నీవు

నీ లోతుని కొలిచే గ్రీష్మం వస్తే,
ఎడారివై వేడి నిట్టూర్పులు శ్వాసిస్తావా?
సముద్రమై అలల నవ్వులు చిందిస్తావా?

నీ ఎత్తుని కొలిచే ఉప్పెన వస్తే,
మొక్కవై మునిగిపోతావా?
శిఖరమై ధిక్కరిస్తావా?

నీ వేడిని కొలిచే శీతలం వస్తే,
జలమై హిమమైపోతావా?
హోమాగ్నివై ప్రజ్వలిస్తావా?

నీ ధైర్యం కొలిచే చీకటి వస్తే,
తారవై సాక్ష్యం అవుతావా?
కిరణమై చీకటి చీలుస్తావా?

నీ బలం కొలిచే శిశిరం వస్తే,
దేహమై రాలిపోతావా?
ఆత్మవై కొత్త కావ్యం లిఖిస్తావా?

శత శశి వెన్నెలలు

శత శశిబింబాల వెన్నెలలో మెరిసిపోయే వింతను నేను

శత ఋతువులు ఏకకాలంలో అనుభవించే యోగిని నేను

శతరాగ గీతమాలిక నేను

 

శత చంద్రుల వెన్నెలలో నిశిపై గెలిచిన విజేతను నేను

శత యుగాలు క్షణకాలంలో చుట్టివచ్చిన ఆత్మను నేను

శతకావ్య మధురం నేను


శత సోమకాంతులతో అలరారే రారాజును నేను

శతసహస్ర క్షణాలు దాటలేని కాలాతీత క్షణాన్ని నేను

శతపద్మ వికసిత శోభ నేను

 

శత దిక్కులలో ఉదయించే ప్రభాతాన్ని నేను

శత కాలాలను శాసించే అనంతాన్ని నేను

శతపద నటవిన్యాసం నేను

మూడు అడుగుల్లో విశ్వరూపం, మూడు పదాల్లో ఆత్మశోధన - సిరివెన్నెల గారికి నా నివాళి

"చందమామ రావే జాబిల్లి రావే" అంటూ మొదటిసారి ఆయన పాట విన్నాను. ఆ పాట ఎంత చిన్నపిల్ల కోసం  పాడారో సుమారు అంతే వయసు నాది ఆనాటికి. కృష్ణుడు ఆడుకున్న బృందావనం నా కళ్ల ముందు ఉన్నట్టు అనిపించింది. నిజానికి అప్పటికి  ఆ పాట అర్ధం అయ్యి కాదు, ఎందుకో నా హృదయానికి అలా హత్తుకుంది. 

ఆ తరువాత ఒకసారి, మా నాన్న, ఆది బిక్షువు పాట గురించి గొప్పగా చెప్తూ పొంగిపోవడం చూసాను.

కొన్నాళ్ళకు కౌమారంలో ఒకసారి మా మాష్టారి ఇంట్లో, "అందెల రవమిది పదములదా" అంటూ టివి లో పాట వస్తుంటో హటాత్తుగా ఆయన మొహం ఆనందంగా వెలిగిపోవడం చూసాను. ఈ పాట అర్ధం ఏంటి అని అడిగి చెప్పించుకున్నా.

మరికొన్నాళ్లకు కాలేజీలో ఉన్నప్పుడు ఖడ్గం సినిమా చూసొచ్చాక, రోజుకు పది సార్లు "నువ్వు నువ్వు" పాట వినేవాడు మా కమల్ గాడు. నేను, సాయి "ఖడ్గం" పాటలో "కెంజాయ " అనే పదం అర్ధం ఏంటి అని చర్చించుకునేవాళ్ళం. 

"జాలిగా జాబిలమ్మ" అనే పాట విన్న ప్రతీసారీ నా మనసులో శివుడు వినాయకుడు బంధం గురించి ఈ దృష్టిలో చూడొచ్చా అని ఒక ఆశ్చర్యం.

"ఘల్ ఘల్ ఆకాశం తాకేలా" పాట వింటూ మురిసిపోయిన రోజులు ఎన్నో లెక్కేస్తే కాలెండర్ మారిపోతుంది.

జర్మనీలో కొన్ని రోజులు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక పాట రోజూ నన్ను "ఛలోరే ఛలోరే" అంటూ మంచు తెరలు తొలగిస్తూ ఉషోదయం తెచ్చేది.

వామనుడు త్రివిక్రముడై మూడు అడుగుల్లో లోకాన్ని కొలిచినట్టు,
ఈయన మూడు ముక్కల్లో జీవితాన్ని కొలుస్తారు.

ఆయనకు నా శతకోటి నమస్సులు !!!!

మారణ హోమం

చేయూతనివ్వక,
ఓదార్పునివ్వక,
సానుభూతి చూపక,
ఈ సమాజం ఏనాడో చచ్చింది

యమపాశం తగలక ముందే,
రుధిరప్రవాహం ఉండగానే,
మస్తిష్కం మథిస్తుండగానే,
శ్మశాన ప్రణయంలో మునిగిన సమాజం ఇది

రక్కస రాజుల అర్చనలో,
చితిమంటల హోమంలో,
కళేబరాల కౌగిట్లో,
మైమరిచిపోతున్న మృతసమాజం ఇది

ప్రళయంతో ప్రణయిస్తూ,
ప్రాణంతో కలహిస్తూ,
ప్రణవంతో విభేదిస్తూ,
భస్మమైపోతున్న అవివేక సమాజం ఇది

(కరోనా దాడిలో ఈనాడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే బ్రతికున్న శవాల మధ్య చచ్చిన శవాలు ఉన్నట్టు అనిపిస్తోంది. 

బాధ్యతలు మరచిన ప్రభుత్వాలు, బద్ధకం నిండిన ఉద్యోగులు, అపోహల్లో మునిగిపోయిన ప్రజలు. ఈ సమాజం ఏనాడో చచ్చింది. అక్కడక్కడా ఒక్కో జీవకణం మిగిలింది అంతే)

నీవు లేక

నీవు లేక,

ఎన్ని రాత్రులు ఒంటరిగా గడిపానో, 

ఎన్ని పగల్లు నిస్తేజంగా ఉదయించాయో,  

ఎన్ని మాటలు శూన్యంలో కలిసిపోయాయో , 


నీవు లేక,

ఎన్ని భావాలు ఆచూకీ లేకుండా పోయాయో,

ఎన్ని క్షణాలు యుగాలై నిలిచాయో,

ఎన్ని శూన్యాలు నన్ను మింగేసాయో,


నీవు లేక,

ఎన్ని సార్లు నా ఆచూకీ అన్వేషణ చేసానో,

ఎన్ని సార్లు భారంగా యుగాల ఎడారి దాటానో,

ఎన్ని సార్లు నన్ను నేను శిక్షించుకున్నానో,


నీవు లేక,

ఎన్ని సార్లు నా అన్వేషణలు శూన్యాన్ని చూపాయో,

ఎన్ని సార్లు ఎడారి దారుల్లో హిమానదాలు కవ్వించాయో,

ఎన్ని సార్లు నా శిక్షల ఆకలి తీరలేదో!!


ఎవరు నీవు,

నీవు బందం అయితే నేను అనాధని,

నీవు జ్ఞానం అయితే నేను అజ్ఞానిని,

నీవు పరమాత్మ అయితే నేను జీవిని.

ఇక నేను లేను

 సముద్రమంత ప్రేమ
        వర్షమై నన్ను తడిపేస్తే 

ఎడారంత విరహం
        గ్రీష్మమై నన్ను కాల్చేస్తే 

కాలమంత ఎడబాటు
        క్షణమై నన్ను కమ్మేస్తే 

జీవితమంత వాస్తవం
        మాయలా నన్ను ముంచేస్తే

అమావాస్య చీకట్లో వెన్నెల


అమావాస్య చీకట్లో
వెన్నెల నా కోసం ఎదురుచూసి అలసిపోయింది
అమావాస్య చీకట్లో
నేను వెన్నెల కోసం వెతుకుతున్నాను

అమావాస్య జోలలో
వెన్నెల కలలు కంటోంది, ఆ కలల నిండా నేనే
అమావాస్య జోలలో
అలసిపోయిన నేను కలలు కంటున్నాను, నా కలలన్నీ వెన్నెలలోనే
 
నిరాశ గుప్పిట్లో
ఆశ ఎదురు చూస్తోంది ధీరుని కోసం
నిరాశ గుప్పిట్లో
ఆశ కోసం పోరాడుతున్నాను ధీరుడినై

గరళం

గరళాన్ని నేను
నా ఆకలి అనంతం
నా ఉపవాసం నిరంతరం

గరళాన్ని నేను
నా జననం మధనం
నా మరణం జీవనం

గరళాన్ని నేను
నా విస్తృతి అనంతం
నా స్వేచ్ఛ ప్రళయం

గరళాన్ని నేను
నా శక్తి అద్భుతం
నా సంకెళ్ళు ఘనం

గరళాన్ని నేను
నా మిత్రుడు హరుడు
నా శత్రువు హరుడు

నిన్నటి నేను - రేపటి నేను

నిన్నటి నేను ఒక ఆశ్చర్యం
రేపటి నేను ఒక విస్మయం

వెనుదిరిగి చూస్తే,
నిన్నటి నేను నేటి నాకు ఒక కొత్త పరిచయం
ముందుకెళ్ళి చూడబోతే,
రేపటి నేను నేటి నేను సృజించే విచిత్రం

చరిత్ర తవ్వితే,
నిన్నటి నేను అనేక భావాల భాండాగారం
చరిత్ర రాస్తుంటే,
రేపటి నేను నేటి నేను నిర్మిస్తున్న సౌధం

నేను ఎవరు అంటే,
నిన్నటి నా సమాధానం నేటి నేను
నేను ఎవరు అని అన్వేషిస్తే,
నేటి నా సమాధానం రేపటి నేను

కాలం ఆడే ఆటలో
నిత్యం మారే మనిషిగా
ఈ జీవన పయనం

------------
Me from yesterday is a surprise
Me from tomorrow, an amazement

Retrospecting self,
Me from yesterday is new introduction
Looking forward,
Tomorrow's Me is an invention by today's Me

Reading own history,
Yesterday's Me is a treasure of many feelings
Writing own history,
Tomorrow's Me is a Castle being built by today's Me

Who are you,
Response of Yesterday's Me is Today's Me
Searching for Me,
Response of Today's Me is Future Me

In the game played by time,
My journey is a man ever inventing self better and better

వైకుంఠపురం - ఓం నమో భగవతే వాసుదేవాయ

ఎక్కడ మొదలు ఈ స్థితికి?
సహస్ర స్థితుల సమ్మేళనం ఇది
సహస్ర అస్తిత్వ నిమజ్జనం ఇది

దిక్కులు ఎన్నలేని  ప్రదేశం అది ,
ఎటు చూసిన తూరుపు రేఖలే
కోటి సూర్యప్రభలు ప్రజ్వలిస్తుంటే 
సహస్ర సూర్యులు పరిభ్రమణం చేస్తున్న మహాదిత్య లోకం అది

ఏ క్షణమో కొలవలేని కాలంలో,
కాలమే మాయాపాశంలో ఇరుక్కున్న కాలంలో,
జననమేదో మరణమేదో తెలియని చిద్విలాసం అది

ఈ ప్రదేశం, ఈ కాలం, ఈ స్థితి, 
ఇవి ఏ భావంతో తాదాత్మ్యత చెందుతాయో చెప్పలేని సమ్మోహనం

అనంతమై తాను హసిస్తుంటే, 
శూన్యం శూన్యంలో దాగింది

కిరణమై తాను ప్రకాశిస్తుంటే,
చీకటి చీకటిలో మిగిలింది 

ఎటు చూసినా తానే  అయి, 
అన్ని దిక్కులూ విస్తరించిన విశ్వరూపమది

"విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః"