శూన్యం నుంచి శూన్యంలోకి

మన మధ్య బంధం శూన్యం, మన మధ్య పరిచయం లేని రోజులలో
మన మధ్య దూరం శూన్యం, మనం కలిసి జీవించిన రోజులలో
మన మధ్య మాటలు శూన్యం, అలిగిన వేళలలో
మన మధ్య రహస్యాలు శూన్యం, ఈ జీవనప్రయాణంలో

మన పరిచయం శూన్యాన్ని చేధిస్తే
అది మరొక శూన్యాన్ని సృష్టించింది

మన కలయిక శూన్యాన్ని బద్దలుకొడితే
అలక రూపంలో మరో శూన్యం దూరింది

మన ఊసులు శూన్యపు చీకటిలో వెలుగులు నింపితే
మరో శూన్యమేదో శోకదేవతలా పరుగున వస్తూ కనిపించింది
ఆ శూన్యం నుంచి దూరమవ్వాలని మొదలయ్యింది మన పరుగు
శూన్యం నుంచి శూన్యంలోకి
ఏ దరిన చేరుస్తుందో ఈ శూన్యం

శూన్యపు బిగ్ బాంగో లేక శూన్యపు బ్లాక్ హోలో
బిగ్ బాంగ్ అయితే మన కోసం పాలపుంత ఇల్లు కడతా
బ్లాక్ హోల్ అయితే.......మరో శూన్యంలోకి తీసుకువెళ్తా...
అక్కడి నుంచి మన ప్రయాణం మళ్ళీ మొదలుపెడదాం...
నా తోడుంటావా ప్రియతమా.....

(ఆ మరో శూన్యం ఏదైనా కావచ్చు,  
వ్యక్తి తీసుకునే రిస్కీ డెసిషన్ కావచ్చు
లేదా శ్లోకాన్ని సృష్టించిన శోకం కావచ్చు
లేదా..... )

7 comments:

మరువం ఉష said...

ఇక శూన్యాన్ని తలవాలన్నా వెరపు వచ్చేంత భయపెట్టేసారు. నేనిక తలవనన్నా తలవను మా మధ్య అది చోటు చేసుకోగల అవకాశాన్ని. శీర్షిక చూడగానే "ఖయామత్ సే ఖయామత్ తక్" గుర్తుకి వచ్చిందనుకోండి. అయినా శూన్యం వంక ద్రుక్కులు సారించారెందుకటా?

భాస్కర రామిరెడ్డి said...

శూన్యం నుంచి సృష్టి తిరిగి అదే శూన్యంలోకి. బాగుంది.

Unknown said...

@ఉష గారు,
అంత ఎక్కడ భయపెట్టానండీ...నిజానికి ఈ కవిత నేను కొంచెం అన్యమనస్కంగా రాసాను. బహుశా నేను సరిగ్గా రాయకపోవడం వల్ల భయపడి ఉంటారు
ఈ శూన్యం గురించి రాయడానికి ప్రేరణ నేను శిలాజం ఆత్మకధలో రాసిన ఒక వ్యాక్యం "శూన్యంగా చూస్తూ శిలాజంలా మిగిలిపోయా"
నిజానికి ఆ వాక్యాన్ని శూన్యంగా చూస్తూ శూన్యంగా మిగిలా అని రాయాలనుకున్నా.
@భాస్కర్ గారు,
నిజమే శూన్యం నుంచి వచ్చాం, శూన్యంలో కలుస్తాం

Prasad Chitta said...

అది శూన్యం కాదు - పూర్ణం, ఇదీ శూన్యం కాదు పూర్ణమే.

పూర్ణమదః పూర్ణం ఇదం, పూర్ణాత్ పూర్నముదత్యతే,
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావసిష్యతే
ఓం శాంతిః శాంతిః శాంతిః

Unknown said...

ప్రసాద్ గారు,
నిజానికి పూర్ణమా శూన్యమా అన్నది మన చూపులోనే ఉంటుంది.
మంచి శ్లోకాన్ని చెప్పారు. ధన్యవాదాలు.

Prasad Chitta said...

Please read: http://nonenglishstuff.blogspot.com/2009/03/blog-post_23.html

Unknown said...

బాగుందండీ, గణిత సమీకరణంతో అనంత జీవనాన్ని చెప్పిన విధానం