చీకటి - 2

నిశ్శబ్దపు నీడలో నిదురపోయే ఆకుపై,
కనిపించని రేయిలో విహరించే గబ్బిలం రెక్కపై,
కనురెప్ప పానుపుపై స్వప్నంలో విహరించే కంటిపై,
మబ్బుల దుప్పటిపై చుక్కల అలంకారంపై
భువి నుంచి దివి వరకు, సంధ్య నుంచి సంధ్య వరకు
ఆనందంగా విహరిస్తోంది చీకటి

నిశ్శబ్దపు నీడను చీలుస్తూ, నిదురించే ఆకుపై మంచు జల్లుతూ
కనిపించే ఉదయాన్ని లాక్కొస్తూ, నిశాచార విహారానికి విశ్రాంతి చెపుతూ
కనురెప్పను కదిలిస్తూ, స్వప్నాన్ని కంటి వెనుక బందీ చేస్తూ
మబ్బుల దుప్పటిని కదిలిస్తూ, చుక్కలను దాచేస్తూ
భువిని దివి నుంచి వేరు చేస్తూ, మరో సంధ్యను తీసుకొస్తూ
దూసుకువచ్చింది కాంతి…

కాదు కాదు చీకటిపై దాడి చేసింది హఠాత్తుగా
కాంతిరేఖల పంటిగాట్లతో ఎర్రబడి మాయమయ్యింది చీకటి

ఏడ దాగిందో వెతికి చెప్పండి ఆ సుందర నిశీధి

బహుశా సుందరాంగుల కేశాలలోనో
లేక కనురెప్పల కదలికలలోనో
లేక కాంతి చిందించే నీడలోనో
దాగిందేమో!

మళ్ళీ వస్తుందిగా సంధ్య ముగియగానే కనుక్కుని చెప్తా

3 comments:

భావన said...

ముగిసే దాకా ఆగితే మళ్ళీ అంతలోనే చటుక్కున ఎండ మెరుపుల వెనుక మాయమవుతుందేమో.. నడి రాతిరి వెలుగు జిలుగుల చుక్కలతో అచ్చంగాయలాడుతూ పాలపుంతల నవ్వును సప్న లోకాలకు బహుమతిస్తూ తిరిగేప్పుడే అడిగెయ్యండి ఎక్కడ దాగబోతోందో మరి. :-)
దాడీ చేసిన చీకటి జాడ లేక పారి పోయిన వైనం బానే బాధ పెట్టినట్లుంది మిమ్ములను.. ఒక నిజం చెప్పనా (ష్హ్...రహస్యం...మన మధ్యనే సుమీ) మీ వూరు నుంచి పారిఫొయొచ్చిన చీకటీ మా వూరి ఆకాశాన చుక్కలతో కలిసి ఫక్కు మంది. వొట్టు. :-)

Unknown said...

భావన గారు,
ఎక్కడా దాగినా నా చెంతకు రాకుండా ఉండదు.
నిజమా, ఆ చీకటినిటు పంపెయ్యండి

మరువం ఉష said...

చీకటి చిరునామా వెదికే పనేమిటో
నల్లనయ్య మేనిలో దాగినదేమో
తమకాన పేనవేసిన రాధమ్మ కంటిమెరుపులో నవ్వుతుందేమో
వరుని కుడిచెంపన చుక్కగ మురిసి
పడతి నునుసిగ్గు ఎడమబుగ్గన ముద్దుగ మాయమైందేమో
ఝుమ్మన్న తుమ్మెద కవ్వింత రెక్కల పరుచుకున్నదేమో
ఏమో ఎమో ఎవరెరుగని మరే తావున దాగినదేమో!