చేతి గీతలు

చేతి గీతలు నా భవిష్యత్తు చెప్తాయన్నారెవరో
హస్త రేఖలు బాగుంటే పట్టినదంతా బంగారమన్నారు మరెవరో
 
 
ఏమో అది నిజమో కాదో నాకు తెలీదు
నిజమేనా అని దేవుడినే అడిగా, చెప్పాడు అవి ఏమిటో
వెంటనే పరిగెత్తికెళ్లి అమ్మనడిగా నిజమేనా అని ?
అమ్మ నవ్వి తన చేతిలో రేఖలు చూపించింది.
 
 
దేవుడేమి చెప్పాడని జాతకనిపుణులు అడిగారు

నేను బిందువుగా అమ్మ కడుపులో చేరి
దాన్నించి ఎప్పుడు బయటకొద్దామా అని
కడుపు బంధిఖానా అనుకుని తన్నేవాడినట
తన్నిన ప్రతిసారీ దేవుడు నా అరచేతి మీద కొట్టేవాడట
ఆ దెబ్బలే ఇప్పుడు రేఖలుగా మిగిలాయట

బిందువై మొదలై బాంధవ్యాలు పెంచుకుని
అవి తిరిగి తెంచుకుని బూడిదిలా మారే వరకు
ఆ తొమ్మిది నెలలను గుర్తు పెట్టుకోమని ఇచ్చిన చేతి గీతలట

అవునేరీ ఆ జాతక నిపుణులు? బహుశా అమ్మ దగ్గరికెళ్ళారేమో?