వెన్నెల రాత్రి

సిగ్గుపడే ప్రియురాలి మోము కానరాక
అలిగిన ప్రియుడు, సూరీడా! ఆమె మోముని
చూపింప ఉదయించమని అడిగాడట
వారి సైకత పానుపుపైనున్న మల్లెలు ఫక్కున నవ్వి
పున్నమి వెన్నెల కురిపించమని చంద్రున్ని కోరగా
చీకటికోటను తన శ్వేతకిరణాలతో నింపి
ఆమె మోముని అతని కనులలో ప్రతిష్టించాడట ఆ చందమామ

అంత ఆ చంద్రున్ని చూసి ఆటలాడు బంతియని భ్రమపడిన
బాలుడొకడు అమ్మ వద్ద మారాం చేయ,
ఆయమ్మ పక్క నున్న కొలనులో చంద్రున్ని చూపిందట
నీటిలో చంద్రుని చూచిన బాలుడు నా చెంత చేరాడు చంద్రుడంటూ
అమ్మ లాలిపాట వింటూ నిదురపోయాడట
ఆ లాలిపాట వింటూ చంద్రుడు కూడా పరవశించి
హిమపవనాల పరిమళంతో వింజామరలు వీచాడట

ఆ పరిమళాలు ఎక్కడో ఒంటరిగా కవితాప్రేయసి కోసం
ఎదురు చూస్తున్న కవి కలాన్ని తాకాయట
ఈ సంబరాన్ని చూద్దామని సూరీడు రాబోయాడట
చంద్రుడు తన శ్వేతకిరణాలతో తరిమేసిన తామసి
సూరీడుని నిలువరించిందట...

తామసితో యుద్దం చేసి అలసి రక్తమోడుతూ చీకటికోటలో
ప్రవేశించాడట, 
ఆ ప్రియురాలి చెక్కిలిపై ఎరుపు చుక్క పెట్టి
ఆ ప్రేమపక్షులని నిద్రలేపాడట

నిదురపోతున్న బాలుని లేపి రంగు మారిన బంతినంటూ
కొత్త ఆటలు మొదలుపెట్టాడట
కవి కలానికి సిరా పోసి పలకరింప తనతో తెచ్చిన రోజుని పంపాడట

నెమ్మదిగా బలం పుంజుకున్న తామసి సూరీడు రక్తాన్ని రుచి చూసింది
మరో రాత్రికి శ్రీకారం చుట్టింది

4 comments:

మనోహర్ చెనికల said...

;-)

Unknown said...

:)

మరువం ఉష said...

భలేగా, చంద్రుని పనికి ఆటంకం రాకుండా తామసే రక్కసై సూరీడ్ని చెండాడేస్తూ. క్రొత్త కోణం.

Unknown said...

ఉషగారు,
నేనంత ఆలోచించలేదు. కానీ చంద్రుని చల్లదనానికి యుద్దాన్ని కలపడమెందుకని అలా తామసితో యుద్దాన్ని సృష్టించాను