శూన్యం నుంచి శూన్యంలోకి

మన మధ్య బంధం శూన్యం, మన మధ్య పరిచయం లేని రోజులలో
మన మధ్య దూరం శూన్యం, మనం కలిసి జీవించిన రోజులలో
మన మధ్య మాటలు శూన్యం, అలిగిన వేళలలో
మన మధ్య రహస్యాలు శూన్యం, ఈ జీవనప్రయాణంలో

మన పరిచయం శూన్యాన్ని చేధిస్తే
అది మరొక శూన్యాన్ని సృష్టించింది

మన కలయిక శూన్యాన్ని బద్దలుకొడితే
అలక రూపంలో మరో శూన్యం దూరింది

మన ఊసులు శూన్యపు చీకటిలో వెలుగులు నింపితే
మరో శూన్యమేదో శోకదేవతలా పరుగున వస్తూ కనిపించింది
ఆ శూన్యం నుంచి దూరమవ్వాలని మొదలయ్యింది మన పరుగు
శూన్యం నుంచి శూన్యంలోకి
ఏ దరిన చేరుస్తుందో ఈ శూన్యం

శూన్యపు బిగ్ బాంగో లేక శూన్యపు బ్లాక్ హోలో
బిగ్ బాంగ్ అయితే మన కోసం పాలపుంత ఇల్లు కడతా
బ్లాక్ హోల్ అయితే.......మరో శూన్యంలోకి తీసుకువెళ్తా...
అక్కడి నుంచి మన ప్రయాణం మళ్ళీ మొదలుపెడదాం...
నా తోడుంటావా ప్రియతమా.....

(ఆ మరో శూన్యం ఏదైనా కావచ్చు,  
వ్యక్తి తీసుకునే రిస్కీ డెసిషన్ కావచ్చు
లేదా శ్లోకాన్ని సృష్టించిన శోకం కావచ్చు
లేదా..... )

శిలాజం ఆత్మకధ

గెలుపు నాదే... నేనే విజేతను
వెంటనే అద్దంలో నా ముఖం చూసా
నన్ను చూసి నేనే మురిసిపోయా...
గర్వాతిశయంలో మునిగిపోయా

ఒక కొండను ఎక్కిన అనుభూతి,
అది చిన్న గుట్టేనని తెలియడానికి ఎన్నో క్షణాలు పట్టలేదు
నా ముందు మరో పర్వతం కనిపించింది
పర్వతాన్ని అధిరోహిస్తూ అనుకున్నా
ఈ పర్వతానికి సరైన బాట లేదే అని

ఆ పర్వతాన్నెక్కుతూ బాటను పరిచా
అది రాళ్ళ బాటే,
నా వెనుక వచ్చే వాళ్ళు దాన్ని పూల బాట కాకపోయినా
మట్టి బాటైనా చెయ్యరా అని నమ్మకం

ఇంతలో నేనెక్కుతున్న పర్వతం అగ్ని పర్వతమని తెలుసుకున్నా
అది ఏ క్షణాన్నైనా పేలవచ్చు
తనలో దాచిన లావాను నేను పరచిన బాటను కప్పివెయ్యవచ్చు
ఎలాగూ కాలి బూడిదవుతానని నా ఆరోహణను ఆపివేసా

అక్కడే ఒక గుడిసె కట్టుకుని నేను దాటిన గుట్టలు చూస్తూ ఆనందించా
ఒక రోజు ఆ లావా చిమ్మింది
తప్పించుకోలేక శూన్యంగా చూస్తూ శిలాజంలా మిగిలిపోయా

ఇప్పుడు చూసుకుందామంటే ఆనాటి అద్దం లేదు
అద్దంలో చూసి ఆనందించ శిలాజానికి ప్రాణం లేదు

కానీ కొన్నేళ్ళకు, ఎవరో వచ్చారు.. నేను కట్టుకున్న గుడిసెను చూసారు
నేను పరచిన బాటను కనుగొన్నారు
వీరు నాలాగ ఆగిపోలేదు,
చిమ్మే లావాను వెతుకుతూ ముందుకు సాగిపోయారు
ఆ లావా వారి సంకల్పానికి చల్లబడింది
వారి బాటకు ధృడపునాదిగా మారింది

అదేమిటో వాళ్ళు కూడా ఒక రోజు అద్దాన్ని చూసారు,
గర్వపడ్డారు, ఈసారి వారున్నది మంచుకొండ
అది కరగడానికి సిద్దంగా ఉంది...

ఒంటరితనమా.. నీ చిరునామా ఏదమ్మా...

వంద మంది మధ్యలోనున్నా, ఇదిగో నేనిక్కడంటూ పలకరిస్తావు...
ఒక్కడినే ఉన్నప్పుడు రమ్మన్నా రావు, ఊహాలోకంలో తేలిపోతున్నావుగా అని వెక్కిరిస్తావు
బాధలో మునిగి ఉంటే పరిగెట్టుకొస్తావు, నాకు సానుభూతి చెప్పేవాళ్ళను చూసి పారిపోతావు
నా బాధలు తృప్తిగా వినేది నీవేనని తెలిసినా
ఆనందంగా ఉన్నప్పుడు నా మనసుతో ఆటలాడుతుంటావు,
నాతో ఆనందం పంచుకునేవారిని చూసి బహుదూరం నుంచే వీడ్కోలు చెప్పి పోతావు

నేనోడిపోయినప్పుడు నా తప్పులు నాకు గుర్తు చేస్తావు,
కానీ ఆ తప్పులు వింటానా... ఓటమి బాధలో చెవిటివాడినయ్యాను కదా
నే గెలిచినపుడు జాగ్రత్తలు చెప్ప చూస్తావు
కానీ ఆ జాగ్రత్తలు పాటిస్తానా... గెలిచిన మదంలో వింటానా

నాకు బాధ వచ్చినా ఆనందం వచ్చినా
నేను గెలిచినా ఓడినా
నా కళ్ళు నీ కోసం వెతుకుతాయని తెలిసీ
నీతో కలిసి నా అనుభూతులు పంచుకోవాలని ఎదురు చూస్తానని తెలిసీ
నే రమ్మన్నా రావు
తీరా వచ్చాక పొమ్మన్నా పోవు

ఆ పరమేశ్వరుని సృష్టిలో ఏ ప్రాణీ ఒంటరి కాదు, ఒకరికి ఒకరు తోడంటూ
నీవెన్నడూ ఒంటరి కావని వెక్కిరిస్తూ
నాతో దోబూచులాడతావు
ఇదిగో అని పట్టుకుంటే,
అంతలో ఏ గాలినో పంపిస్తాడు ఆ ఈశ్వరుడు నిన్ను తరిమెయ్యమని
ఆ గాలి నా ప్రియురాలి కురులలోని పువ్వుల పరిమళాన్ని మోసుకొచ్చి
నన్నే నీ నుంచి దూరమయ్యేలా చేస్తుంది

ఒంటరితనమా... నీ చిరునామా ఏదమ్మా?

అతడు తూర్పు ఆమె పడమర

వారు కలిసిన రోజు అద్భుతమే,
అవును అసలు వారు విడిపోయిన రోజేది ?
వారు కలసి జీవించని రోజేది?

సాయంత్రపు వేళ
ఆమెపై ఎర్రని రంగుని చల్లాడు
అది ఆమె బుగ్గపై సిగ్గుగా ప్రకాశించింది
చుక్కల పాన్పును పరచి చల్ల గాలితో సందేశమంపింది
అతనిపై మంచుతెరలు కప్పింది

మౌనం వారి మద్య పాటలు పాడింది
వారి హృదయాల ఊసులలో రాత్రి తెల్లవారింది
అతను మౌనంగా ఎర్రబంతిని ఆమె వైపు విసిరాడు
వారి మధ్య మౌనాన్ని చేధిస్తూ అతని సందేశాన్ని మోసుకెళ్ళింది
ఆ ఎర్రబంతి వెలుగులు విరహపు సెగలతో ఆమెను చేరాయి,
ఆమె కనుల మధ్య నుదిటిపై కాంతిగా నిలిచాయి
ఆమెను చేరిన ఆ విరహపు సెగలు చల్లబడ్డాయి
చల్లని వెలుగుగా వెన్నెల కురిపించాయి

అతను తూరుపు ఆమె పడమర
వారి మధ్య మౌనం కూడా పాటలు పాడుతుంది
మౌనం కూడా రాగమే కదా
అనంత జీవన సంగీతానికి నిశ్శబ్దం కూడా అందమే
రణగొణ ధ్వనులు కూడా వారి యాత్రలో ఆనందభైరవి రాగాలే
వారి ప్రేమ భాషకు అందనిది, లెక్కలకు లొంగనిది

వారి మనసుల దూరం శూన్యం
తనువుల దూరం అనంతం
ఆ దూరాన్ని తగ్గిస్తానని వారిని కలపడానికి కాలం పరిగెడుతూనే ఉంది
ఆ కాలం పరుగులో నేనొక చిన్ని రధచక్రాన్ని
వారి అనంత ప్రేమకు నేను కూడా సాక్షినే

నిమిత్త మాత్రుడిని నేను (???)

( మరువం ఉషగారు రాసిన కవితకు నా సమాధానం )
ఏమో ఎప్పటికి సమకూరేనో ఆ శాంతియుత సహగమనం
రక్తపుటేరులలో ఈతకొడుతూ అదే విజయమనుకున్న అశోకుని మనసు 
కూడా మారింది, శాంతియుత మార్గాన పయనించింది.
నేడు అలాంటి వాళ్ళు ఎంతో మంది, వారిలో అశోకుడయ్యేవారెంతమంది
అలెక్జాండర్ లా రాలిపోయేవాళ్ళే ఎక్కువ మంది
అలనాడు ఒక్కడిదే విలయతాండవం
నేడు ప్రతి ఒక్కరిదీ విలయతాండవమే,
చేసేది చిన్న తప్పే అనే నిర్లక్ష్యం
నేడు ఇలా టైప్ చేస్తున్న ప్రతీ క్షణమూ నన్ను హెచ్చరిస్తూనే ఉంది,

నేను కూడా ఆ కాలుష్యపు చక్రానికి ఇరుసునేనని
నిమిత్త మాత్రుడిని నేను,
కానీ నేను చేసే ప్రతీ పని నా అనుమతి లేనిదే జరగదనీ తెలుసు
నిమిత్త మాత్రుడిని నేను

గాంధీలా ప్రభావితం చెయ్యలేను
వివేకానందునిలా వివేకాన్ని వెలిగించలేను
భగత్ సింగ్ లా ప్రభుత్వానికి ఎదురు తిరగలేను
చంద్రబోస్ లా సైన్యాన్ని తయారు చెయ్యలేను
నిమిత్త మాత్రుడిని నేను

మదర్ థెరెసా లా ఆడంబరలాను వదలలేను
రామకృష్ణ పరమహంసలా ఆధ్యాత్మిక దీపాలు వెలిగించలేను
బాబా ఆమ్టేలా సేవలు చెయ్యలేను
శ్రీశ్రీలా రక్తాన్ని మరిగించలేను
నిమిత్త మాత్రుడిని నేను

జీవితంలో కష్టాలు ఎదురైతే దారి మార్చుకుంటాను
అన్యాయం ఎదురైతే న్యాయానికి ముసుగేస్తాను
అధర్మపు నీడలో ధర్మాన్ని దాస్తాను
అసత్యపు తోటలో సత్యానికి సమధి కడతాను
నా సుఖం నాకు ముఖ్యం, ప్రకృతి కష్టంతో పని లేదు
నిమిత్త మాత్రుడిని నేను

స్వర్గానికి వెళ్ళాలనుకునే ప్రతీ ఒక్కరిలో నేనూ ఒకడినే
స్వర్గానికి తీసుకెళ్ళే చావు ఎదురైతే తప్పించుకుపోయే పిరికివాడిని
మార్పు కావాలి, ప్రపంచం మారాలని ఉపన్యాసాలిస్తాను
ఆ మార్పు నాతో మాత్రం మొదలుకానివ్వను
నిమిత్త మాత్రుడిని నేను

గనులను తవ్వి భూకంపాలకు కారణమంటూ నిందించే నేను
ఆ గనులనుండి వచ్చిన లోహపు ఆభరణాలు లేనిదే బయటకు రాను
ఆ గనుల ఖనిజాలతో కట్టిన ఆకాశహర్మ్యాలలో నుండి కాలు బయటకు మోపను
నిమిత్త మాత్రుడిని నేను

ఆ మార్పుని నాతో మొదలుపెట్టగలిగే నాడు
నాలో ధైర్యానికి సంకల్పమనే ఖడ్గాన్ని ఇవ్వగలగిన నాడు
సత్యాన్ని వెలికి తీసి సత్యపు మంటలో నన్ను కాల్చుకున్న వేళ
నేను ఆ జగన్నాధ రధ చక్రపు ఇరుసునవుతా
నిమిత్త మాత్రుడిని కాను నేను

సర్వశక్తి సంపన్నుడను,
ఆ సర్వశక్తులనూ దేహసుఖాల బాటనుండి పక్కకు మల్లిస్తా
ఆ పక్కనే దుమ్ము పట్టిన ఆత్మానందపు బాటపై పయనిస్తా
నన్ను నేను ఆవిష్కరించుకుంటూ
నాతో ఒక సైన్యాన్ని తయారుచేస్తా
నిమిత్త మాత్రుడిని కాను నేను