దృశ్యంలో అదృశ్యం

కనుల ముందున్న దృశ్యంలో అదృశ్యంగా నీ రూపు
హిమంలా ఘనీభవించిన దృశ్యం
హవనమంటి నీ రూపం
హిమంలో హవనం వెతికే ప్రయాస
నీవున్న దృశ్యంలో తక్కినదంతా అదృశ్యం, అదేనేమో ఆ అన్వేషణ

జీవనవాహినిలో అంతర్వాహినిగా నీవు
ఉప్పెనలా ఎగసిపడే వాహిని
ఉప్పెనలన్నీ గుపిట మూసిన అంతర్వాహిని
ఉప్పెనలో ప్రశాంతతను వెతికే శోధన

అనంత సంగీతంలో నిశ్శబ్దంగా నీ రాగం
శిలనైనా కరిగించే సామవేద సంగీతం
శిలలా మదిలో నిలిచిన నీ నిశ్శబ్దం

నిశీధిలో ఉదయించే వేకువ నీవు
వేకువతో జత కట్టే నా లోకం నీవు

(ఎవరి గురించో, దేని గురించో తెలియదు ఈ భావం. కలలో అలలా నా మదిని తాకిన మొదటి వాక్యం "కనుల ముందున్న దృశ్యంలో అదృశ్యంగా నీ రూపు".. దాని కొనసాగింపే ఈ కవిత)