మనసుతో మధనం

తెల్లవారి నిద్రలేచి మనసుని అడిగా, చూశావా అని?
లేదే అని పలుకు లేకుండా కూర్చుంది

నిద్రపోయి కలలో ఊయలలూగుతున్న మనసుని అడిగా, ఎక్కడ అని?
తెలీదే అని ఊయలలో ఆడుకుంది

మనసెక్కడికెలితే అక్కడికి వెంటాడి అడిగా, ఏం మాయ చేశావు అని?
మాయంటే తెలీదని మాయమయ్యింది

నా అనుమానమంతా ఈ మనసు మీదే, దాచేసి ఎక్కడ దాచిందో చెప్పదు
బతిమలాటలు, బుజ్జగింపులు, ఎదురు దాడులు ఏమీ పని చెయ్యడం లేదు ఎలా?

ఎడతెగని పరిశోధన చేస్తూనే ఉన్నా
మనసు మాత్రం చలనం లేకుండా నవ్వుతూ ఉంది

ఎలా నవ్వుతోంది తను? నాలోని నేనైన నా ఆత్మను దాచేసి!!
ఆత్మ కట్టిన ఊహల ఊయలపై ఊగుతూ,
మాయను వదిలించే ఆత్మను వదిలి,
మనసెలా ఆనందంగా ఉంది? ఆత్మ లేకుండా?

బహుశా ఈ వింతకు కొత్త పేరు పెట్టాలేమో?
ఎందుకూ, ఉందిగా జీవితమనే పేరు
మనసెక్కడంటే ఆత్మేమి చెప్పేను ?
ఆత్మేదంటే మనసేమి చెప్పేను?

మనసున కలిసిపోయిన ఆత్మను వెదుకుతూ ఆత్మానందాన్ని దూరం చేసుకున్నానా ?

(మనసుతో మధనం కొనసాగించబడుతుంది.......)

2 comments:

Dileep.M said...

Exactly

మరువం ఉష said...

సాగర మధనం లో అమృతం తేలినట్లు, ఈ మధనం తో మనసులోని కవితామాధురిమ వెలికి వస్తుందిలే దీపు!

మనసు ఆత్మ గా విడదీసినా - ఇదీ ఒక అంతఃకరణ అంతేగా! ఇవేగా పడుగుపేక జీవిత నేతలో.