శ్వేతశిఖరాలపై ధ్యానముద్రన మునిగి ఉన్నాడు ఆ శంకరుడు
శివుడు బాధలోనున్నాడేమో ప్రకృతి కూడా నిర్వేదంగా ఉంది,
ఆ నిర్వేదపు శిశిర ప్రకృతికి ఏకైక శోభ ఆమె, పార్వతి
ఆ శంకరుడు కొలువున్నది ఆ పార్వతి హృదయశిఖరాలపైనేమో
ఆమె హృదయమున ఏనాడో ఆసీనుడాయెను ఆ శంకరుడు
అది తెలియని బేల కాదే ఆ పార్వతి,
వారి వివాహసమయం కోసమే కాదా ఆ నిర్వేదపు ప్రకృతి ఎదురుచూపులు
అదీ తెలుసు ఆ పార్వతికి...
ఆ ధ్యానముద్రను కదలించ శివుని కంఠమున దాగిన గరళం
మూడోకన్నున వెలువడునని తెలియునే
తెలిసిననూ ముందుకు సాగెను మన్మధుడు వారించు రతీదేవిని తోడ్కొని
మన్మధునికి ఆ ధైర్యమేలనో.... విధి నిర్వహణను నమ్మిన యోగేమో ఆతడు
కోయిలలచే కూయించెను, మల్లెల సువాసనలు వెదజల్లెను
సుందరీమణులతో నాట్యము చేయించెను
ఎన్ని యత్నములనైనూ చెక్కుచెదరలేదు ఆ శంకరుడు
బ్రహ్మాస్త్రమో మరేమో, ఆ హరిని ప్రార్ధించి "హరివిల్లు" ను ఎక్కుపెట్టె
శ్వేతశిఖరపు మంచుని కరిగించి
శ్వేతశిఖరపు సిగలో అందమైన ఒక చిత్తరువు గీచెను
ఆ చిత్తరవు గీచినంతనే ధ్యానముద్రను వీడెను ఆ శంకరుడు
భస్మీపటలమాయెను మన్మధుడు,
భస్మమాయినది మన్మధుడు కాదేమో?
శ్వేతశిఖరముపై హరివిల్లుని కనిన అనిర్వచనీయ అనుభూతిన
బూడిదయ్యినది కామమేమో ?
రతీదేవి దు:ఖమును తీర్చ ఆమెకు ప్రసాదించే తన ధ్యానసాధన
శ్వేతశిఖరమున హరివిల్లు కనిన క్షణం ఒక జంట కలిసె,
మరొక జంట ధ్యానముద్రన మునిగె
ఆ జంటను కలిపెడివాడు మన్మధుని పంపిన హరే కదా
ఈ జగన్నాటకసూత్రధారే కాదా ఆ నల్లన్నయ్య
(హరివిల్లు అనే టపాలో మూడు కవితలు రాసాను. ఇది సప్తకవితల సంకలమున నాలుగవది)
9 comments:
హరి పాదాలనుంచి ఉద్భవించి,
హరుని శిఖలో సుడులు తిరిగి,
పరవళ్ళు త్రొక్కుతూ క్రిందకు దుముకుతూ,
అక్కడక్కడ ప్రశాంతగమనలా,
మంద్రంగా ప్రవహించే గంగమ్మలా,
సాగిపోతున్న మీకవితా ప్రవాహంలో
మునకలు వేస్తూ,ఆస్వాదిస్తూ సాగిపోవడం మినహా
మేము చేయగలిగిందేమీ లేదు.
గిరిజా కల్యాణం - మీ ఈ హరివిల్లుకి ఆత్మ. తెలిసినదే అయినా చదువుతూ వస్తుంటే అంకాలన్నీ వివరంగా చిత్రీకరించారు. క్లుప్తత అన్నది విడిస్తే భావం ఏ దోషం లేకుండా చక్కగా అమర్చారు. మేము "గిరిజాకల్యాణం" అభినయించిన నృత్య నాటికలో నాది శివుడి పాత్ర, నటరాజ రామకృష్ణ గారు నన్ను ఎంతగానో అభినందించారు. కానీ నాకు ఈ కాముని దహనం చాలా బాధగా, ప్రశ్నార్థకంగా ఇప్పటికీ వుంటుంది. హరి ఆనపై హరుని హిమపుత్రికి పరిణయం జరిపిన అంశంలో తన వంతు కర్తవ్యం నెరవేర్చిన మన్మధుడు ఎందుకు భస్మం అవ్వాలి అని. భర్తని అనుసరించిన రతీదేవి పతివియోగం పాల ఎందుకు పడాలి అని. ఈ ఎందుకు అన్న శోధన, చింతన మరింత ఎదగటానికి జిజ్ఞాసే కానీ తర్కపరమైన ప్రశ్నలు కావివి. అది గమనించగలరు.
ఇక పోతే మిగిలినవి, రెండు మీరు ఒకటి నేను పంచుకుందామా. మాటిచ్చాను కనుక నెరవేర్చటం నా వంతు, అంగీకరించటం మీ అభీష్టం అనుకోండి,
విజయ మోహన్ గారు,
మరీ అంతలా మునగ చెట్టెక్కించకండి సార్.. ప్రస్థుతానికి గంగ గురించి వ్యాఖ్య రాసారు గా నేను రాసిన గంగమ్మ పరవళ్ళు కూడా చదవండి (http://pradeepblog.miriyala.in/2009/06/blog-post_21.html)
ఉష గారు,
గిరిజా కల్యాణంలో మన్మధుడు భస్మమవడం బాధా కరమే, అందుకే
"భస్మీపటలమాయెను మన్మధుడు,
భస్మమాయినది మన్మధుడు కాదేమో?
శ్వేతశిఖరముపై హరివిల్లుని కనిన అనిర్వచనీయ అనుభూతిన
బూడిదయ్యినది కామమేమో ?
రతీదేవి దు:ఖమును తీర్చ ఆమెకు ప్రసాదించే తన ధ్యానసాధన" అని రాసాను. ఎందుకో మీకు తెలిస్తే చెప్పరాదూ ?
ఇక మిగిలిన మూడింటిలో ఒక కవితకు ఇప్పుడే ఆలోచన ఉదయించింది. బహుశా రాత్రికల్లా రెక్కలు తొడగవచ్చు
మీరు రాస్తానంటే అంతకన్నానా... కానీ ఒక చిన్న షరతు, శుక్రవారం లోపు రాయగలరా ?
ఎందుకంటే అటు పిమ్మట నేను భారతదేశ ప్రయాణంలో ఉంటాను, మళ్ళీ నాకు తీరిక ఎప్పుడు దొరుకుతుందో, ఎప్పుడు చదవగలనో ?
సరే మీ షరతుకి చిన్న మార్పుతో వొప్పుకుంటున్నాను, నా నుండి గురువారం ఉదయం లోపు కవిత రాకపోతే మీరే వ్రాసేయండి. హరివిల్లు మీద నా వద్ద అసంపూర్తి కవిత ఒకటి వుంది, అది పూర్తి చేయనా లేక మీ బాణీలో హరి హరుల సంకలనానికి అదే మాదిరిది జోడించనా అని చూస్తున్నాను. మీకెలా పంపాలి?
హరిహరులపైనే అనికాదు, ఎలా రాసినా సరే..
మీరు మీ బ్లాగులోనే రాయవచ్చు, కావాలంటే నేను దాన్ని మరలా పబ్లిష్ చేస్తాను.
ఉహూ అలా కాదు అంటే నాకొక మెయిల్ కొట్టండి (pradeep@miriyala.in)
గురువారం ఉదయం అంటూ చాలా తక్కువ సమయం ఇచ్చారు, మళ్ళీ మూడు కవితలు రాసే భావావేశం వస్తుందో రాదో...
అద్భుతంగా ఉంది ! ఇంతకంటే ఏం రాయను ?
పరిమళం గారు,
ధన్యవాదాలు. మా సప్తకవితా సంకలనం కూడా చూడండి.
చదివాను అందుకే ఆ గంగమ్మ పరవళ్ళకూ,ఈ హరిహరులకూ జత కలిపా
@విజయమోహన్ గారు,
మొత్తానికి నా దారిలోనే ఎదురొచ్చి వ్యాఖ్య ఇచ్చారన్నమాట. సంతోషం
Post a Comment