గెలుపు నాదే... నేనే విజేతను
వెంటనే అద్దంలో నా ముఖం చూసా
నన్ను చూసి నేనే మురిసిపోయా...
గర్వాతిశయంలో మునిగిపోయా
ఒక కొండను ఎక్కిన అనుభూతి,
అది చిన్న గుట్టేనని తెలియడానికి ఎన్నో క్షణాలు పట్టలేదు
నా ముందు మరో పర్వతం కనిపించింది
పర్వతాన్ని అధిరోహిస్తూ అనుకున్నా
ఈ పర్వతానికి సరైన బాట లేదే అని
ఆ పర్వతాన్నెక్కుతూ బాటను పరిచా
అది రాళ్ళ బాటే,
నా వెనుక వచ్చే వాళ్ళు దాన్ని పూల బాట కాకపోయినా
మట్టి బాటైనా చెయ్యరా అని నమ్మకం
ఇంతలో నేనెక్కుతున్న పర్వతం అగ్ని పర్వతమని తెలుసుకున్నా
అది ఏ క్షణాన్నైనా పేలవచ్చు
తనలో దాచిన లావాను నేను పరచిన బాటను కప్పివెయ్యవచ్చు
ఎలాగూ కాలి బూడిదవుతానని నా ఆరోహణను ఆపివేసా
అక్కడే ఒక గుడిసె కట్టుకుని నేను దాటిన గుట్టలు చూస్తూ ఆనందించా
ఒక రోజు ఆ లావా చిమ్మింది
తప్పించుకోలేక శూన్యంగా చూస్తూ శిలాజంలా మిగిలిపోయా
ఇప్పుడు చూసుకుందామంటే ఆనాటి అద్దం లేదు
అద్దంలో చూసి ఆనందించ శిలాజానికి ప్రాణం లేదు
కానీ కొన్నేళ్ళకు, ఎవరో వచ్చారు.. నేను కట్టుకున్న గుడిసెను చూసారు
నేను పరచిన బాటను కనుగొన్నారు
వీరు నాలాగ ఆగిపోలేదు,
చిమ్మే లావాను వెతుకుతూ ముందుకు సాగిపోయారు
ఆ లావా వారి సంకల్పానికి చల్లబడింది
వారి బాటకు ధృడపునాదిగా మారింది
అదేమిటో వాళ్ళు కూడా ఒక రోజు అద్దాన్ని చూసారు,
గర్వపడ్డారు, ఈసారి వారున్నది మంచుకొండ
అది కరగడానికి సిద్దంగా ఉంది...
4 comments:
జీవిత సత్యమిది. కరడుకట్టినట్టుండే కొబ్బరి కాయ పగలగానే నీరు కారిపొయినట్లే, వేలి తాకిడికే చితికిపొయే గుడ్డు వేడినీటికి గట్టిపడినట్లే, మది పోకడ.
ఓ విజయం పరంపరగా మారపోవచ్చు, ఓ ఓటమి తుదిసారి కావచ్చు. సంకల్పం ముందు అగ్ని పర్వతం ఆగదు, మంచు కొండా నిలవదు. ఒకరు ఎన్నుకున్న మార్గం మరొకరికి లక్ష్యం చూపవచ్చు. అసలు ఎవరికివారే గురువు కావచ్చు,
మీ భావాలన్నీ నేను అర్థం చేసుకున్నానో లేదో మరి.
ప్రదీప్ గారు , మీ కవిత చదివినప్పుడు నాకు కలిగిన భావం ఎలా రాయాలో తెలీలేదు . ఉష గారి కామెంట్ చూశాక ఆవిడ రాసినవి ఇంచుమించు నా భావాలే అనిపించింది .కవిత ఉత్తేజభరితంగా ఉంది .
Ozymandias :)
@ఉషగారు,
నిజానికి ఈ కవిత(?) రాయడానికి ప్రేరణ మీ బ్లాగులో నేను పెట్టిన వ్యాఖ్యే... (ఎక్కడో చదివినట్టు "తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత"
కొండ ఎక్కే పనిలో ఉన్నా, కానీ ఎక్కడ ఉన్నానో నాకే తెలియదు)
దానికి వ్యక్తిత్వ పుస్తకాలలో ప్రస్తావించే "రెస్ట్ హౌస్" ని కలిపాను. నిజానికి ఈ కవిత(?) అసంపూర్ణం. కేవలం రాజీపడిన వ్యక్తి గురించి మాత్రమే రాసాను.
@పరిమళంగారు,
ధన్యవాదాలు. నా కవిత ఉత్తేజం నింపిందంటే ఆనందంగా ఉంది.
@కొత్తపాళీగారు,
ఏమిటో నాకు పరిచయం కూడా లేని కవితలు తీసుకొచ్చి పోలిక పెడతారు. ఆ మహా కవులతో నాకు పోలికేమిటి, యాధృచ్చికం కాకపోతే!
మంచి కవితను పరిచయం చేసారు. :) ధన్యవాదాలు
Post a Comment