అస్థిత్వం

తలనిండా బరువెక్కిన అగ్గిపుల్ల,
తలను రాపాడిస్తూ పరిగెట్టింది
అగ్నిహోత్రుని సమిధగా మారి బూడిదగా మిగిలింది

నీటి కుండ నల్లమబ్బు,
కొండను డీకొట్టి ఉరిమింది
చినుకుగా కరిగి జలపాతంలో సమాధి అయ్యింది

గాలి నింపుకున్న బుడగ,
తేలితేలి నేల మీదకు దుమికింది
ఒళ్లంతా తూట్లు పడి వాయుతర్పణం అయ్యింది

చెట్టుకు దుప్పటి కప్పింది తొలి మంచు,
నిద్ర లేచి ఒక్కసారి ఒళ్లంతా విచ్చుకుంది చెట్టు
జారిపడి ఆకసంలో తేలిపోయింది

మట్టి ముద్ద మనిషి,
ధిక్కారపు స్వరం చేస్తూ పైపైకి ఎగిరాడు
నేల వెతుక్కుని మట్టిలో కలిసాడు 

విహంగపు సొగసులు

సూరీడేడని వెతికేస్తూ 
మబ్బు కొండలలో సొరంగమొకటి తవ్వుకుని 
గాలి చీల్చుకుని బాట మలుచుకుని
వర్షపు చినుకుల పైపైన అడుగులు వేస్తూ 


చుక్కలనన్నీ రెక్కల మాటున పట్టేస్తూ
మెరుపుల లోగిలిలో మెరుపై కదులుతూ
మేఘగర్జనకు శృతి కలుపుతూ 


నేలనంతా తన నీడతో కొలిచేస్తూ
వాయుపాతపు హొయలను చదివేస్తూ
విశ్వవర్ణ సుమాలను ఏరేస్తూ

హద్దులు చెరుపుతూ
పైపైకి ఎగిరింది విహంగం, విమానం 


("వాయుపాతము" అనే పదం జలపాతం లాంటి అర్ధంలో వాడినది. ఈ పదానికి వేరే అర్ధం ఉందా అన్నది నాకు తెలియదు)

రవి కాంచనిదేదో నటనమాడెను

హద్దులు ముక్కలు చేస్తూ ఘర్జనతో భయాన్ని భయపెడుతూ 
తానే చక్రవర్తినని ప్రకటిస్తూ
కాళ్ళను పట్టిన సంకెళ్ళను తెంపుకుని లంఘించినదొక సింహం

మబ్బులు గొడుగు పడుతుంటే
కొంగ్రొత్త కాంతితో వికసించెను ఉదయం
మునుపెన్నడూ తెలియని వర్ణంలో మెరిసెను వసంతం


అద్దం తెలుపని అందమేదో చూపింది ఎదనయనం 
కలం పలుకని పదమేదో పాడింది గీతం
రవి కాంచనిదేదో నటనమాడెను వేలికొన చివరన

ప్రకృతి చూపని పారవశ్యం పొందింది హృదయం
నిర్జన నిర్జీవ ఎడారిలో నిండింది జీవం
ప్రపంచమెరుగని ప్రదేశం వెలిసింది నవ విశ్వమై