ఏ శబ్దాన్ని హరించి వచ్చిందో ఈ నిశ్శబ్దం
ఏ అనంతాన్ని తనలో దాచుకుందో ఈ శూన్యం
పలుకరాని భాష అది, పలికితే వినబడదు మరి
ఆ భాష తెలియని మనిషి లేడు.
కొందరి హృదయఘోష ఆ భాషలో రోదన గీతాలు పాడుతుంది
కొందరి ఏకాంతవేళ ఆ భాష గంధర్వగీతాలు పాడుతుంది
కొండంత భాధకు ఉప్పెనంటి సాంత్వన కలిగిస్తూ
ఉప్పెనంటి ఆనందంలో లోయంటి లోతులు చూపుతూ
ప్రశ్నకు సమాధానాన్ని చేరువ చేస్తూ, ఆ రెంటి మధ్యా తానే నిలుస్తూ
హృదయంతో పలికే భాష అది, కన్నులతో పాడే గానమది
చూడలేని చిత్రమది, చూస్తే నిలువదు మరి
ఆ చిత్తరవు చూడని ప్రాణి లేదు
కొందరి ఎదురుచూపులు ఆ చిత్తరవుపై పైశాచిక నృత్యం చేస్తాయి
కొందరి విజయహాసాలు ఆ చిత్తరువుపై ఆనందతాండవమాడతాయి
అంతు వెతికే చూపులకు అంతం చూపుతూ
అనంతమని ఎగసిపడే చూపుల అలుపు తీర్చుతూ
అనంతాన్ని తనలో బంధించి, అంతలోనే అంతాన్ని చేరువ చేస్తూ
కన్నులు చూడలేని చిత్రమది, మది గదిలో బందీ అయిన అపురూప చిత్రమది
మది పలికించే నవరసాలూ ఆ భాషకు అచ్చులు
హృది ఆలాపించే సప్తస్వరాలూ ఆ చిత్తరువపై నడకలద్దిన హరివిల్లు
ఆ భాషకు లొంగని భావమూ, ఈ చిత్తరువులో కనపడని మదిచిత్రమూ ఎచ్చోటనూ లేవు
ఆ భాషలో ఆలాపన చేసే గానగంధర్వుడు ఎవడు?
ఈ అపురూప చిత్తరువు గీసిన చిత్రకారుడెవడు?
ఆ రెంటి నడుమా నను పడదోసి ఆ చిత్రాన్ని గీసి సుస్వర గానాలాపన చేస్తున్న అనంతుడెవడు
ఆ భాషరాని మూగవాడిని, ఆ చిత్రం చూడలేని అంధుడిని
14 comments:
భాష రాదంటూనే ...భావోద్వేగాలను అంతందంగా పలికించారు మీ కవితలో ....
చూడలేనంటూనే ...కనిపించని చిత్రాన్ని వర్ణించారు మీ కవితలో .....బావుందండీ !
పరమాత్ముడి గురించి చెబుతారు కళ్ళు లెకపొఇన చూస్తాడని, కాళ్ళు లెకపొఇన నడుస్తాడని. చెవులు లేక పోయిన వింటాడని, నోరు లేక పోయిన మాట్లాడుతాడని....హిందీ లో ఉంది....విను పగ చలే...విను బక్తవర జోగి అని ఇది ఉత్ప్రేక్ష అలంకారం అనుకుంటా లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెబుతారు. హిందీ పాట ఒకటి ఉంది తారీఫ్ కారూ ఉస్స్ కి జీసస్ నే తుజ్హే బనాయా...2) జిస్ కి రచన ఇతని సుందర్ వో కిత్నా సుందర్ హోగా ....
--
లేదు లేదు మీ అంతర్నేత్రంతో గాంచినదే ఈ నిశ్శబ్ధ సంగీతం. అది మా చెవులలో వినబడుతోంది మిత్రమా....
అన్నపూర్ణ గారు, (పరిమళం)
, రామ్ , వర్మగారు,
ధన్యవాదాలు.
జీవితాన్ని భాష, చిత్తరువు గా అన్వయించుకుని చూస్తే ఆ భావన బాగుంది. ఆ భాషలోని గానాలు/భాష్యాలు, ఆ చిత్తరువుపై నడయాడు చిత్రాలు - అనుభూతులు, అనుభవాలు ఆ అనంత నిరాకార అద్వితీయ కళాకారుని చమత్కరాలు కాక మరేమిటి. మనం నిమిత్తమాత్రులం కాక మరేమిటి. హృదిలో, మదిలో ఆ మూర్తిని నిలపనిదే అవి రెండూ జీవిత గమకాల గంధాన్ని, అందాల ఆస్వాదనని నోచుకోవు. జీవాత్మ పరమైన ప్రేమ భావనలకి లోను కానిదే పరమాత్మ ని అన్వేషించము. అందుకే శూన్యాన్ని ఓ చక్కని ప్రేమబంధం తో నింపండి. ఆ నిశ్శబ్దాన్ని అనురాగలహరిలో మరుగుచేయండి.
కవిత బాగుంది, ఒకటి రెండు సార్లు చదివితేనే గానీ ఈ మాత్రం అర్థం కాలేదు, ఇప్పటికీ మీ భావ సామ్యం నా అవగాహన ఒకటేనో, కాదో? అలాగే "స్వాంతన" కాదు "సాంత్వన" అని విన్నాను.
ఉష గారు,
సాంత్వన సరైనది. మార్చాను.
ఇక, ఈ కవిత ఆధ్యాత్మికం కాదు. ఇది నిశ్శబ్దాన్ని, శూన్యాన్ని ఆస్వాదిస్తూ రాసిన కవిత.
మీ సూచనకు ధన్యవాదాలు.
సరే కానీ, మీరు అస్వాదిస్తూ మరి పదే పదే ఆ చివరి అభిప్రాయం కలిగించే విధంగా ఎందుకు వ్రాసారు? మీరు అస్వాదిస్తుంటే మూగ, అంధుడు ఎలా అయ్యారు? ఇక పోతే, నేనన్నట్లు ఆ రెండిటినీ నింపితే ఇంకా అస్వాదించగలరు. ప్రయత్నించండి.
" పదేపదే ఆ అభిప్రాయం " - నేను ఏనాడూ చెప్పలేదు కదా ఆధ్యాత్మికత లేకుండా రాసాను అని. దీనికి మాత్రమే చెప్పాను.
ఇక, ఆస్వాదిస్తుంటే మూగ, అంధుడు ఎలా అయ్యాను - చక్కని ప్రశ్న, నిజానికి నేను పూర్తి మూగ, అంధుడిని కాదు. అవి ఏనాడూ పూర్తిగా ఆస్వాదించీఆస్వాదించని వాడిని.
మీరు చెప్పిన రెంటినీ నింపే ఉంచాను. అవి ఉన్నా అప్పుడప్పుడు అవి లేవనుకుంటే ఎలా ఉంటుందనే ఊహలోంచే ఈ కవిత ఉధ్భవించింది.
;) I am convinced.
huh, I thought it will take another 3 - 4 comments to convince you.
నిజానికి నేను సరిపెట్టుకున్నది నాకు సమయాభావం తప్పదనే....;) అంత తేలిగ్గా వదలను మిమ్మల్ని. మళ్ళీ వస్తాను.
చూద్దాం మరలా ఎప్పుడు వస్తారో, ఎప్పటివరకూ వదలరో. మేము సిద్దం దేనికైనా
ఆహా, అప్రమత్తంగా వున్నారన్నమాట!
అయినా అంతా లేనివి వూహించుకుంటుంటే మీరు వున్నవి లేనట్లు వూహించటమేమిటీ? ;)
అసలు ఇంద్రియాలని అస్వాదించనివారికన్నా మనం నయం కదూ? వీలైనంత భావుకత, అనుభూతి కలుపుకుంటున్నాము. నింపినవి నిలుపుకోండి, నిలవనివాటిని కాచుకోండి, కావలి మీరై కంటిరెప్పలే మీ బాణాలై మరిన్ని కవి కాంచిన క్షణాలు మాకు పంచండి. ఇది జరగని నాడే నేను మిమ్మల్ని వదలనన్నది. అభిమానులుంటారు అర్జునకవివర్యా! :)
" అయినా అంతా లేనివి వూహించుకుంటుంటే మీరు వున్నవి లేనట్లు వూహించటమేమిటీ? ;) " -- ఈ ప్రశ్న ఇంతవరకు ఏనాడూ రాలేదేమిటి?
నేను రాసినవాటిలో సగానికి పైగా ఇలాటివే సుమా.. మరిచారా...
లేనిది సృష్టిస్తా, ఉన్నది మాయం చేస్తా
కష్టం వెనుకదాగిన అందం నాకు ముఖ్యం , సుఖం వెనుక వచ్చే బాధ నాకు ప్రియం
ఇక, ఒకే రకమైన బాణాలు ఎన్నని వెయ్యను, కొంచెం మారుద్దామా అని ప్రయత్నిస్తూ సంధిగ్దావస్థలో ఆగా అంతే
Post a Comment