దూరాన నిలిచింది దీప శిఖరం.. మరో దిక్కున అంతు తెలియని
కారు చీకట్ల విలయ తాండవం
దీప శిఖరమువైపు అడుగెయ్యబోతే చీకటిన
నా పాదాలనేదో ఆపింది,
ఆపి తన చేతులు జాపింది, చీకటిలోనికి ఆ చీకటి లోకానికి పిలిచింది
కన్నులు మరల్చలేని అందమే అయినా నా
కన్నుల చీకటి పొర కమ్మింది, తడబడుచున్నవి అడుగులు
కన్నులు చూపని దారిని వెతుకుతూ
ఎంత తిరిగినా ఆ శిఖరం దరి చేరదు
ఈ తామసి నను వదలదు
ఏ తోవన పోవాలో, ఈ దూరాన్ని ఎలా తుంచాలో
అరె, ఇదేమి నేను మొదలిడిన చోటుకే మరలా వచ్చితిని
హరీ, ఇది రేఖా యానమా, వృత్త పరిభ్రమణమా
దారేది, నన్ను పిలుచు దీప కళికను చేరేదెలా
క్షణము ఆగి లంబ కోణమున అడుగు వేసా
గణించ వీలు కాని శక్తులు నిరోధించ
రణమున ఏకాకినైతినా?
ధిక్, నన్నే ఆపు శక్తులా అనుకున్న క్షణమే రెట్టింపాయే
కానరాని నా విరోధములు, దీపమునే చూచుచూ
కనులు మూసి అడుగు వెయ్య
ఒక్కొక్కటిగా రాలిపోయె విరోధములు
రక్కసి చెర నుండి విముక్తి వచ్చేనేమో
రక్కసే మరో రూపు దాల్చెనో,
మరో మారు ఏదో ఆపింది
దూరానున్న దీప కళిక
చిరునవ్వులు చిందిస్తోంది
ఇదిగో మరో మారు అనంత వృత్తంలో ప్రవేశించా
దేదీప్యమైన దీప శిఖరమేనా కన్పించని
కేంద్రము, ఈ జీవిత గమ్యము
మరెన్ని సుడులో ,
మరెన్ని మలుపులో
పరిధిని కుదించి కేంద్రమును చేరుట
కొరకేనా జీవనము? ...
ఇంద్రియాల బంధనాలు చీకటులు
ఆ దేవుని చూపులు దీప కళికలు
ఆ చూపును చేరునంతలో అంతు తెలియని అనంత వృత్త పరిభ్రమణాలు