చీకటి - 2

నిశ్శబ్దపు నీడలో నిదురపోయే ఆకుపై,
కనిపించని రేయిలో విహరించే గబ్బిలం రెక్కపై,
కనురెప్ప పానుపుపై స్వప్నంలో విహరించే కంటిపై,
మబ్బుల దుప్పటిపై చుక్కల అలంకారంపై
భువి నుంచి దివి వరకు, సంధ్య నుంచి సంధ్య వరకు
ఆనందంగా విహరిస్తోంది చీకటి

నిశ్శబ్దపు నీడను చీలుస్తూ, నిదురించే ఆకుపై మంచు జల్లుతూ
కనిపించే ఉదయాన్ని లాక్కొస్తూ, నిశాచార విహారానికి విశ్రాంతి చెపుతూ
కనురెప్పను కదిలిస్తూ, స్వప్నాన్ని కంటి వెనుక బందీ చేస్తూ
మబ్బుల దుప్పటిని కదిలిస్తూ, చుక్కలను దాచేస్తూ
భువిని దివి నుంచి వేరు చేస్తూ, మరో సంధ్యను తీసుకొస్తూ
దూసుకువచ్చింది కాంతి…

కాదు కాదు చీకటిపై దాడి చేసింది హఠాత్తుగా
కాంతిరేఖల పంటిగాట్లతో ఎర్రబడి మాయమయ్యింది చీకటి

ఏడ దాగిందో వెతికి చెప్పండి ఆ సుందర నిశీధి

బహుశా సుందరాంగుల కేశాలలోనో
లేక కనురెప్పల కదలికలలోనో
లేక కాంతి చిందించే నీడలోనో
దాగిందేమో!

మళ్ళీ వస్తుందిగా సంధ్య ముగియగానే కనుక్కుని చెప్తా

చీకటి

రాత్రి దేశపు” చక్రవర్తిలా “నిశ్శబ్దపు ఆసనాన్ని” అలంకరించింది చీకటి
లోకమంతటికీ తన భటులను పంపి అనంత అశ్వమేధాలు చేసింది
అశ్వమేధ హోమంలో వెలికి వచ్చిన సూర్యచుక్కను చేత పట్టి
రాజ్యమంతా “చుక్కల పందిరులు” వేయించి చల్లని “చంద్ర”సుమాలనందించింది
ప్రతీ క్షణం రాజ్యమంతా “స్వప్న గీతాలు” ఆలాపన చేయించింది

ఒకనాడు చుక్కలపందిరికి చిల్లులు పడ్డాయి
అవి కాంతిరేఖల పదునైన బాణాలు చేసిన గాయాలు
యజ్నాశ్వానికీ తగిలిందొక బాణం, గాయపడినా భారంగా సాగింది
ఎర్రబడింది చీకటి, ఉలిక్కిపడింది “రాత్రి దేశం”
ఊగిసలాడింది నిశ్శబ్దం , ఏమైంది సార్వభౌమం?
ఎందుకీ ధిక్కారం?

“రాత్రి” కోనల్లో దాగిన “శాంతి వజ్రాల” కోసమా ?
“నిశ్శబ్దపు ఆసనంలో” దాగిన “ప్రణయపు ముత్యాల” కోసమా ?
పందిరికింద రాలిన “చుక్కల” కోసమా ?

వర్షం పిలుస్తోంది

వర్షం పిలుస్తోంది

పెంకుటింటి కప్పు నుంచి ధారగా జారుతూ,
కప్పు కింద దాక్కున్న ముత్యాలంటి పిల్లలని రమ్మని పిలుస్తోంది
కాగితపు పడవలను తీసుకెళ్తూ, మరో పడవ పంపమని కవ్విస్తోంది
పిల్లలు నవ్వితే మురిసిపోయి మెరుపులతో సమాధానమిస్తూ
అంతలోనే పెద్దరికపు హోదాలో ఉరుముతూ
ఆశగా పిలుస్తోంది, స్వేచ్ఛగా తనతో కలిసి ఆడమని
మనసులో నిద్ర లేస్తున్న పసితనాన్ని
ఎవరూ చూడకుండా పెద్దరికపు హోదాలో నిద్ర పుచ్చుతూ పెద్దలు మనసులోనే స్పందిస్తున్నారు
వర్షంలోకి పిల్లల్ని వెళ్లమని నిద్ర నటిస్తున్నారు,
అంతలోనే నిద్ర లేచి చిరుకోపం ప్రదర్శిస్తున్నారు

వర్షం పిలుస్తోంది

కాదు కాదు, వర్షం ముద్దులు కురిపిస్తోంది
నా తల నుంచి పాదం వరకు వదలకుండా ముద్దిడుతోంది
అణువణువనూ తడుముతూ, క్షణానికో విధంగా కౌగలిస్తూ
కౌగిలింతల చినుకుల దుప్పటిలో నన్ను ముంచెత్తెతూ
ఏనాడూ పొందని అనుభూతిని అందిస్తూ
మెరుపులతో కన్ను గీటుతూ, ఉరుములతో నిట్టూరిస్తూ
రేగిన మట్టి వాసనలో ఒక మత్తును జల్లుతూ
శృంగార దేవతలా ముద్దులెన్నో కురిపిస్తోంది

వర్షం పిలుస్తోంది

నిద్రపోతున్న వాగులని, ఎండిపోతున్న చెరువులనీ
తనతో పరిగెత్తమని పిలుస్తోంది
రైతుకి మట్టి సువాసన అందించి చిందులేయిస్తోంది
తను కూడా రైతుతో కలిసి నవ్వుతోంది
ఆ నవ్వులు మెరుపులయ్యాయి,
మేఘ ఘర్జనలు ఉరుములయ్యాయి
పిడుగుల బాణాసంచా కాల్చి
కొత్త పంట వేయమని, ఏరువాక సాగమని
భూమికి పచ్చ కోక తొడగమని పిలుస్తోంది

వర్షం పిలుస్తోంది

సప్తస్వరాలతో శ్వాసించే వాగేయకారుడిని
తన లాంటి గీతాన్నాలాపించమని,
అక్షరాల వెంట పరిగెత్తే కవిని
తనను బంధించే కవిత్వాన్ని వదలమని,
పాదాలతో అధ్భుతాన్ని సృష్టించే నాట్యకారుడిని
తనతో కలిసి భువన వేదికపై ఆడమని
ఇంకా ఏమేమో చెప్తోంది, ఒక్కో చినుకులో ఒక్కో కధ

వర్షం పిలుస్తోంది


ఒక్కో మేఘం ఘీంకరిస్తూ
ఉరుముల నాదాలాపన చేస్తూ, మెరుపుల నాట్యం చేస్తూ
పిడుగుల తాండవం చేస్తూ
ప్రకృతితో మాట్లాడుతూ

వర్షం పిలుస్తోంది, పదండి వెళ్దాం