జడివాన


నిశిరాత్రిలో సంద్రంపై ఆటాడుకునే మబ్బులనెవరో తరిమారు
తల్లి ఒడిని వెతుకుతూ బేలగా పచ్చని తీరంపైకి చేరాయి
శక్తినంతా కోల్పోయి నేల రాలాయి

అక్కున చేర్చుకుని ఆఖరిశ్వాసకు జీవం పోసాయి ఏపైన పంటలు
శక్తి కోల్పోయి నేల రాలి
నిర్జీవమై మబ్బులతో జంట కట్టి నేల చేరాయి

తెల్లవారి కళ్ళు తెరిచింది పక్క చెరువులో కలువ
పంటకు తరలివచ్చిన శ్మశానాన్ని చూసి వెక్కివెక్కి ఏడ్చింది
సూర్యకిరణం తాకకముందే వాడిపోయింది

అస్థిత్వం

తలనిండా బరువెక్కిన అగ్గిపుల్ల,
తలను రాపాడిస్తూ పరిగెట్టింది
అగ్నిహోత్రుని సమిధగా మారి బూడిదగా మిగిలింది

నీటి కుండ నల్లమబ్బు,
కొండను డీకొట్టి ఉరిమింది
చినుకుగా కరిగి జలపాతంలో సమాధి అయ్యింది

గాలి నింపుకున్న బుడగ,
తేలితేలి నేల మీదకు దుమికింది
ఒళ్లంతా తూట్లు పడి వాయుతర్పణం అయ్యింది

చెట్టుకు దుప్పటి కప్పింది తొలి మంచు,
నిద్ర లేచి ఒక్కసారి ఒళ్లంతా విచ్చుకుంది చెట్టు
జారిపడి ఆకసంలో తేలిపోయింది

మట్టి ముద్ద మనిషి,
ధిక్కారపు స్వరం చేస్తూ పైపైకి ఎగిరాడు
నేల వెతుక్కుని మట్టిలో కలిసాడు 

విహంగపు సొగసులు

సూరీడేడని వెతికేస్తూ 
మబ్బు కొండలలో సొరంగమొకటి తవ్వుకుని 
గాలి చీల్చుకుని బాట మలుచుకుని
వర్షపు చినుకుల పైపైన అడుగులు వేస్తూ 


చుక్కలనన్నీ రెక్కల మాటున పట్టేస్తూ
మెరుపుల లోగిలిలో మెరుపై కదులుతూ
మేఘగర్జనకు శృతి కలుపుతూ 


నేలనంతా తన నీడతో కొలిచేస్తూ
వాయుపాతపు హొయలను చదివేస్తూ
విశ్వవర్ణ సుమాలను ఏరేస్తూ

హద్దులు చెరుపుతూ
పైపైకి ఎగిరింది విహంగం, విమానం 


("వాయుపాతము" అనే పదం జలపాతం లాంటి అర్ధంలో వాడినది. ఈ పదానికి వేరే అర్ధం ఉందా అన్నది నాకు తెలియదు)

రవి కాంచనిదేదో నటనమాడెను

హద్దులు ముక్కలు చేస్తూ ఘర్జనతో భయాన్ని భయపెడుతూ 
తానే చక్రవర్తినని ప్రకటిస్తూ
కాళ్ళను పట్టిన సంకెళ్ళను తెంపుకుని లంఘించినదొక సింహం

మబ్బులు గొడుగు పడుతుంటే
కొంగ్రొత్త కాంతితో వికసించెను ఉదయం
మునుపెన్నడూ తెలియని వర్ణంలో మెరిసెను వసంతం


అద్దం తెలుపని అందమేదో చూపింది ఎదనయనం 
కలం పలుకని పదమేదో పాడింది గీతం
రవి కాంచనిదేదో నటనమాడెను వేలికొన చివరన

ప్రకృతి చూపని పారవశ్యం పొందింది హృదయం
నిర్జన నిర్జీవ ఎడారిలో నిండింది జీవం
ప్రపంచమెరుగని ప్రదేశం వెలిసింది నవ విశ్వమై 

శ్వేతమోహిని


దూది పింజ, వెన్న ముద్ద, వెండి కొండ, పాల పొంగు
ఏమని పిలిచిననేమి తెల్లమబ్బు అందాన్ని

కొంటేవాడివైతివేమి సూరీడా
సనసన్నని కిరణాలతో తెల్లమబ్బు కౌగిలింత కోరితీవి
నిర్మల శ్వేతమేఘం జలధి కావాలాని కోరిందా
?సంద్రమంతా కలియవచ్చి , నీటినంత పీల్చివేసి
తడితడి పెదవులతో శ్వేత మేఘాన్ని తామసముఖి చేసి ఎచ్చటకేగితివి

గంగా ప్రవాహాన్ని చూసి ముచ్చటపడి గజగామిని
పవనుడి తోడు కోరింది
ఆకసాన్ని ఇట్టే కొలిచేసి కిందకు దుమికింది

పర్వత ఝటాఝూటంలో బందీ అయ్యి
జలపాతమై దుమికి నదిలో కలిసి సంద్రంలో మునిగి
సూర్య-సంద్ర మధనంలో శ్వేతామృతమై తేలి వచ్చింది

సూరీడా


తెల్లతెల్లవారె సూరీడా
ఎర్రని కోకలు తెచ్చేసి సక్కంగ భూమంత పరిచేసి
రంగురంగుల పూలెన్నో జతచేసి కొప్పున తురిమేసి
పన్నీరు జల్లుల్ని నేలంతా జల్లేసి
మత్తు గాలికి మత్తెట్టి జోకెట్టి లోకమునెల్ల నిదుర లేపేస్తివా
,
నిన్నెవరు లేపితిరి సూరీడా

రోజంతా నిప్పుల్ని రాజేసి అలసితివా సూరీడా
అదిగో చంద్రుడొచ్చినాడు
,
సలసల్లని గాలులు సలసలవేగే నీపై జల్లేసి
నీకేమో జోలపాడి
తెల్లతెల్లని కోకలు భూమంత పరిచేసి
కొప్పున పెట్టిన పూలన్నీ నేల రాల్చి
మత్తు తెమ్మెరలెన్నో భూమంత రాజేసి
గమ్మత్తు చేసాడు సూరీడా
మళ్ళా పొద్దున్నే వచ్చేయి సూరీడా

చిన్నదైపోతున్న ప్రపంచం


ఓంకారనాదజనిత విశ్వసృష్టిని దిక్కరిస్తూ
హాహాకారమిళిత ప్రళయఘోషను సృష్టిస్తూ
చిన్నదైపోతున్న ప్రపంచం

మనసుతో మధనం

తెల్లవారి నిద్రలేచి మనసుని అడిగా, చూశావా అని?
లేదే అని పలుకు లేకుండా కూర్చుంది

నిద్రపోయి కలలో ఊయలలూగుతున్న మనసుని అడిగా, ఎక్కడ అని?
తెలీదే అని ఊయలలో ఆడుకుంది

మనసెక్కడికెలితే అక్కడికి వెంటాడి అడిగా, ఏం మాయ చేశావు అని?
మాయంటే తెలీదని మాయమయ్యింది

నా అనుమానమంతా ఈ మనసు మీదే, దాచేసి ఎక్కడ దాచిందో చెప్పదు
బతిమలాటలు, బుజ్జగింపులు, ఎదురు దాడులు ఏమీ పని చెయ్యడం లేదు ఎలా?

ఎడతెగని పరిశోధన చేస్తూనే ఉన్నా
మనసు మాత్రం చలనం లేకుండా నవ్వుతూ ఉంది

ఎలా నవ్వుతోంది తను? నాలోని నేనైన నా ఆత్మను దాచేసి!!
ఆత్మ కట్టిన ఊహల ఊయలపై ఊగుతూ,
మాయను వదిలించే ఆత్మను వదిలి,
మనసెలా ఆనందంగా ఉంది? ఆత్మ లేకుండా?

బహుశా ఈ వింతకు కొత్త పేరు పెట్టాలేమో?
ఎందుకూ, ఉందిగా జీవితమనే పేరు
మనసెక్కడంటే ఆత్మేమి చెప్పేను ?
ఆత్మేదంటే మనసేమి చెప్పేను?

మనసున కలిసిపోయిన ఆత్మను వెదుకుతూ ఆత్మానందాన్ని దూరం చేసుకున్నానా ?

(మనసుతో మధనం కొనసాగించబడుతుంది.......)