ప్రభాతమంతా నాదే సుప్రభాతనాదమూ నాదే

జగతితో పని నాకేల,
ప్రభాతమంతా నాదే సుప్రభాతనాదమూ నాదే
,
పసిపాపడునై నింగినంతా విహరిస్తా

అగ్నిని ఆటబొమ్మలా నా అరచేత బంధించి
పెదవుల బంధించిన గాలితో అగ్నిపై స్వారీ చేస్తా
గాలీ అగ్నీ కలిసి కలవరపడుతుంటే
చిరుజల్లుల సంధ్యను రప్పిస్తా
చిరుజల్లుల గంగను నా శిశుజడలలో బంధించి
పసిపాపడునై చిన్నిచిన్ని పాదాలతో భూమంతా తాండవనాట్యం చేస్తూ
లేని రెక్కల తోడు తెచ్చుకుని మబ్బుల గుర్రాలపై ఎగురుతూ
ఉరుముల గెంతులతో తాండవిస్తూ జగమంతా నాదే అని చాటుతా
జల్లుల మధ్యలో గీసే హరివిల్లూ నాదే

వెన్నెల మెరుపులు నావే
చుక్కలను కలిపి గీసే మాంత్రిక దండమూ నాదే
నిశీధి నిశ్శబ్దాన్ని నా నిశ్వాస ఆశ్వాసాల నడుమ బందీని చేస్తా

ప్రపంచమంతా నాదే
ప్రభాతమూ సంధ్యా సమయమూ అన్నీ నావే

చేతి గీతలు

చేతి గీతలు నా భవిష్యత్తు చెప్తాయన్నారెవరో
హస్త రేఖలు బాగుంటే పట్టినదంతా బంగారమన్నారు మరెవరో
 
 
ఏమో అది నిజమో కాదో నాకు తెలీదు
నిజమేనా అని దేవుడినే అడిగా, చెప్పాడు అవి ఏమిటో
వెంటనే పరిగెత్తికెళ్లి అమ్మనడిగా నిజమేనా అని ?
అమ్మ నవ్వి తన చేతిలో రేఖలు చూపించింది.
 
 
దేవుడేమి చెప్పాడని జాతకనిపుణులు అడిగారు

నేను బిందువుగా అమ్మ కడుపులో చేరి
దాన్నించి ఎప్పుడు బయటకొద్దామా అని
కడుపు బంధిఖానా అనుకుని తన్నేవాడినట
తన్నిన ప్రతిసారీ దేవుడు నా అరచేతి మీద కొట్టేవాడట
ఆ దెబ్బలే ఇప్పుడు రేఖలుగా మిగిలాయట

బిందువై మొదలై బాంధవ్యాలు పెంచుకుని
అవి తిరిగి తెంచుకుని బూడిదిలా మారే వరకు
ఆ తొమ్మిది నెలలను గుర్తు పెట్టుకోమని ఇచ్చిన చేతి గీతలట

అవునేరీ ఆ జాతక నిపుణులు? బహుశా అమ్మ దగ్గరికెళ్ళారేమో?

ఎంత రాక్షసత్వం ?


నాలో ఉత్తేజాన్ని నింపుదామని ప్రతీ క్షణం తానొస్తోంది
ఎంతో ఆవేశంగా ప్రతీ క్షణం తనను తరిమేస్తున్నా!
ఉత్తేజాన్ని అతి క్రూరంగా చంపేస్తున్నా

నా పుట్టుక నుంచీ తను ప్రయత్నిస్తూనే ఉంది,
నా క్రూరత్వానికి వీడ్కోలు తానే చెప్పి
చివరకు చావుపందిరి పై నాట్యమాడి పోతుంది

నిరాకారమై తనలో కలిసాక
నేను సైతం మరొకరిని ఉత్తేజితం చెయ్యడానికి ప్రయాణం మొదలుపెట్టా
నన్ను తరిమేస్తూ ఉన్నా లెక్క చెయ్యకుండా ప్రయత్నిస్తూనే ఉన్నా

చరిత్ర పుటల నుంచి నిద్ర లేచి తరిమే ఈ నిరాకారవాయువులెన్నో
ఆ శ్వాసల్లో మునిగి తేలి ఈ రాక్షసత్వాన్ని చంపాలి

ప్రతీ క్షణం ఉత్తేజభరితం, మరుక్షణం ఉల్లాసభరితం

---
It's been a really long time since I wrote something.... I hope I wokeup with enough inspiration today morning

పరిణయం


దూరమెంత కొత్త లోకానికి ? ఏడడుగులు
తలపై ముద్దులతో స్వాగతించేదేలా? తలంబ్రాలు రాల్చి
సాగరమధనం చేసేదెలా? నాలుగు చేతులు కలిపి
ఆశల నక్షత్రాన్ని కాంచేదెలా? కళ్ళుకళ్ళు కలిపి

కడలి ఎడారి శిఖరం

కష్టాల కడలిలో సుడిగుండాల మధ్యలో తెరచాప తెగిన నావలో పయనం చేస్తూ
కష్టాలను దూరం చేయమని దేవుణ్ణి ప్రార్ధిస్తే
కష్టాలను తాను తాగేసి, సుడిగుండాలను పాతి పెట్టి నావను మాయం చేసి
నిర్జీవపు ఎడారిలో నిలబెట్టాడు

ఉప్పరుచి కన్నీళ్లు కడలిలో తోడిచ్చి, కష్టాలను హృదయభావనగా చేసి
హృదయాన్ని బండబార్చి, ఆ బండల ఎడారిలో ఎండమావి కోసం వెతకమని శాసించిన
ఆ బండరాతికేం తెలుసు కడలికి ఎడారికీ పెద్ద తేడా లేదని

విజయశిఖరం చేర్చమని ప్రార్దిస్థే ఆరోహణలో సర్వం త్యజించమని చెప్పి
అవరోహణా మార్గంలో ఘనీభవించిన అనుభవాల రాళ్ళను పేర్చి
ఒంటరిగా పైనే ఉండమని శాసించాడు
శాసన ధిక్కారం చేయబోతే వాహినిగా లోకసంచారం చేయమన్నాడు

కష్టాలు ఆవిరైతే జీవం నిర్జీవం
ఎడారినైనా సస్యశ్యామలం చేయమని శాసనం
విజయ పయనంలో అనుభవ శిఖరం చేరమని ఆన
ఎన్నటికీ అర్ధం కాని దైవలీల