అనంత వృత్తం-2

ఆవురావురుమంటూ తన పరిధి పెంచుకుంటూ పోతోంది
ఎక్కడ మొదలయ్యిందా దీని ప్రయాణమంటూ ఆరాలు తీస్తూ
నా నడక మొదలయ్యింది, వృత్త పరిధిని దాటి లోనికి అడుగు పెట్టలేకున్నా
చక్రవ్యూహమిది, లోనికి రానీయదు, బయటకు పోనీయదు
వంద చేతులు వెనక్కి లాగుతాయి లోనికి అడుగెయ్యనీకుండా
వందకొక్కటే లోనికి తోడుగా పిలుస్తుంది

ఇది రేఖ కాదు, ఎక్కడ మొదలయ్యిందో చెప్పడానికి
అసలు ఈ దారి ఎటు పోతుందో తెలియదు,
నా గమ్యం మాత్రం ఈ వృత్త కేంద్రమే

అంతము కానరాని
ఆరంభము తెలియని విశ్వరూపమిది
అనంత గణం ఏక గణనం, అనంత వృత్తం ఏక కేంద్రం,
విశ్వాంతరాలన్నీ అంతర్లీనం, విశ్వమే పరిధి ఈ అనంత వృత్తానికి

ఏలనో ఒకపరి కిందకు చూసా
ఏమది, అనంత అనంత వృత్తాలు అగుపించినవి
పరికించి పైకి చూడ
లెక్కలేని వృత్తాలు గొడుగు పట్టినవి

ఏ వృత్త కేంద్రమని వెతకను,
మూషికమై తవ్వుకుపోనా... మయూరమై ఎగిరనా...
లంబోదరుని తోడు కోరి విఘ్నాలకు విఘ్నమవ్వనా
దైవగణ నాయకుని సైనికుడినై దూసుకుపోనా

విశ్వనాధుని హృదయమా ఆ అనంత వృత్తం,
ఆ హృదయమున చోటు లేనిదెవరికిలే
ఆ హృదయకేంద్రమును వెతుక నేనెంత , అందుకే
ఈ అనంత వృత్తమున ప్రమధ గణమున ఒక్కడినై విహరించనా

ఆ ఊహ మనసున కలిగిన క్షణమున వినిపించె అశరీర వాణి
"ఈ అనంత వృత్తమునకు కేంద్రముండునా...ఎచట నిలిచి నను ధ్యానించినా అదే కాదా కేంద్రము
సంశయమేల, ప్రతి కణమూ కేంద్రమే. అది తెలిసిన క్షణము అణు విస్ఫోటనపు శక్తే కాదా నీ వశము"

అనంతమును శోధించు శోధన కూడా అనంతమే.. కనిపించిందా అనంత వృత్త కేంద్రం

4 comments:

Anonymous said...

పిచ్చిరెడ్డి : మీరు రాసినదానికి అర్థమేమన్నా ఉన్నదా

అర్జునుడు: మీకు అర్థమవ్వాలనే నేను బోలెడంత సమయం వెచ్చించీ, అంత కష్టపడీ రాసింది. మరి మీకు అర్థం కాలేదు అని అంటే, నేను మీరు సార్థకనామధేయులే అని అనవలసి వస్తుంది

పిచ్చిరెడ్డి: $%^&

Unknown said...

ఏకపాత్రాభినయం బాగా చేసారు. అర్ధం కాలేదని చక్కగా చెప్పారు. చిన్న ప్రశ్న, తప్పులు ఏమిటో... ఎక్కడ దారి తప్పానో సెలవిస్తారా ?
మీ విమర్శను పూర్తి చేస్తారా ?
"To Err is human nature"

మరువం ఉష said...

sahajmarg has laid out circles of self-realization/attainment. Ones journey starts at the outer and march towards the center as the soul advances which is god. Your work reminded of that. lately my heart is boiling within of the very theme you took. Perhaps like minded..

Unknown said...

పిచ్చిరెడ్డి గారు,
మీ పూర్తి విమర్శ కోసం ఎదురు చూస్తున్నాను
ఉష గారు,
ఇక సహజమార్గం, దాని గురించి కొంచెం కూడా తెలియని వాడిని, మీరు ఈ కవితలను పోలిస్తే అంతా తెలుసని గర్వాతిశయంలో మునిగిపోతానేమో.
లైక్ మైండెడ్ అవ్వచ్చేమో, కానీ తీవ్రత వేరు ఇద్దరిదీ