హోరున కురిసే వర్షములో చినుకుల గొడుగు
వణికించే చలిలో హిమబిందువుల తొడుగు
ఎర్రని ఎండలో గ్రీష్మకిరణపు లేపనాలు
జోలపాడు కీచురాళ్ళు
వింజామరలు వీచు దోమలు
కలలకోటకు కాగడాలెత్తు మిణుగురుల కాంతులు
కుక్కుట నాదాలు సుప్రభాత గీతాలు
అంబలి చాటున దక్కిన ఆకలి
పాదాలకు రక్ష మట్టి రేణువుల సమూహం
శ్రమజీవన సౌందర్యపు నిలువెత్తు చిత్తరవు అతను
ఎర్రని సూరీడుని వెక్కిరిస్తూ వెలికి వెచ్చాయి
ఎచటో దాగిన స్వేద బిందువులు,
ఆ స్వేదమందు దాగింది శ్రమజీవన హరివిల్లు
మరో ప్రపంచపు ద్వారాన్ని చేధించిన గురి తప్పని విల్లు
6 comments:
చాలబాగుంది .
చిన్ని గారు,
ధన్యవాదములు
మూడు పాదాల్లో శ్రమజీవిని ఆవిష్కరించి, చివరగా ఆతని స్వేదాన ఉద్భవించే హరివిల్లుని సాక్షాత్కారం చేసారు. బాగుంది. ఆ మరోప్రపంచం త్వరగా సృష్తించబడి ఆ స్వేదమే పెట్టుబడిగా శ్రమైకజీవన సౌందర్యాన్ని అతనివంటి ఎందరో అస్వాదించాలని, అవినీతి, ఆకలి అనాధలై అంతరించిపోవాలని ఆకాంక్షిస్తూ..
ఉష గారు,
నా అసలు ఆలోచన అంతా మొదటి మూడింటీ మీదే కేంద్రీకృతం చేసి రాసాను. నిజానికి ఇది హరివిల్లు సంకలన సమయంలో వచ్చిన ఆలోచనే, కానీ మొదటి మూడు పాదాలు ఈ మధ్య వచ్చిన ఆలోచన, చిక్కదనం సృష్టించాయి
మీ సత్యశోధనకి వ్యాఖ్యరాద్దామని చూస్తే, నా విహరిణిలో ఆ టపాకింద వ్యాఖ్యల పెట్టె కనబళ్ళేదు. చాలా బాగా రాశారు.
ఈ పద్యం కూడా చాలా బావుంది. మీరు కొత్త కొత్త కవిసమయాల్ని ఆవిష్కరిస్తున్నారు.
కొత్త పాళీ గారు,
ఏమోనండి మరి ఎందుకు రాలేదో మీకు ఆ డబ్బా,
"కొత్త కవి సమయాలు" - నాకు అర్ధం కాలేదు సుమా
Post a Comment