వర్షం పిలుస్తోంది

వర్షం పిలుస్తోంది

పెంకుటింటి కప్పు నుంచి ధారగా జారుతూ,
కప్పు కింద దాక్కున్న ముత్యాలంటి పిల్లలని రమ్మని పిలుస్తోంది
కాగితపు పడవలను తీసుకెళ్తూ, మరో పడవ పంపమని కవ్విస్తోంది
పిల్లలు నవ్వితే మురిసిపోయి మెరుపులతో సమాధానమిస్తూ
అంతలోనే పెద్దరికపు హోదాలో ఉరుముతూ
ఆశగా పిలుస్తోంది, స్వేచ్ఛగా తనతో కలిసి ఆడమని
మనసులో నిద్ర లేస్తున్న పసితనాన్ని
ఎవరూ చూడకుండా పెద్దరికపు హోదాలో నిద్ర పుచ్చుతూ పెద్దలు మనసులోనే స్పందిస్తున్నారు
వర్షంలోకి పిల్లల్ని వెళ్లమని నిద్ర నటిస్తున్నారు,
అంతలోనే నిద్ర లేచి చిరుకోపం ప్రదర్శిస్తున్నారు

వర్షం పిలుస్తోంది

కాదు కాదు, వర్షం ముద్దులు కురిపిస్తోంది
నా తల నుంచి పాదం వరకు వదలకుండా ముద్దిడుతోంది
అణువణువనూ తడుముతూ, క్షణానికో విధంగా కౌగలిస్తూ
కౌగిలింతల చినుకుల దుప్పటిలో నన్ను ముంచెత్తెతూ
ఏనాడూ పొందని అనుభూతిని అందిస్తూ
మెరుపులతో కన్ను గీటుతూ, ఉరుములతో నిట్టూరిస్తూ
రేగిన మట్టి వాసనలో ఒక మత్తును జల్లుతూ
శృంగార దేవతలా ముద్దులెన్నో కురిపిస్తోంది

వర్షం పిలుస్తోంది

నిద్రపోతున్న వాగులని, ఎండిపోతున్న చెరువులనీ
తనతో పరిగెత్తమని పిలుస్తోంది
రైతుకి మట్టి సువాసన అందించి చిందులేయిస్తోంది
తను కూడా రైతుతో కలిసి నవ్వుతోంది
ఆ నవ్వులు మెరుపులయ్యాయి,
మేఘ ఘర్జనలు ఉరుములయ్యాయి
పిడుగుల బాణాసంచా కాల్చి
కొత్త పంట వేయమని, ఏరువాక సాగమని
భూమికి పచ్చ కోక తొడగమని పిలుస్తోంది

వర్షం పిలుస్తోంది

సప్తస్వరాలతో శ్వాసించే వాగేయకారుడిని
తన లాంటి గీతాన్నాలాపించమని,
అక్షరాల వెంట పరిగెత్తే కవిని
తనను బంధించే కవిత్వాన్ని వదలమని,
పాదాలతో అధ్భుతాన్ని సృష్టించే నాట్యకారుడిని
తనతో కలిసి భువన వేదికపై ఆడమని
ఇంకా ఏమేమో చెప్తోంది, ఒక్కో చినుకులో ఒక్కో కధ

వర్షం పిలుస్తోంది


ఒక్కో మేఘం ఘీంకరిస్తూ
ఉరుముల నాదాలాపన చేస్తూ, మెరుపుల నాట్యం చేస్తూ
పిడుగుల తాండవం చేస్తూ
ప్రకృతితో మాట్లాడుతూ

వర్షం పిలుస్తోంది, పదండి వెళ్దాం

5 comments:

ranjani said...

హైదరాబాదులో మాకేమో వర్షం మొదలైతే చాలా భయంగా ఉంటుంది ...

http://www.sakshitv.com/watch/4/20505/janam-manamhyderabad-rain-problem.html

మరువం ఉష said...

బావుంది..ప్రదీప్, మొదటి పాదం తుంటరి బాల్యాన్ని, దాన్ని దాటలేని నా బోటి పెద్దరికాన్ని, రెండు మీ ప్రాయపు చిలిపి ఊహని, మూడు రైతన్న మానసాన్ని, నాలుగు మనవంటి కళాకారుల పోకడల్ని కలుపుకుని ఐదు మాత్రం అచ్చంగా మా ఊరుని వర్ణిస్తూ నాకోసమే రాసినట్లుగా.. అవునూ హైదరాబాదు నుంచి ఆ వాన ని నేనిక్క్దకి పిలిచానని చెప్పిమ్ది మీరేనేవిటి? ఇలాంటి వాన రోజులు ఎన్నో కవితలు ఇదివరలో రాయించినా, బహుశా పాతవి అన్నీ మీరు చదివేఉంటారు - ఇది ఈ మధ్యన రాసా "వాన" http://maruvam.blogspot.com/2010/05/blog-post_15.html

Unknown said...

రంజని గారు,
నేను కూడా హైదరబాదులోనే ఉంటున్నా. చిన్న చిన్న కష్టాల కోసం వర్షాన్ని రావద్దంటామా.
ఉష గారు,
మీకంతగా కనెక్టయ్యాక ఇంక చెప్పేదేముంది

ranjani said...

ఫణి ప్రదీపు గారూ,
వర్షాలని రావద్దని నేనూ అనడం లేదండీ; వానా వానా వల్లప్పనే నాకిష్టం - rain rain go away కాదు; కానీ మేము అనుభవిస్తున్న వానల కష్టాలు మాత్రం చిన్న చిన్నవి కావు సుమా :(

Unknown said...

Tappadu lendi. a kashtaalu pOvaalani aasistunnaa