హృదయగాధలు

నదికెన్ని పాయలో‌
హృదయానికెన్ని గాధలో‌
ప్రతి వేణి గమ్యమూ ఒకటే‌, ప్రతి గాధకూ ముగింపొకటేనా?

నది చేరని తీరం
మదిలో‌ తీరని కాంక్ష
ఆ తీరానికి నదిని తరిమేది ప్రళయం, మరి ఈ కాంక్షను తీర్చేదేది ?

ప్రతీ మలుపులో‌ దాగిందో‌ సుడి
ప్రతీ అడుగులో‌ దాగిందో‌ మలుపు
తీరానికి కానరాని అంత్:మధనాలు, హృదయాంతరమున దాగినదేమిటో‌

ఏనాటి ఆనందభాష్పాలు,
ఎచ్చటి వేదనరోదనభాష్పాలు
నది నిండా నీరే‌, ఆనందం దాగిందో వేదన నిండిందో‌ హృదయములో‌, ఎవ్వరు చెప్పగలరు

ఉప్పెనలెన్నైనా మారని సంద్రం‌
కాలగమనమేదైనా చలించని విధి
నది గమ్యం‌ దొరికింది, మరి హృదయ గాధల ముగింపు?

ఏమి భావమో ఇది

ఆనందభాష్పాలు కావు
వేదనరోదనలా !కాదు
ఆనందానికి వేదనకూ నడుమ ఏమిటిది? శూన్యమా??‌

ఎగిసే అల కాదు
కరిగే కల కాదు
అలా ఎగిసి అంతలోనే కరిగి , తెలియని భావమిది!

ప్రపంచపు ఉనికి తెలియలేదు
వేసే అడుగు తడబడలేదు
ఆకసంలో‌ తేలుతూ నేలపై నడుస్తూ , ఏమి స్థితి ఇది?

విజయము కాదు
అపజయమూ కాదు
గెలుపుకూ ఓటమికీ నడుమ, కోరికలేని క్షణమా ఇది

అనిర్వచనీయమీ అనుభూతి
క్షణకాలమైనా అనంతంలా నిలిచే ఆకృతి ఇది
శూన్యంలా గోచరిస్తూ అనంతంలా హృదయంలో నిలిచిన భావమిది