ప్రభాతమంతా నాదే సుప్రభాతనాదమూ నాదే

జగతితో పని నాకేల,
ప్రభాతమంతా నాదే సుప్రభాతనాదమూ నాదే
,
పసిపాపడునై నింగినంతా విహరిస్తా

అగ్నిని ఆటబొమ్మలా నా అరచేత బంధించి
పెదవుల బంధించిన గాలితో అగ్నిపై స్వారీ చేస్తా
గాలీ అగ్నీ కలిసి కలవరపడుతుంటే
చిరుజల్లుల సంధ్యను రప్పిస్తా
చిరుజల్లుల గంగను నా శిశుజడలలో బంధించి
పసిపాపడునై చిన్నిచిన్ని పాదాలతో భూమంతా తాండవనాట్యం చేస్తూ
లేని రెక్కల తోడు తెచ్చుకుని మబ్బుల గుర్రాలపై ఎగురుతూ
ఉరుముల గెంతులతో తాండవిస్తూ జగమంతా నాదే అని చాటుతా
జల్లుల మధ్యలో గీసే హరివిల్లూ నాదే

వెన్నెల మెరుపులు నావే
చుక్కలను కలిపి గీసే మాంత్రిక దండమూ నాదే
నిశీధి నిశ్శబ్దాన్ని నా నిశ్వాస ఆశ్వాసాల నడుమ బందీని చేస్తా

ప్రపంచమంతా నాదే
ప్రభాతమూ సంధ్యా సమయమూ అన్నీ నావే

2 comments:

రసజ్ఞ said...

చాలా బాగా వ్రాశారు!

మరువం ఉష said...

సరే అలాగే! ;)
"లేని రెక్కల తోడు తెచ్చుకుని" - పైన రాసిన ఊహాజగత్తు విన్యాసాలకి (ఉదా: అగ్నిని ఆటబొమ్మ చేయటం, గంగని శిశుజడలలో బంధిచటం) లేని ఇబ్బంది - మేఘాలపై రెక్కల గుర్రపు స్వారీకి ఎందుకు అడ్డు? 'లేని రెక్కల తోడు తెచ్చుకుని' అన్న వివరణ ఎందుకు? ఉదయపు సంధ్యారాగాల, నిశి వేళల నిర్భీతిరావాల కాంక్షలు బాగున్నాయి.