పొంగిపొరలాల్సిన వాగులు అలసటతో ఆగాయి,
తమ దాహాన్ని తీర్చమని నింగి వంక పిచ్చి చూపులు చూస్తున్నాయి
క్షేమమా అని అడిగే పిలుపులు
క్షామం లేదు కదా అని వస్తున్నాయి
కరువుని పరుగెత్తించే జలదేవత ఏ మూల నక్కిందో
కరువే పరుగెడుతోంది ఇనప గజ్జెల తల్లిలా
ఈ దృశ్యాలు చూసి తట్టుకోలేక భూమాత కన్నీరు కార్చింది
భూమాత మోముపై కన్నీటి చారికలై నిలిచింది
సముద్రుడి కన్నీళ్లకు అంతే లేదు, సంద్రమంతా ఉప్పు కట్టింది
తనను ఆవిరి చేసి కరువు తల్లిని అభిషేకించమని సూరీడిని కోరాడు
సూరీడు వేడి పెంచాడు, సంద్రాన్ని ఆవిరి చేస్తూ పోతున్నాడు
వేడికి తట్టలేని సహనమాత రాళ్ళను ముక్కలు చేసింది
గలగలా పరుగెత్తే జీవనదులు, విలవిలలాడుతూ కూలబడ్డాయి
భూమాతకు ఆభరణాలు ఆ నదులు, కరువుకి తాకట్టు వెళ్ళాయి
పంటలకు ఎరువు వేసే అవసరం లేదు,
కరువుకు వెయ్యాలేమో ఎరువులు
పచ్చటి ఆకులు ఎండినా
వెచ్చని పక్షిగూళ్ళు చెదిరినా
చూసిన మనిషి గుండె పగిలినా
కరువు గుండె కరగలేదు
(** ఇంతవరకూ ప్రస్థుత కరువు గురించి, కిందవి కరువు తగ్గితే అన్న ఊహకు రూపం **)
వాగుల బేల చూపులు చూసి కరిగింది పైన దేవుని గుండె
దాహాన్ని తీర్చ వరుణుడిని పంపాడు వాయుదేవుని తోడు ఇచ్చి
క్షామాన్ని మరోమారు నిఘంటువులో దాచి క్షేమాన్ని తవ్వి తీసాయి పిలుపులు
జలదేవత పొంగింది తాండవమాడుతూ
ఇనుప గజ్జెల తల్లి జడిసి ఎడారుల బాట బట్టింది
వెనుకే కదిలింది జలదేవత, కరువుని కరువు చెయ్యనుందేమో
సముద్రుడి కన్నీళ్ళు భూమాతను అభిషేకింప
నల్ల మబ్బుల పంచను చేరాయి, అయినా ఏదో ఉప్పదనం
ఏ మూలన కరువు చూసాడో సముద్రుడు
రాళ్ళ ముక్కల మధ్య దూరి ముందుకు దూకింది జలతరంగిణి
జీవనదుల జీవం మరో మారు వచ్చింది,
కరువు తాకట్టు నుంచి బయటకు వచ్చి భూమాతకు ఆభరణాలై నిలిచాయి
కరువుకు వేసిన ఎరువు వికటించింది
పంటలకు వేసే ఎరువుని తెమ్మని రైతుని పంపింది
పచ్చని ఆకులు వికసిస్తే
వెచ్చని పక్షిగూళ్ళలో పిచ్చుక కూసింది
మనిషి గుండెకు ఏదో అర్ధమైంది
ఎదలోతుల తను చేసిన తప్పులు తెలిసాయి
ఎద ఆర్ధ్రమైనా మెదడు వినేనా
పశ్చాతాపాన్ని ప్రకటించి ప్రకృతి ఒడిలో సేదతీరేనా ?
7 comments:
చాలా చక్కగా, ఇప్పుడు మనము ఎదుర్కొంటున్న పరిస్థితిని మొదటి భాగములో వివరించారు. దీనికి కారణం మనమే అని మనమందరము గ్రహించాలి. కాని, గతాన్ని వదలి భవిష్యత్ కొరకు ఏమిచేయాలో ఆ కృషిని సల్పితే, ఆ భగవంతుడు కూడా మనకు సహకరించి రెండవ భాగములో వర్ణించిన ప్రకారం సంభవించే ఆస్కారం ఉంది. మీ పదజాలం ఆకట్టుకుంది.
>>క్షేమమా అని అడిగే పిలుపులు
>>క్షామం లేదు కదా అని వస్తున్నాయి
ఇది చాలా చక్కగా సందర్భోచితముగా ఉన్నది.
చాల చక్కగా ఇప్పటి పరిస్థితిని వివరించారండి..
...కనుక ప్రకృతి మనిషి దారుణాలకి విలయమై క్షామమై వికృతై ఎంత దాష్టికాలు చేయగలదో చూపారు, అదే ప్రకృతి మనిషి తన తప్పిదాన్ని తెలుసుకుంటే విశాలమై క్షేమమై పరవశించి జీవమిచ్చి మనుగడకి మంచి గంధపు దీవెనలూ ఇవ్వగలదని రెండో పార్శ్వంలో చూపారు. శభాష్. అదే కావాలి, అమానుషం, అనౌచిత్యం, నైరాశ్యం పారద్రోలు నిబ్బరత, నిజాయితీ మనిషిలో రావాలి.
పచ్చని ఆకులు వికసిస్తే
వెచ్చని పక్షి గూళ్ళలో పిచ్చుక కూసింది
బాగుంది సార్, మనం మన వేలితో మన కన్నే పొడుచుకుంటున్న వైనాన్ని బాగా చూపారు. దృశ్య కావ్యం.
@సాయి ప్రవీణ్ గారు,
ధన్యవాదాలు అని చెపితే ప్రస్థుత కరువు పరిస్థుతుల మీద ఏదో ఊసపోక రాసినవాడినవుతాను. ఏదో చెయ్యాల్సినది మిగిలే ఉంది అని మనం గ్రహిస్తే ఈ కవిత ముఖ్యోద్దేశం నెరవేరినట్టే
@పద్మార్పిత గారు,
ఎంత రాసినా ఆ పైవాడి మనసు కరుగుతుందా..కరువు పారిపోతుందా
@ఉష గారు,
ఏమి శభాషో...ఈ కరువు విశ్వరూపం రాబోయే వేసవిలో ఎలా ఉంటుందో ఊహించుకుంటే భయమేస్తోంది
@వర్మ గారు,
నన్ను సర్ అని పిలిచి పెద్దోడిని చెయ్యొద్దు. ఇప్పటికైనా అందరూ గ్రహిస్తే ఏదో ఒకటి చెయ్యగలిగితే చాలు.
చాలా బాగా రాశారు సందర్భోచితంగా ఉంది
పశ్చాతాపాన్ని ప్రకటించి ప్రకృతి ఒడిలో సేదతీరేరోజు దగ్గర్లోనే ఉంది
త్వరలోనే ఆ రోజు వస్తుందని ఆశిద్దాం
Post a Comment