చీకటి

రాత్రి దేశపు” చక్రవర్తిలా “నిశ్శబ్దపు ఆసనాన్ని” అలంకరించింది చీకటి
లోకమంతటికీ తన భటులను పంపి అనంత అశ్వమేధాలు చేసింది
అశ్వమేధ హోమంలో వెలికి వచ్చిన సూర్యచుక్కను చేత పట్టి
రాజ్యమంతా “చుక్కల పందిరులు” వేయించి చల్లని “చంద్ర”సుమాలనందించింది
ప్రతీ క్షణం రాజ్యమంతా “స్వప్న గీతాలు” ఆలాపన చేయించింది

ఒకనాడు చుక్కలపందిరికి చిల్లులు పడ్డాయి
అవి కాంతిరేఖల పదునైన బాణాలు చేసిన గాయాలు
యజ్నాశ్వానికీ తగిలిందొక బాణం, గాయపడినా భారంగా సాగింది
ఎర్రబడింది చీకటి, ఉలిక్కిపడింది “రాత్రి దేశం”
ఊగిసలాడింది నిశ్శబ్దం , ఏమైంది సార్వభౌమం?
ఎందుకీ ధిక్కారం?

“రాత్రి” కోనల్లో దాగిన “శాంతి వజ్రాల” కోసమా ?
“నిశ్శబ్దపు ఆసనంలో” దాగిన “ప్రణయపు ముత్యాల” కోసమా ?
పందిరికింద రాలిన “చుక్కల” కోసమా ?

3 comments:

మరువం ఉష said...

వెలుగు

చీకటి నియంతకి చిక్కి
రేయంతా కారాగారపు జాగారం చేసిన పగలు
వెలుగుబావుటా ఎగురెవేసింది
మంకెన పూల కెంపులు, పచ్చిక పచ్చలు, నీలాకాశ నీలాలు,
వన్నేకో వైనాల ప్రకృతిని కలేసుకుని
నవవర్ణాల నవ్య కాంతులు నేలకి ధారాదత్తం చేసింది.

పరిమళం said...

“రాత్రి దేశపు” చక్రవర్తిలా “నిశ్శబ్దపు ఆసనాన్ని” అలంకరించింది చీకటి! Beautiful!!

Unknown said...

ఉష గారు,

వెలుగు - చీకట్ల దోబూచులాటే జీవితం. మీ పేరుకు తగ్గట్టు వెలుగుతో వచ్చారు. (నా పేరు భావం కూడా వెలుగే సుమా!, ఆ వెలుగుకు ఈ చీకటి కలిసి జీవితమయ్యింది)

పరిమళం గారు,
చీకటి-2 చదవండి, ముందు ఆ భావంతో మొదలుపెడితే ఇలా వచ్చింది. బాగుందని కదిలించలేదిక