నిశీధిలో నువ్వే, ఉషస్సులో నువ్వే

 

తామసి నీడన నేను తామసుడనవ్వగా
తామసమునున్న నాలోని కామకుడు నిదుర లేవగా
ఆ నిశీధిలో ఆ కామకునినెదిరింప నీవే
ఆ కామకునితో రసక్రీడలో నిస్త్రాణవైనావా

తామసి నీడను పారద్రోల దినకరుడు ఉదయించ
నాలోని కామకుడు అలసి సొలసి నిదురపోవ
ఈ ఉషస్సున నాలోని సాత్వికుని నిదురలేప నీవే
ఆ సాత్వికుని సత్యయాత్రలో తోడైనావా

సత్యయాత్రలో నీ తోడు నాకుండ నాకెదురేదని భావింప
నాలోని రాజసము నిదురలేవ కించిత్ గర్వమున
నిన్నే మరచిన రజోయోగమున  నీవే
నా రజోగుణంబు హరింప నియంతవైనావా

సర్వకాలమ్ముల సర్వయోగమ్ముల
నన్ను విడువక నా నీడవలె ఉంటూ నా
హృదయాంతరంగమున ప్రతిధ్వనించు
అనంత జీవన రాగము నీవేనైనావా

(ప్రేరణ: నా స్నేహితుడు మనోహర్ తన గూగులు టాక్ లో పెట్టిన స్టేటస్
"నిశీధిలో నువ్వే, ఉషస్సులో నువ్వే! నియంతవై నువ్వే, నా హృదయాంతరంగవై నువ్వే!!")

ఎందుకు నాకీ పరుగు


ఎప్పుడు మొదలయ్యిందో తెలియదు నా ఈ పరుగు
చిన్నప్పటి బుడి బుడి నడకలలోనా
పలక మీద ఓనమాలు దిద్దినప్పుడా
ఆత్మీయులపై అలకతో ఆకలితో పడుకున్నప్పుడా
అల్లరి చేసినందుకు బళ్ళో బెత్తం దెబ్బలు,
   మోకాలి శిక్షలు అనుభవించినప్పుడా
ఎదురింటి అమ్మాయి నన్ను చూసి కొంటెగా నవ్వినప్పుడా
బంగరు గాజులు చూసి ముచ్చటపడిన అర్ధాంగి
   కళ్ళలో కాంతి చూడాలనుకున్నపుడా
ఐస్ క్రీము కొనివ్వమని నా ముద్దుల పాప అడిగినప్పుడా
క్రికెట్ బాట్ కొనివ్వమని నా చిన్నారి బాబు కోరినపుడా

.

.

.

.

.

.


ఎందుకు నాకీ పరుగు ....
ఎవరికివ్వను నా గెలుపు ?

ఎక్కడున్నావు ?


నిద్ర నుంచి లేచేసరికి ఎక్కడికో వెళ్ళిపోయావు,
ఎక్కడున్నావా అని వెతుకుతూ బయలుదేరాను

తన ప్రియురాలిని కలుసుకోవడానికి నా కన్నా ముందే వచ్చేసాడు సూరీడు
నువ్వెక్కడున్నావని అడిగితే ఆకాశాన్నంతా ఎర్రగా చేసి
"మా మధ్య రాకు" అంటూ సూర్యముఖితో సరసమాడసాగాడు

పక్కనున్న తుమ్మెదనడగబోతే నా ప్రేయసి దగ్గరకు వెళ్ళాలంటూ
దూరంగా అప్పుడే విచ్చుకుంటున్న సౌగంధ పుష్పం వద్దకు వెళ్ళిపోయాడు

గోమాతను అడగబోతే నా పిల్లలకు పాలివ్వాలంటూ
చెంగున చెంగున గెంతుతున్న లేగ దూడ వద్దకు వెళ్ళిపోయింది

చిగురాకుల మామిడికొమ్మను అడుగబోతే
చిగురాకుల తోరణంగా వెళ్ళాలంటూ మంచుతో కన్నీళ్ళు కార్చింది

పరవళ్ళు తొక్కుతున్న సెలయేటినడగబోతే
కొంటెగా నవ్వి ఆగకుండా పరుగు పెట్టింది

సెలయేటికి వచ్చిన కన్నెపిల్లలనడిగితే
కాటుక నిండిన కళ్ళతో తెలియదన్నారు

ఉదయమంతా నీ కోసం తిరుగుతూనే ఉన్నా కనిపిస్తావని

ఇంతలో సూర్యునికి వీడ్కోలు చెప్పడానికి మబ్బులు పరుగున వచ్చాయి.
జారిపడుతున్న ప్రతి చినుకునీ అడిగా
సెలయేటికి చేరాలంటూ పరుగులు తీసాయి

ఇంతలో ఎక్కడో విరహగీతం వినిపించింది
ఎవరా అని చూస్తే తమను వీడి వెళ్ళిన చంద్రుని కోసం
తారలు పాడుతున్నాయి చీకటికి స్వాగతం చెప్తూ

నన్ను పలకరించ వచ్చిన నిద్రా దేవిని అడిగా
కమ్మగా జోల పాడింది, నా కలలో మళ్ళీ నువ్వు వచ్చేలా...

మరో రోజు ముగిసింది నీ అన్వేషణలో
ఇంతకూ ఎక్కడున్నావు ప్రియతమా.....

" ఉదయం నుంచీ నీతోనే ఉన్నాను " చిరునవ్వుతో అంది నా కవితా ప్రేయసి

( కవిత కోసం వెతుకుతున్న కవి భావాలను చెప్పే ప్రయత్నం )

ఎవరామె?


గదిలోపల నేను గది బయట ఆమె
నాకు తెలుసు తను నాకోసమే వచ్చిందని,
కానీ ఎందుకో గుమ్మం బయటే ఆగింది
ఈ సారైనా నేనే తనని పలకరిస్తానన్న ఆశేమో  

నాకు ఆమెను పలకరించాలని ఉన్నా  
మనసులో ఎక్కడో వద్దనే అనిపిస్తోంది

నాకు
తనంటే కోపమా   ? ఏమో, తను కనిపిస్తే సర్వం మరచి గాలిలో తేలతాననేమో
తనంటే భయమా   ? ఏమో ఈ సమాజం దృష్టిలో ఇక నేనుండననే భయమేమో  
తనంటే అభిమానమా   ? ఏమో, నా కష్టాలన్నీ దూరం చేస్తుందనేమో

మాది జన్మ జన్మల అనుభందమైనా
ఆమెతో నాకెప్పుడూ తొలి పరిచయమే

ఎవరామె, నా అర్ధాంగి కాదు
నా ప్రేయసి కాదు  
ఆమె లేకుండా నా జీవితం పూర్తి కాదు
ఎవరామె   ?

(చావుకు దగ్గరలో ఉన్న ఒక వ్యక్తి మాటలలో మృత్యుదేవతను వర్ణించే ప్రయత్నం)

కలల రాకుమారి - కాల రక్కసి


కాలాన్ని జయించాలని ఉంది, నిన్ను కలిసే క్షణం కోసం.

కానీ ఈ కాలం ఉందే, ఇదో పెద్ద రక్కసి..
దీనికి ఒళ్ళంతా కళ్ళే, ప్రపంచమంతా సేవకులే.

నిన్ను కలిసే  ఆ క్షణాన్ని త్వరగా చేరడం కోసం
రక్కసితో సమరం చేసా.. సమానం కాలేకపోయా..
మరోసారి దాని చేతిలో ఓడిపోయా..

నా శక్తి చాలదని, దేవుని కోసం తపస్సు చేసా...
కాలాన్ని జయించాలంటే కాలాతీతం కావాలన్నాడు.
కాలాతీతం కావాలంటే, కాలాతీతమైనదాన్ని చేజిక్కించుకోవలన్నాడు.

మన ప్రేమ కన్నా కాలాతీతమేముంది?
మన ప్రేమను గెలవాలంటే,
నా పిచ్చి కానీ ప్రేమకు గెలుపోటములేమిటి!

నా కలలో ఉన్న నిన్ను కలిసిన క్షణమే
మన ప్రేమ గెలుస్తుందన్నాడు దేవుడు.

నిన్ను కలిసే క్షణం కోసం కాలాన్ని జయించాలనుకున్నా
నిన్ను కలిస్తేనే కాలాన్ని జయిస్తానన్నది ఆ దేవుని ఆనతి.

నిన్ను కలిసే ఆ క్షణం వరకూ నువ్వుండే కలలోనే బతకమంటావా.... 

గమనిక: కాల రక్కసి అన్న పదం వ్యాకరణ పరంగా తప్పు అయినప్పటికీ ప్రాస కోసం వాడాను.