ఎక్కడున్నావు ?


నిద్ర నుంచి లేచేసరికి ఎక్కడికో వెళ్ళిపోయావు,
ఎక్కడున్నావా అని వెతుకుతూ బయలుదేరాను

తన ప్రియురాలిని కలుసుకోవడానికి నా కన్నా ముందే వచ్చేసాడు సూరీడు
నువ్వెక్కడున్నావని అడిగితే ఆకాశాన్నంతా ఎర్రగా చేసి
"మా మధ్య రాకు" అంటూ సూర్యముఖితో సరసమాడసాగాడు

పక్కనున్న తుమ్మెదనడగబోతే నా ప్రేయసి దగ్గరకు వెళ్ళాలంటూ
దూరంగా అప్పుడే విచ్చుకుంటున్న సౌగంధ పుష్పం వద్దకు వెళ్ళిపోయాడు

గోమాతను అడగబోతే నా పిల్లలకు పాలివ్వాలంటూ
చెంగున చెంగున గెంతుతున్న లేగ దూడ వద్దకు వెళ్ళిపోయింది

చిగురాకుల మామిడికొమ్మను అడుగబోతే
చిగురాకుల తోరణంగా వెళ్ళాలంటూ మంచుతో కన్నీళ్ళు కార్చింది

పరవళ్ళు తొక్కుతున్న సెలయేటినడగబోతే
కొంటెగా నవ్వి ఆగకుండా పరుగు పెట్టింది

సెలయేటికి వచ్చిన కన్నెపిల్లలనడిగితే
కాటుక నిండిన కళ్ళతో తెలియదన్నారు

ఉదయమంతా నీ కోసం తిరుగుతూనే ఉన్నా కనిపిస్తావని

ఇంతలో సూర్యునికి వీడ్కోలు చెప్పడానికి మబ్బులు పరుగున వచ్చాయి.
జారిపడుతున్న ప్రతి చినుకునీ అడిగా
సెలయేటికి చేరాలంటూ పరుగులు తీసాయి

ఇంతలో ఎక్కడో విరహగీతం వినిపించింది
ఎవరా అని చూస్తే తమను వీడి వెళ్ళిన చంద్రుని కోసం
తారలు పాడుతున్నాయి చీకటికి స్వాగతం చెప్తూ

నన్ను పలకరించ వచ్చిన నిద్రా దేవిని అడిగా
కమ్మగా జోల పాడింది, నా కలలో మళ్ళీ నువ్వు వచ్చేలా...

మరో రోజు ముగిసింది నీ అన్వేషణలో
ఇంతకూ ఎక్కడున్నావు ప్రియతమా.....

" ఉదయం నుంచీ నీతోనే ఉన్నాను " చిరునవ్వుతో అంది నా కవితా ప్రేయసి

( కవిత కోసం వెతుకుతున్న కవి భావాలను చెప్పే ప్రయత్నం )

ఎవరామె?


గదిలోపల నేను గది బయట ఆమె
నాకు తెలుసు తను నాకోసమే వచ్చిందని,
కానీ ఎందుకో గుమ్మం బయటే ఆగింది
ఈ సారైనా నేనే తనని పలకరిస్తానన్న ఆశేమో  

నాకు ఆమెను పలకరించాలని ఉన్నా  
మనసులో ఎక్కడో వద్దనే అనిపిస్తోంది

నాకు
తనంటే కోపమా   ? ఏమో, తను కనిపిస్తే సర్వం మరచి గాలిలో తేలతాననేమో
తనంటే భయమా   ? ఏమో ఈ సమాజం దృష్టిలో ఇక నేనుండననే భయమేమో  
తనంటే అభిమానమా   ? ఏమో, నా కష్టాలన్నీ దూరం చేస్తుందనేమో

మాది జన్మ జన్మల అనుభందమైనా
ఆమెతో నాకెప్పుడూ తొలి పరిచయమే

ఎవరామె, నా అర్ధాంగి కాదు
నా ప్రేయసి కాదు  
ఆమె లేకుండా నా జీవితం పూర్తి కాదు
ఎవరామె   ?

(చావుకు దగ్గరలో ఉన్న ఒక వ్యక్తి మాటలలో మృత్యుదేవతను వర్ణించే ప్రయత్నం)