ఇంకా బాకీ మిగిలే ఉంది



ఎన్ని జన్మలు ఎత్తానో లెక్క నాకు తెలీదు, నీకు తెలుసు కదా ప్రభూ
ఆ లెక్క నాకొద్దు, నా జన్మజన్మల బాకీ ఎప్పుడు తీరుతుందో చెప్పవా

ఒకనాడు బురదలో పడవేసావు, పంకజమై నీ పూజకు వచ్చాను
మరొకనాడు అడవిలో చెట్టుని చేసావు, నీ గుడికి ధ్వజస్తంభమై వచ్చాను
రూపమేదైనా చేరేది నిన్నే

చీమనైతే శ్రమిస్తూ, వ్యాఘ్రమైతే అడవులలో వేటాడుతూ
మేఘమైతే వర్షిస్తూ, చేపనైతే నదములలో ఈదుతూ
నెమలినైతే నర్తిస్తూ, కోకిలనైతే మధురగానం చేస్తూ
నిన్ను చేరడానికి నాకు తెలిసిన భాషలో పూజిస్తూనే ఉంటాను

ఏ జాతిలో జన్మించినా ఆ జాతి ధర్మంతో నీ బాకీ తీరుస్తూనే ఉంటా

పావురాలు

కువకువలాడే శబ్దానికి నాకు మెలకువ వచ్చింది


తెల్లమబ్బు పంపిన తెల్లపావురం,
నల్ల మబ్బు పంపిన బూడిదరంగు పావురం
కిటికీ బయట ఆడుకుంటున్నాయి

దగ్గరికి వెల్లబోతే చప్పున ఎగిరిపోయాయి
రోజూ ఇదే ఆట నాతో
ఈ పావురాలతో ఆడుకోడానికి
నాకు రెక్కలు కావాలి 
పావురాల భాష నేర్వాలి

ఒక సెలవు రోజు, పావురాలు రోజంతా అరుస్తూనే ఉన్నాయి
ఈ కాంక్రీట్ అరణ్యంలో దొరకనిది ఏదో కావాలి వాటికి
ఆ భావం తెలుసుకోవటానికి నాకు భాష అక్కర్లేకపోయింది
బియ్యపు గింజలు జల్లి దూరంగా దాక్కున్నా

ఒక్కొక్కటిగా గింజలు ఖాళీ అయ్యాయి

మనసు రెక్కలు విచ్చింది
నా ఆకలి తీరింది

చిన్ని లీలలు

సంద్రాన దాగిన ముత్యాలన్నీ కలిపి బంతి చేస్తే ఆ బుడతడు


కాంతిరేఖల తేజమంతా ఒక్కచోట నిలిపితే ఆ బుజ్జాయి

అమ్మ హృదయమెంత? ఆ సంద్రమంత

నాన్న వ్యక్తిత్వపు లోతెంత? ఆ కాంతిపుంజమంత


తల్లి కొంగుచాటునే దాగి తండ్రిని చూసి కేరింతలు కొడుతూ
రోజూ దాగుడుమూతలే ఈ పిల్లాడికి

తిధికో రీతిన తిరిగినా, తిధులెన్ని కరిగినా,
ప్రతీ ఆనందపౌర్ణమీ అమ్మ ఒడిలోనే