అద్దం నవ్వింది

కళ్ళు వర్షం కోసం ఎదురుచూస్తున్నాయి
ఆకసపు వర్షం కాదు, మానస వీణ కురిపించే వాన
ఆనందంగా దు:ఖాన్ని ఆస్వాదించే కోరిక
కలకలపరిస్తూ నవ్వు వినిపించింది,
వెనుదిరిగి చూస్తే శూన్యం... కళ్ళ వెనక బాధ కూడా శూన్యమయ్యింది

ఒడలు పవనం కోసం ఎదురు చూస్తోంది
మారుతంతో వచ్చే పవనం కాదు, మానస వృక్షం వీచే పవనం
నిస్వార్ధంగా విజయాన్ని ఆస్వాదించే కాంక్ష
గలగలా నవ్వు తెరతెరలుగా వచ్చింది,
ఎవరో తెలియదు మరి....పులకరిస్తున్న ఒడలు వాస్తవాన్ని గుర్తించింది

చేతులు అగ్నిని బంధించి ముందుకు దూకాలని ఎదురుచూస్తున్నాయి
హవనుడి అగ్ని కాదు, మానసమే హవిస్సుగా ఎగిసిన జ్వాల
క్రోధంతో పర్వతాన్నైనా డీ కొట్టే అంధత్వం
హెచ్చరికగా నవ్వు వినిపించింది
ఎవరిదా హెచ్చరిక....ఆవేశం ధైర్యంగా మారి కర్తవ్యాన్ని గుర్తించింది

కాళ్ళు ఆకసంలో విహరించాలని ఎదురుచూస్తున్నాయి
తలపైని ఆకసం కాదు, హృదయాకాసం
కోరికల గుర్రాల సవారీని ఆకాశమార్గానికి తీసుకెళ్ళే దురాశ
వెక్కిరిస్తూ నవ్వు వినిపించింది
ఏమా వెక్కిరింత, కోరికల గుర్రాలను భూమిపైనే ఆపమనేగా

శరీరం భూమిని ముద్దాడాలని చూస్తోంది
ఇది నిజమైన భూమే,
మరణంతో మానసానికి విముక్తినివ్వాలి
ఏ నవ్వూ వినిపించలేదు

ఆ నవ్వు వెతుకుతూ సాగాను, మరణాన్ని జయించా (?)
అడ్డంకులు వెతుకుతూ సాగితే ఒక అద్దం కనిపించింది
నవ్వుతున్నది మరెవరో కాదు, నా ప్రతిబింబమే... నా అంతరాత్మే