శత శశి వెన్నెలలు

శత శశిబింబాల వెన్నెలలో మెరిసిపోయే వింతను నేను

శత ఋతువులు ఏకకాలంలో అనుభవించే యోగిని నేను

శతరాగ గీతమాలిక నేను

 

శత చంద్రుల వెన్నెలలో నిశిపై గెలిచిన విజేతను నేను

శత యుగాలు క్షణకాలంలో చుట్టివచ్చిన ఆత్మను నేను

శతకావ్య మధురం నేను


శత సోమకాంతులతో అలరారే రారాజును నేను

శతసహస్ర క్షణాలు దాటలేని కాలాతీత క్షణాన్ని నేను

శతపద్మ వికసిత శోభ నేను

 

శత దిక్కులలో ఉదయించే ప్రభాతాన్ని నేను

శత కాలాలను శాసించే అనంతాన్ని నేను

శతపద నటవిన్యాసం నేను

మూడు అడుగుల్లో విశ్వరూపం, మూడు పదాల్లో ఆత్మశోధన - సిరివెన్నెల గారికి నా నివాళి

"చందమామ రావే జాబిల్లి రావే" అంటూ మొదటిసారి ఆయన పాట విన్నాను. ఆ పాట ఎంత చిన్నపిల్ల కోసం  పాడారో సుమారు అంతే వయసు నాది ఆనాటికి. కృష్ణుడు ఆడుకున్న బృందావనం నా కళ్ల ముందు ఉన్నట్టు అనిపించింది. నిజానికి అప్పటికి  ఆ పాట అర్ధం అయ్యి కాదు, ఎందుకో నా హృదయానికి అలా హత్తుకుంది. 

ఆ తరువాత ఒకసారి, మా నాన్న, ఆది బిక్షువు పాట గురించి గొప్పగా చెప్తూ పొంగిపోవడం చూసాను.

కొన్నాళ్ళకు కౌమారంలో ఒకసారి మా మాష్టారి ఇంట్లో, "అందెల రవమిది పదములదా" అంటూ టివి లో పాట వస్తుంటో హటాత్తుగా ఆయన మొహం ఆనందంగా వెలిగిపోవడం చూసాను. ఈ పాట అర్ధం ఏంటి అని అడిగి చెప్పించుకున్నా.

మరికొన్నాళ్లకు కాలేజీలో ఉన్నప్పుడు ఖడ్గం సినిమా చూసొచ్చాక, రోజుకు పది సార్లు "నువ్వు నువ్వు" పాట వినేవాడు మా కమల్ గాడు. నేను, సాయి "ఖడ్గం" పాటలో "కెంజాయ " అనే పదం అర్ధం ఏంటి అని చర్చించుకునేవాళ్ళం. 

"జాలిగా జాబిలమ్మ" అనే పాట విన్న ప్రతీసారీ నా మనసులో శివుడు వినాయకుడు బంధం గురించి ఈ దృష్టిలో చూడొచ్చా అని ఒక ఆశ్చర్యం.

"ఘల్ ఘల్ ఆకాశం తాకేలా" పాట వింటూ మురిసిపోయిన రోజులు ఎన్నో లెక్కేస్తే కాలెండర్ మారిపోతుంది.

జర్మనీలో కొన్ని రోజులు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక పాట రోజూ నన్ను "ఛలోరే ఛలోరే" అంటూ మంచు తెరలు తొలగిస్తూ ఉషోదయం తెచ్చేది.

వామనుడు త్రివిక్రముడై మూడు అడుగుల్లో లోకాన్ని కొలిచినట్టు,
ఈయన మూడు ముక్కల్లో జీవితాన్ని కొలుస్తారు.

ఆయనకు నా శతకోటి నమస్సులు !!!!