ఐంద్రజాలిక గంధర్వ ఊసరవెల్లి

వెన్నెల వెలుగుల మాటున దాగి ఏ మూల నక్కాయో వన్నెల సప్తవర్ణాలు,
సూరీడి కంటిచూపు తగలగానే మత్తు వదలి ముందుకు దూకాయి ఒకదాని వెంట మరొకటి
చివరన దూకింది ఎర్రని ఎరుపు,
వెన్నెల వెలుగులు ఉదయపు కాంతులుగా మారాయి
ఆకాశం ఊసరవెల్లా ???

కీచురాళ్ళ రణగొణ ధ్వనులు ... కోయిల కుహుకుహులు
రాగభ్రంశం క్షణంలో సుస్వర గానహేల
ఎవరా గొంతులు మార్చిన గంధర్వుడు

అమాస రాత్రి కవ్వించిన చుక్కలు ఏమయ్యాయి
నీలిమేఘాల చాటున నక్కి మాయమై, భువిన పువ్వులై పూచాయా...
ఆ చుక్కల రేడు చంద్రుడు
ఈ పువ్వుల తోడు సూరీడు ... ఎవరి ఇంద్రజాలమో

రాగం నిశ్శబ్దమై నిశీధి నీడలో సేద తీరిందేమో
నల్లని కోయిల గొంతులో పొంగే గంగవోలె ముందుకు దుమికింది

తామసి చేసిన వికటాట్టహాసం, సూరీడి కంటి చూపుకు జడిసి నిశ్శబ్దమై మిగిలింది
రాగభ్రంశము సుస్వర హేలయై పాడింది
రంగురంగుల చిత్రం ఆ ఆకసం.. కుంచె పట్టిన ఆ చిత్రకారుడెవడో

ముందు రేతిరి కన్నీళ్ళు, మునిపంటి బిగువున దాగిన బాధలు, నిన్నటి జ్ఞాపకాలు
నేటి ఉదయపు హిమబిందువులు, గొంతెత్తి పాడే ఉదయరాగాలు రేపటి ఆశాజీవన నిచ్చెనలే
నా నెచ్చెలులే

(నెల క్రితం తెలవారుజామునే నేను చూసిన అందాలకు అక్షర రూపం...)

9 comments:

కొత్త పాళీ said...

బావుంది

Jyothsna Palwai said...

చాలా బాగుంది. ఇంకా ఇలాంటివి ఎన్నో వ్రాయలని ఆశిస్తున్నాము

మరువం ఉష said...

నక్కిన వర్ణాలే ఉదయ కాంతులు
దాగిన తారలే భువిన పుష్పాలు
సద్దుమణిగిన రాగాలే ఉదయ సుస్వరాలు
రేయింబవళ్ళ ఈ రాగహేల జీవితాన ఆశాజ్వాల... మీ మాటల్నే మీకు అప్పజెప్తూ ఉదయపు అందాలు మీ కంటితో నేను చూసివచ్చాను మళ్ళీ...

Unknown said...

కొత్తపాళీ గారు,
ధన్యవాదాలు
జ్యోత్స్న గారు,
ప్రయత్నిస్తాను. అంతవరకు నేను రాసిన పాత కవితలు చదవండి.
ఉష గారు,
నేను చిందరవందరగా పెట్టిన పదాలను ఒక క్రమంలో అందంగా పెట్టారు. ఉదయపు అందాలను ఒకసారి మీ కంటితో కూడా చూడండి. ఉదయం నాలుగింటి నుంచి ఆరింటివరకు చూడండి. ప్రకృతి చేసే వింతలు బోలెడు కనిపిస్తాయి.

Dileep said...

I'm not finding time.

మరువం ఉష said...

Pradeep, I am either awake in bed or off of the bed already most mornings at 5am and watch the sun rises and dwell over life in general at a different perception than the mundane. Most of my kavitalu come at that hour [though get to posted as time permits]. Thanks I will continue it and am sure you too.

Anonymous said...

అద్భుతంగా సెలవిచ్చారు.

>>అమాస రాత్రి కవ్వించిన చుక్కలు ఏమయ్యాయి
>>నీలిమేఘాల చాటున నక్కి మాయమై, భువిన పువ్వులై పూచాయా...
>>ఆ చుక్కల రేడు చంద్రుడు
>>ఈ పువ్వుల తోడు సూరీడు ... ఎవరి ఇంద్రజాలమో

ఆ ఇంద్రజాలం భగవంతుడిది. ఈ చక్కని కవిత మాత్రం మీ ఇంద్రజాలం. కీప్ ఇట్ అప్.

Unknown said...

సాయి ప్రవీణ్ గారు,
భగవంతుడే ఆ ఐంద్రజాలికుడు,
ఆ గంధర్వుడు
ఆ ఊసరవెల్లి
-- ఈ కవితకు ప్రేరణ మాత్రం ఆయనే కాదా... మరో ఇంద్రజాలం కూడా ఆయనే చెయ్యలేదా

Anonymous said...

మీరు చెప్పినదానితో నేను ఏకీభవిస్తున్నాను. కర్త, కర్మ, క్రియ అన్నీ ఆ దేవదేవుడే. మనము ఆయన చేతులలో కేవలం కీలు బొమ్మలు మాత్రమే.