికి ఎగిరేనో ఆ దూదిపింజ 
మన మధ్య మొదలైన స్పర్ధలు చినికి చినికి గాలివాన అవుతాయా ??? 
గాలిలో స్వేచ్చగా తేలిన దూదిపింజను చూసి ముచ్చటపడిన నేను 
ఆ దూది పింజలా నేలపై కూలబడలేను 
నీ అశ్రువుల వానను కురవనీయకు 
నా మనసు ఆ దూదిపింజ లాంటిదే, 
నీ ముంగురుల నాట్యంలో ఆకసమే హద్దుగా పరవశించిన నేనే 
నీ అశ్రువుల వాన కురిస్తే బరువెక్కి కూలబడతాను 
ప్రియా, ఆ స్పర్ధల తెల్ల మబ్బులా తేలిపోనీ 
నీ నవ్వులలో ఆ గగనమే హద్దుగా నన్ను సాగిపోనీ 
దూదిపింజను నేను... 
5 comments:
బరువైన ప్రణయ కలహం తేలికైన ఉపమానంతో కలపటం మీ కవితలోని చతురత. నిజానికి ఆ స్పర్థలూ దూదిపింజల వంటివే. ప్రేమ వరదలో కొట్టుకుపోతాయి, రూపు మాసిపోతాయి. అంతా మనం అనుకోవటంలో వుంది - ఏది దూది పింజె ఏది గాలి, ఏది వాన అన్నది! ప్రేమ సంజీవని, ప్రణయం దాని నీడ. నిజానికి మీ ముంగురుల ప్రస్తావనతో నా మనసుకి ముడిపడిన స్పందనలెన్నో నెమరేసుకునే వీలు కల్పించారు.
ఉష గారు,
మీ వ్యాఖ్యతో కొండంత బలం వచ్చినట్టుంది.
చిన్న ప్రశ్న "అమెరికన్ బ్యూటీ" అనే సినిమా చూసారా? (ఆ సినిమాలో గాలికి ఎగిరే పాలిథీన్ కవర్ మీద కొన్ని సీన్లు ఉంటాయి.)
అయితే ఈ కవితకూ ఆ సినిమాకూ పెద్ద సంబంధమేదీ లేకపోయినా పోలిక మాత్రం చాలానే ఉంది.
ప్రదీప్, మీ ప్రతి-స్పందనకి సంతసం. ఆ సినిమా చూడలేదు. కథ కూడా మీరే ఎప్పుడో ఒకప్పుడు చెప్పేద్దుర్లేండి.
సరే నేను రాయబోయే తరువాతి పోష్టు అదే.
ప్రియా, ఆ స్పర్ధల తెల్ల మబ్బులా తేలిపోనీ
నీ నవ్వులలో ఆ గగనమే హద్దుగా నన్ను సాగిపోనీ
దూదిపింజను నేను...
సూపర్ గా చెప్పారండి
Post a Comment